Advertisement

Advertisement


Home > Politics - Analysis

వైసీపీకి మైనింగ్ భూమ‌రాంగ్‌!

వైసీపీకి మైనింగ్ భూమ‌రాంగ్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మైనింగ్ ర‌హ‌స్యం అంతుచిక్క‌డం లేదు. పైగా ప్ర‌భుత్వ పెద్ద‌ల మాట‌లు ఆశ్చ‌ర్యం, అనుమానం క‌లిగిస్తున్నాయి. ఇంకా చంద్ర‌బాబు హ‌యాంలో ఇచ్చిన మైనింగ్ లైసెన్స్‌దారుల‌నే కొన‌సాగిస్తున్నామ‌ని చెప్ప‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. చంద్ర‌బాబు హ‌యాంలో ఏర్పాటు చేసిన రాజ‌ధాని అమ‌రావ‌తినే మార్చేశారు.

బాబు హ‌యాంలో నిర్మించిన ప్ర‌జావేదిక అక్ర‌మం అనే కార‌ణంతో కూల్చేశారు. అన్న క్యాంటీన్ల‌ను మూసేయించారు. ఇలా ఏది తీసుకున్నా....చంద్ర‌బాబు పాల‌న‌ను గుర్తు తెచ్చే ఏ ఒక్క‌టి మిగ‌ల‌కుండా జ‌గ‌న్ స‌ర్కార్ చ‌ర్య‌లు తీసుకుంది, తీసుకుంటోంది. రాజ‌కీయంగా, పాల‌నాప‌రంగా తీసుకున్న నిర్ణ‌యాలు త‌ప్పా? ఒప్పా? అనేది ఎన్నిక‌ల్లో జ‌నం తేలుస్తారు. అయితే మైనింగ్ విష‌యానికి వ‌చ్చే స‌రికి జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. చంద్ర‌బాబు హ‌యాంలో ఇచ్చిన లీజుదారులే ఇప్ప‌టికీ ఉన్నార‌నే వాద‌న ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.  

ఏపీలో పెద్ద ఎత్తున మైనింగ్ మాఫియా ప్ర‌కృతి వ‌న‌రుల్ని కొల్ల‌గొడుతోంద‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబునాయుడు ఘాటు ఆరోప‌ణ‌లు చేశారు. కుప్పం మొద‌లుకుని విశాఖ వ‌ర‌కూ అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు, ముఖ్య నాయ‌కులు ఏ విధంగా మైనింగ్ అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారో శాటిలైట్ చిత్రాల‌తో స‌హా ఆయ‌న వివ‌రించారు. చంద్ర‌బాబుకు గ‌నులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు.  

పర్యావరణ అనుమతుల ప్రకారమే రుషికొండలో మట్టి తవ్వకాలు జరిగాయన్నారు. ప్రభుత్వానికి ఆ సంస్థ రూ.6 కోట్ల రాయల్టీ కూడా చెల్లించిందని వివరించారు. చంద్రబాబు చెబుతున్న మైనింగ్‌ లీజులన్నీ కాంగ్రెస్, టీడీపీ హయాంలోనే ఇచ్చారని గుర్తు చేశారు. కుప్పంలో టీడీపీ అధికారంలో ఉండగా అటవీ ప్రాంతంలో జరిగిన దొంగచాటు మైనింగ్‌ను తాము రాగానే నిలుపుదల చేసినట్లు చెప్పారు.

కుప్పం నియోజకవర్గంలో 102 మైనింగ్‌ లీజులున్నాయని ఆయ‌న అన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక కేవలం రెండు లీజులు మాత్రమే ఇచ్చామ‌న్నారు. మిగిలినవి టీడీపీ, కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చినవే అన్నారు. ఇందులో 71 లీజులకు సంబంధించి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి రూ.114 కోట్ల పెనాల్టీ వేశామ‌న్నారు.

పెద్దిరెడ్డి వాద‌న ఎలా ఉన్నా...ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌ల‌ను దీటుగా తిప్పికొట్ట‌లేక‌పోయారు. పైగా ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేసేలా ఆయ‌న వివ‌ర‌ణ వుంద‌నే అభిప్రాయాలు వైసీపీ పెద్ద‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చంద్ర‌బాబు హ‌యాంలో భారీగా ఇచ్చిన మైనింగ్ లీజుల‌నే ఎందుకు ఇంకా కొన‌సాగిస్తున్నార‌నే ప్ర‌శ్న‌కు స‌మాధానం ఏంటి? అలాగే టీడీపీ అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభిరాం కీల‌క ప్ర‌శ్న సంధించారు.  

కుప్పం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌పై విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించి రూ.114 కోట్లు జరిమానా విధించారంటే అక్కడ ఎంత స్థాయిలో అక్రమ మైనింగ్‌ జరుగుతోందో తెలిసిపోతోందనే లాజిక్‌ను తెర‌పైకి తెచ్చారు. కుప్పంలో కనీసం రూ.2,000 కోట్ల విలువైన గ్రానైట్‌ అక్రమ తవ్వకాలు జరిగాయని ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఈ మూడేళ్లలో జరిగిన అక్రమ తవ్వకాల విలువ రూ.6,000 కోట్లు వుంటుంద‌న్నారు. కుప్పంలో భారీగా అక్ర‌మ మైనింగ్ జ‌రుగుతుంద‌నే ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు... ప్ర‌భుత్వం విధించిన జ‌రిమానా బ‌లం చేకూర్చేలా ఉంది.

అన్నిటికి మించి చంద్ర‌బాబు హ‌యాంలో ఇచ్చిన మైనింగ్ లీజుల‌నే ఇంకా కొన‌సాగించ‌డంలోని చిదంబ‌ర ర‌హ‌స్యం ఏంటి? అని ప్ర‌జానీకం ప్ర‌శ్నిస్తోంది. ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్న‌ట్టు... ఈ మైనింగ్ అక్ర‌మాల్లో ప్ర‌భుత్వ పెద్ద‌ల పాత్ర‌పై త‌ప్ప‌క అనుమానాలు క‌లిగే అవ‌కాశం ఉంది. ఇందుకు ప్ర‌భుత్వ చ‌ర్య‌లే దోహ‌దం చేస్తున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?