అన్ని మెట్లూ దిగేసిన షర్మిల!

వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ధీరోదాత్తుడైన నాయకుడి కూతురు కనీసం ఒక ఎన్నిక వరకైనా తన ప్రస్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం లేదా? కనీసమాత్రమైన పట్టుదలను, ఆత్మవిశ్వాసాన్ని ఆమె కనబరచలేకపోతున్నారా? తాను స్తాపించిన వైఎస్సార్…

వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ధీరోదాత్తుడైన నాయకుడి కూతురు కనీసం ఒక ఎన్నిక వరకైనా తన ప్రస్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం లేదా? కనీసమాత్రమైన పట్టుదలను, ఆత్మవిశ్వాసాన్ని ఆమె కనబరచలేకపోతున్నారా? తాను స్తాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీని, కాంగ్రెసులో విలీనం చేయడానికి, తద్వారా తన రాజకీయ జీవితానికి మినిమం గ్యారంటీ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఆమె తహతహలాడుతున్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి. 

సమకాలీన రాజకీయ పరిణామాలను గమనిస్తోంటే.. షర్మిల సొంత పార్టీకి ఇక తెరపడినట్టేనని పలువురు భావిస్తున్నారు. ఎంతో సంచలనం కాగలదని అనిపించిన షర్మిల.. రాజకీయంగా రాజీపడడంలో ఇక అన్ని మెట్లూ దిగేసినట్లేనని, సొంత ప్రస్థానానికి ఎండ్ కార్డ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉన్నదని వ్యాఖ్యానిస్తున్నారు.

రాహుల్ గాంధీకి పడిన జైలు శిక్షకు సంబంధించి.. సుప్రీం కోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వనే లేదు. సూరత్ కోర్టు విధించిన జైలుశిక్షను ఇంకా కొట్టేయలేదు. ఆ తీర్పుపై స్టే మాత్రమే విధించింది. ‘ప్రస్తుతానికి’ ఆయన పార్లమెంటు సభ్యత్వం రద్దు కాదు అని చెప్పింది. ఇలాంటి మధ్యంతర ఉత్తర్వుల గురించి.. తెగ మురిసిపోయి, అక్కడికేదో అద్భుతం జరిగిపోయినట్టుగా.. అధర్మం మీద ధర్మం గెలిచినట్టుగా టముకు వాయిస్తూ.. కాంగ్రెస్ శ్రేణులు పండగ  చేసుకుంటే తప్పులేదు. ఎందుకంటే, అలాంటి తప్పుడు ప్రచారాలతో, తప్పుడు మైండ్ గేమ్ లతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ పబ్బం గడుపుకోవడం వారికి కొత్త కాదు. కానీ ఆ ఉచ్చులో షర్మిల కూడా ఎందుకు పడుతున్నారు?

తెలంగాణలో తాను పార్టీ స్థాపించిన తర్వాత.. సుదీర్ఘమైన పాదయాత్రను కొనసాగిస్తూ.. కేసీఆర్ సర్కారు మీద నిశిత విమర్శలతో విరుచుకుపడిన ధైర్యం షర్మిల సొంతం. ఆమె పట్ల ప్రభుత్వమూ, పోలీసులూ అమానుషంగా ప్రవర్తించినప్పుడు సాక్షాత్తూ ప్రధాని కూడా ఫోనుచేసి పరామర్శించిన హైప్రొఫైల్ కూడా ఆమె సొంతం. ఆ రకంగా తెలంగాణ రాజకీయాల్లో ఆమె ప్రకంపనలు సృష్టించారు. 

కర్నాటకలో పార్టీ గెలిచిన నాటినుంచి.. షర్మిల కాంగ్రెసులో చేరుతారనే ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతూ ఉంది. ఆమె వాటిని ఖండించడం లేదు. అయితే ఏపీలో పార్టీ బాద్యతను కూడా చూడాల్సి ఉంటుందని కాంగ్రెస్ కండిషన్ పెడుతున్నట్టుగా ప్రచారం ఉంది. మధ్యలో తన సొంత అన్న జగన్ కు గ్రీటింగ్స్ చెప్పడం గురించి కూడా ఇటీవలి కాలంలో పట్టించుకోవడం మానేసిన షర్మిల రాహుల్ పుట్టినరోజు నాడు మాత్రం ఘనంగా శుభాకాంక్షలు చెబుతూ ఒక మెట్టు దిగారు. ఆమె పార్టీ విలీనం వార్తలు మరింత జోరందుకున్నాయి.

తాజాగా రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వం పునరుద్ధరణ అయినందుకు షర్మిల, కాంగ్రెస్ నాయకుల కంటె అతిగా మురిసిపోతున్నారు. న్యాయం ధర్మం గెలిచాయనడానికి సుప్రీంకోర్టు తీర్పే ఒక ఉదాహరణ అని ఆమె ట్విటర్ ద్వారా వెల్లడించడం విశేషం. 

రాహుల్ గాంధీ పార్లమెంటుకు తిరిగి రావడం దేశానికి ఎంతో అవసరం అని, పార్లమెంటులో ఆయన గళం వినడం కోసం దేశం ఎదురుచూస్తోందని శ్లాఘించారు. ఆయనను ఆమె పొగడుతున్న తీరు గమనిస్తే.. కాంగ్రెసులో విలీనం కావడానికి గ్రీన్ సిగ్నల్ కోసం ఆమె రాజీపడడంలో అన్ని మెట్లూ దిగేసినట్టేనని.. రాహుల్ దయ కోసం ఎదురుచూస్తున్నదని పలువురు విశ్లేషిస్తున్నారు.