ఒక యాంగిల్ మాత్రమే బయటపెడుతున్న కేసీఆర్!

‘‘ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులతో కేసీఆర్ మాట్లాడుతున్నారు. కేంద్రంలోని బిజెపికి వ్యతిరేకంగా పోరాడడం గురించి వారి మద్దతు కూడగడుతున్నారు. వారందరూ కూడా కేసీఆర్ ప్రతిపాదనలకు జై కొడుతున్నారు..’’ ఈ తరహా అధికారిక ప్రకటనలు లేదా, లీకులు…

‘‘ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులతో కేసీఆర్ మాట్లాడుతున్నారు. కేంద్రంలోని బిజెపికి వ్యతిరేకంగా పోరాడడం గురించి వారి మద్దతు కూడగడుతున్నారు. వారందరూ కూడా కేసీఆర్ ప్రతిపాదనలకు జై కొడుతున్నారు..’’ ఈ తరహా అధికారిక ప్రకటనలు లేదా, లీకులు మీడియాలో ప్రతి నాలుగైదు వారాలకు ఒకసారి క్రమం తప్పకుండా వస్తూనే ఉంటాయి. అవి చదివిన ప్రజల్లో, ప్రధానంగా ఆయన అభిమానుల్లో..  కేసీఆర్ ఇక ప్రధాని అయిపోవడమే తరువాయి. దేశమంతా ఆయనకు నీరాజనాలు పడుతోంది అనే అభిప్రాయం ఏర్పడుతూ ఉంటుంది. కానీ.. జరుగుతున్న పరిణామాల గురించి కేసీఆర్ కోటరీ వ్యూహాత్మకంగా ఒక యాంగిల్ లోని వివరాలను మాత్రమే వెల్లడిస్తోందా? రెండో యాంగిల్ కూడా ప్రజలు గమనిస్తే.. ఇంతగా భ్రమలకు గురికాకుండా ఉంటారా? అనే చర్చ ఇప్పుడు తలెత్తుతోంది. 

తాజాగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో కేసీఆర్ తాజాగా కూడా జాతీయ నాయకులతో మాట్లాడినట్లుగా వార్తలు వచ్చాయి. సాధారణంగా ఆయన మాట్లాడే జాబితాలో బిజెపియేతర, కాంగ్రెసేతర ప్రముఖులందరూ ఉంటారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్, తేజస్వీ యాదవ్, అఖిలేష్, స్టాలిన్ అనుచరులు.. ఇలా అందరితోనూ మాట్లాడి.. పార్లమెంటు సమావేశాల్లో బీజెపీ వైఖరిని ఎండగట్టడం గురించి కేసీఆర్ అడిగారట. వారందరూ సానుకూలంగా స్పందించారట. గులాబీ పార్టీ తెలియజేసే ఈ వివరాలు చూస్తే.. కేసీఆర్ అందరినీ కూడగడుతున్నట్టుగా కనిపిస్తుంది.

కానీ గమనించాల్సింది ఏంటంటే.. కేసీఆర్ ఫోను చేసి మాట్లాడకపోతే.. పైన పేర్కొన్న నాయకులకు చెందిన పార్టీల వారంతా.. రాబోయే వర్షాకాల సమావేశాల్లో బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తారా? అలాంటి అవకాశం లేదు కదా? మరి కేసీఆర్ ఫోను చేసి ప్రత్యేకంగా సాధించిన వ్యతిరేకత, రగిల్చిన పోరాటస్ఫూర్తి ఏముంటుంది?

కేసీఆర్ కు తన లోకల్ కండిషన్స్ ను బట్టి.. కాంగ్రెస్ పార్టీ కూడా లేని కూటమి కావాలి. ఆ కూటమి, తన రాష్ట్రంలో తన ప్రభుత్వానికి ప్రమాదకరంగా మారుతున్న బిజెపిని భయపెట్టాలి. కేసీఆర్ లోని భయం కోసం.. ఆయన కోరుకున్నట్టుగా జాతీయ పార్టీలు అన్నీ ఏకతాటిమీదకు రావాలంటే  ఎలా కుదురుతుంది? కేసీఆర్ కు ఉన్న లెక్కల మాదిరిగానే.. ఆయా రాష్ట్రాల్లో ఎవరి లెక్కలు వారికి ఉంటాయి కదా అనేది విశ్లేషకుల వాదన!

కేసీఆర్ మాటలను ఆలకిస్తున్న ఇతర రాష్ట్రాల నాయకుల్లో.. అందరూ ఆయన చెప్పిన ప్రతిపాదనలకు జై కొడతారని అనుకోవడానికి వీల్లేదు. కేవలం కాంగ్రెస్ ను పిలిచారని.. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం మమతా దీదీ పిలుపు ఇచ్చిన సమావేశానికి డుమ్మా కొట్టిన కేసీఆర్ ‘సహకారాన్ని’ ఆమె ఎలా మర్చిపోతారు. రేపు కేసీఆర్ ఏదైనా ప్రతిపాదన పెడితే.. బేషరతుగా ఎలా జై కొడతారు? ఇలాంటి సమీకరణలు అనేకం ఉంటాయి. 

అయితే.. కేసీఆర్ ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు? మీకు వ్యతిరేకంగా నేను జాతీయ పార్టీలన్నిటినీ కూడగడుతున్నా జాగ్రత్త.. అని బిజెపిని బెదిరిస్తూ.. తద్వారా.. వారిని తన సొంత రాష్ట్రంలో దూకుడు తగ్గించేలా ఆత్మరక్షణలో పడేయాలన్నది గులాబీ దళపతి వ్యూహం కావొచ్చు. కానీ అది అంత తేలికైన విషయం కాదు.