ఈ సీజన్ లో అరకు అదరహో

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రకృతి అందాలు చూడాలంటే సాధారణంగా శీతాకాలం బెటర్ అనుకుంటారు. పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా ఆ టైమ్ లోనే వస్తూంటారు. కానీ నిజానికి అసలైన అందాలు రైనీ సీజన్ లోనే…

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రకృతి అందాలు చూడాలంటే సాధారణంగా శీతాకాలం బెటర్ అనుకుంటారు. పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా ఆ టైమ్ లోనే వస్తూంటారు. కానీ నిజానికి అసలైన అందాలు రైనీ సీజన్ లోనే చూడవచ్చు. ప్రస్తుతం విస్తారంగా వానలు కురుస్తున్న వేళ అరకు అందాలు అదరహో అన్నట్లుగా ఉన్నాయి. దాంతో పర్యాటకులు ఆ వైపుగా దృష్టి సారిస్తున్నారు.

అరకులో కురుస్తున్న భారీ వర్షాలకు మన్యం సౌందర్యం రెట్టింపు అయింది. అరకు ఘాటు రోడ్డులో రమణీయమైన దృశ్యాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఘాటు రోడ్డులో ఉన్న సుంకరిమెట్ట గాలికొండ దముకు ప్రాంతాంలో కాశ్మీర్ ని తలపించే సౌందర్యాలు ఇట్టే కట్టిపడేస్తున్నాయి అని అంటున్నారు.

నిజానికి ఆంధ్రా కాశ్మీరు అని పాడేరులోని లంబసింగి ప్రాంతాన్ని చెబుతారు. ఇపుడు అరకు అందాలను చూస్తే అదే మాట ఇక్కడా వాడాల్సి ఉంటుంది. దారి పొడవునా ప్రకృతి కుప్పపోసినట్లుగా కనిపించే సొగసులను కంటితో ఏరుకోవడమే పర్యాటకులు చేయాల్సిన పని.

ఇక టూరిజం డిపార్ట్మెంట్ మరింత శ్రద్ధ వహించి అరకుని తీర్చిదిద్దితే రైనీ సీజన్ లో కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త ప్రాజెక్టులను టేకప్ చేయడం ద్వారా అరకు రమణీయతను రాష్ట్రం దేశం మొత్తం ఆకట్టుకునేలా చేయవచ్చు అంటున్నారు.