బ్యాలెన్స్ తప్పిన చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాల్లోకి అడుగుపెట్టి, వెనక్కు వచ్చేసిన వ్యక్తి. మెగాస్టార్ గా సుప్రసిద్ధమైన ఆయన సుదీర్ఘ జీవితంలో.. ‘రాజకీయం’ అనేది ఒక ఫెయిల్యూర్ ఎపిసోడ్. విఫల నాయకుడిగా ఆయన ప్రస్థానం ఎప్పటికీ ఒక మరకగానే…

మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాల్లోకి అడుగుపెట్టి, వెనక్కు వచ్చేసిన వ్యక్తి. మెగాస్టార్ గా సుప్రసిద్ధమైన ఆయన సుదీర్ఘ జీవితంలో.. ‘రాజకీయం’ అనేది ఒక ఫెయిల్యూర్ ఎపిసోడ్. విఫల నాయకుడిగా ఆయన ప్రస్థానం ఎప్పటికీ ఒక మరకగానే గుర్తుండిపోతుంది.

ముఖ్యమంత్రి అయిపోగలననే విశ్వాసంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చిరంజీవి.. ప్రజలు తిరస్కరించిన తర్వాత.. వారి తీర్పును గౌరవించారు. ప్రజలు అప్పటికి ఏ పార్టీకి నీరాజనం పట్టారో.. అదే పార్టీలో తన ప్రయత్నాన్ని విలీనం చేశారు. కేంద్రమంత్రి అయ్యారు. రాజ్యసభ ఎంపీగా పదవీకాలం పూర్తయ్యాక ఇక మళ్లీ రాజకీయాలవైపు చూడలేదు.

రాజకీయ పార్టీ పెట్టినప్పుడు.. సినిమా రంగం నుంచి నిష్క్రమిస్తూ ఆ వీడ్కోలు శాశ్వతం అని ప్రకటించారు చిరంజీవి. కానీ, అక్కడ పప్పులు ఉడక్కపోయేసరికి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన తన మర్యాదను కాపాడుకున్న తీరు ఏంటంటే.. ఒకసారి సినిమాల్లోకి రీఎంట్రీ తర్వాత.. మళ్లీ రాజకీయాలవైపు చూడలేదు.

చిరంజీవిని తాము ఎంపీని మరియు కేంద్రమంత్రిని చేశాం కదా అనే ఉద్దేశంతో.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆయనను కొన్ని కమిటీల్లో నియమించినా, ఆయన పేరును కాంగ్రెస్ నాయకుడిగా వాడుకున్నా.. ఆయన ఎన్నడూ ఆ వ్యవహారాల గురించి పట్టించుకోలేదు. క్రమంగా ఆ పార్టీ కూడా ఆయనను పట్టించుకోవడం మానేసింది. ఆ రకంగా ఏ పార్టీతోనూ స్నేహమూ లేదా వైరమూ లేకుండా.. చిరంజీవి తన మర్యాదను కాపాడుకున్నారు.

అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో కూడా చిరంజీవికి సత్సంబంధాలు ఉన్నాయి. తన తమ్ముడిగా జగన్ ను అభివర్ణించిన వైనం కూడా ప్రజలు చూశారు. సినిమా రంగం తప్పొప్పులు, లోపాయికారీ వ్యవహారాల మీద ప్రభుత్వం ఘాటుగా దృష్టి సారించినప్పుడు.. ఇండస్ట్రీ తరఫున ముఖ్యమంత్రిని కలిసి విన్నవించుకున్న బృందానికి సారథ్యం వహించినది కూడా చిరంజీవే. ఆ సందర్భంలో ఆయన వినయశీలతను, రాయబార సామర్థ్యాన్ని కూడా అందరూ గమనించారు.

అలాగే తన సినిమాల విడుదలల సందర్భాల్లో ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు అవసరమైనప్పుడెల్లా చిరంజీవి ప్రభుత్వంతో సత్సంబంధాలనే కొనసాగిస్తూ వచ్చారు. అయితే చాలా ఏళ్ల తర్వాత ఆయన తొలిసారిగా బ్యాలెన్స్ తప్పినట్టు కనిపిస్తోంది. 

వాల్తేరు వీరయ్య సినిమాకు చేంతాళ్లూ, మోకులు కట్టి బలవంతంగా లాగి ఏదో రెండొందల రోజులు ఆడిందని అనిపించినందుకు వారు వేడుక చేసుకోవడం వరకు ఓకే. కానీ ఆ వేదిక మీద అలవాటుగా స్వోత్కర్షలకు పరిమితమై ఉంటే బాగుండేది. కానీ బ్యాలెన్స్ తప్పిన చిరంజీవి రాజకీయాల ఊసులెత్తుకున్నారు. తనకు సంబంధం లేని సినిమాలో రాజకీయ వెక్కిరింతలు వివాదంగా మారిన నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలకు ముడిపెట్టి, ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సాహసించారు.

రాష్ట్రానికి ప్రత్యేకహోదా అనేది వచ్చే అవకాశమే లేదు అనే సంగతి చిరంజీవికి తెలుసు. హోదాకు సంబంధించి ఆ సంగతిని అసలు విభజన చట్టంలోనే పొందుపరచకుండా ఏపీ ప్రజలను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన స్వయంగా మంత్రి. ఇప్పుడు హోదా విషయంలో ద్రోహానికి చిరు బాధ్యతను ప్రజలు ప్రశ్నిస్తే ఆయన ఏం సమాధానం చెప్తారు.

రోడ్లు, ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాలు అంటూ.. ఇవాళ ఏ మాటలనైతే వల్లిస్తూ జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి విపక్షాలు ప్రదర్శిస్తున్నాయో.. ఆ మాటలను ఎండార్స్ చేసే పూచీ చిరంజీవి తీసుకున్నట్టుగా కనిపిస్తోంది.

ఎంచక్కా సినిమాలు చేసుకుంటూ.. అభిమానులకు ఆరాధ్యుడిగా వెలుగొందుతున్న చిరంజీవికి ఇలా అనవసరమైన లంపటాన్ని నెత్తిన వేసుకోవడం అవసరమా? అని పలువురు ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.