ఈనాడు జ్యోతిల్లో ‘గోతి’ రాజ‌కీయాలు

రాష్ట్రంలో రోడ్లు, గుంత‌ల గురించి చిన్న‌పిల్లాడిని అడిగినా చెబుతాడు. దానికేం విశ్లేష‌ణ‌లు, తెలివి అక్క‌ర్లేదు. అనంత‌పురం త‌పోవ‌నం నుంచి ఆర్టీసీ బ‌స్టాండ్‌కు వెళ్లే రోడ్డులో గోతిలో ప‌డ‌కుండా వెళ్ల‌డం ఒక ఫీట్‌. తిరుప‌తి ఆర్టీవో…

రాష్ట్రంలో రోడ్లు, గుంత‌ల గురించి చిన్న‌పిల్లాడిని అడిగినా చెబుతాడు. దానికేం విశ్లేష‌ణ‌లు, తెలివి అక్క‌ర్లేదు. అనంత‌పురం త‌పోవ‌నం నుంచి ఆర్టీసీ బ‌స్టాండ్‌కు వెళ్లే రోడ్డులో గోతిలో ప‌డ‌కుండా వెళ్ల‌డం ఒక ఫీట్‌. తిరుప‌తి ఆర్టీవో ఆఫీస్ (మంగ‌ళం) నుంచి సీఆర్ఎస్‌కు వెళ్లే దారిలో రెండు గోతిల‌కి మ‌ధ్య చిన్న దారి వుంటుంది. ప‌డితే పైకి లేయ‌డం క‌ష్టం. రాష్ట్ర‌మంతా ఇదే. ఎముక‌ల డాక్ట‌ర్ల‌కి మంచి ప్రాక్టీస్‌. జ‌గ‌న్‌కి ఒక వేళ ఆర్థో ప‌రిక‌రాల వ్యాపారం వుంటే రోడ్ల‌కి, జ‌గ‌న్‌కి ముడిపెట్టి రాసేవాళ్లు.

జూన్‌, జూలైలో వ‌ర్షాలు వ‌స్తాయ‌ని ప‌ల్లెటూరి రైతును అడిగినా చెబుతాడు. సీఎంకి ఇంత మంది స‌ల‌హాదారులున్నారు. వాళ్ల‌కీ విష‌యం తెలిసిన‌ట్టు లేదు. అందుకే అమాయ‌కంగా జూలై 15లోగా రోడ్లు మ‌ర‌మ్మ‌తులు చేస్తాన‌ని చెప్పారు. డ‌బ్బులు లేవో, కాంట్రాక్ట‌ర్లు ముందుకు రాలేదో…. మొత్తం మీద ప‌నులు జ‌ర‌గ‌లేదు.

ఇప్పుడు వాన‌లొస్తున్నాయి. నీళ్ల‌తో నిండిన గోతుల ఫొటోల‌ని ప్ర‌తిరోజూ ఈనాడు, జ్యోతిల్లో వేస్తున్నారు. ప్ర‌భుత్వ లోపాల్ని ఎత్తి చూప‌డం ప్ర‌తిప‌క్ష ప‌త్రికల ధ‌ర్మం. చంద్ర‌బాబు అధికారంలో లేక‌పోతే ఇవే ప్ర‌తిప‌క్షాలు. బాబు ప‌వ‌ర్‌లో ఉన్న‌ప్పుడు ఆ ప‌ని సాక్షి చేసింది. ఇప్పుడు కూడా గోతులని క‌వ‌ర్ చేయ‌డానికి సాక్షి ఏదో తిప్ప‌లు ప‌డుతోంది.

సింపుల్ లాజిక్ ఏమంటే వాన‌లొస్తున్న‌ప్పుడు మ‌ర‌మ్మ‌తు ప‌నులు చేయ‌డం సాధ్యం కాద‌ని ఈనాడు, జ్యోతికి తెలియ‌దా? ఒక‌వేళ ప్ర‌భుత్వం తెలివి తక్కువ‌గా చేప‌ట్టి వుంటే అప్పుడు వీళ్లే “వాన‌ల్లో ప‌నులు -కోట్ల‌ల్లో బిల్లులు” అని హెడ్డింగ్ పెట్టి డ‌బ్బులు తినేయ‌డానికే వర్షాకాలం ప‌నులు చేస్తున్నార‌ని రాసేవాళ్లు క‌దా!

జూలై 15లోగా రోడ్ల రూపు రేఖ‌లు మారుస్తాన‌ని అన్నాడు. జర‌గ‌లేదు. వ‌ర్షాల్లో ఏ ప్ర‌భుత్వ‌మైనా ప‌నులు చేయ‌గ‌ల‌దా? వాన‌లు త‌గ్గితే ప‌నులు మొద‌ల‌వుతాయి అనుకుంటే అపుడు ఈనాడు, జ్యోతి ఎఫెక్ట్ అని రాసుకోడానికా? ఇపుడీ గుంతల ఫొటోలు?

నిజానికి రాష్ట్రంలో ఎవ‌రూ ఇంకొక‌రికి గోతులు తీసే అవ‌స‌రం లేదు. రోడ్డు మీద జాగ్ర‌త్త లేక‌పోతే అంద‌రూ గోతుల్లో ప‌డాల్సిందే. రోడ్ల విష‌యంలో ఇప్ప‌టికైనా మేల్కొన‌క‌పోతే వైసీపీ త‌న గొయ్యి తాను తీసుకున్న‌ట్టే!