ప్రముఖ సీనియర్ నటి, డైరెక్టర్ రాధిక మాజీ భర్త, నటుడు ప్రతాప్ పోతన్ (70) గరువారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. చెన్నైలో తన నివాసంలో గుండెపోటుతో ఆయన ప్రాణాలు విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రతాప్‌ది వ్యాపార నేపథ్య కుటుంబం. ఆయనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆరవం అనే మలయాళీ సినిమాతో సినీ ప్రస్థానాన్ని ప్రతాప్ ప్రారంభించారు.
తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించారు. టాలీవుడ్‌కు ఆయన సుపరిచితులే. ఆకలిరాజ్యం, కాంచన గంగ, జస్టిస్ చక్రవర్తి, మరో చరిత్ర తదితర తెలుగు సినిమాల్లో సహాయ నటుడిగా నటించి మన ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. అలాగే చైతన్య అనే తెలుగు సినిమాకి దర్శకత్వం కూడా వహించారు.
1985లో నటి రాధికను ఆయన వివాహమాడారు. ఏడాదికే వ్యక్తిగత కారణాల వల్ల వాళ్లిద్దరు విడిపోయారు. ప్రతాప్ మరణంతో తెలుగు, తమిళ సినీ పరిశ్రమ విషాదంలో మునిగింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పలువురు కోరుకుంటున్నారు.
ఆకలి రాజ్యం, మరో చరిత్ర చిత్రాలు టాలీవుడ్ ప్రేక్షకుల విశేష ఆదరణ పొందాయి. అందుకే ప్రతాప్ కూడా తెలుగువాడే అన్న స్థాయిలో టాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.