జ‌గ‌న్ స‌ర్కార్ ద‌గ్గ‌ర స‌మాధానం ఏది?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏ రోడ్డు చూసినా ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం. రోడ్ల‌న్నీ గుంత‌ల‌మ‌యం. ర‌హ‌దారుల విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ వ‌ద్ద స‌మాధానం లేదు. ఏపీలో రోడ్లు అత్యంత అధ్వానంగా వున్నాయి. అయితే ఇటీవ‌ల జ‌గ‌న్ ఆదేశాల‌కే దిక్కులేక‌పోవ‌డంపై…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏ రోడ్డు చూసినా ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం. రోడ్ల‌న్నీ గుంత‌ల‌మ‌యం. ర‌హ‌దారుల విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ వ‌ద్ద స‌మాధానం లేదు. ఏపీలో రోడ్లు అత్యంత అధ్వానంగా వున్నాయి. అయితే ఇటీవ‌ల జ‌గ‌న్ ఆదేశాల‌కే దిక్కులేక‌పోవ‌డంపై ప్ర‌తిప‌క్షాలు, వాటి అనుకూల మీడియా గ‌ట్టిగా నిల‌దీస్తోంది. రోడ్లు విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్‌ను ఎండ‌గ‌డుతోంది. దీంతో ఏపీ ప్ర‌భుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

జూలై 15 నాటికి రోడ్ల‌న్నీ మెరిసిపోయేలా త‌యారు చేయాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఆ ఆదేశాలు అమ‌లుకు నోచుకోక‌పోవ‌డంతో ప్ర‌తిప‌క్షాలు, జ‌గ‌న్‌కు ఇష్ట‌మైన దుష్ట‌చ‌తుష్ట‌యం నిగ్గ‌దీసి అడుగుతోంది. గ‌త నెల 21న ఆర్ అండ్‌బీ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగాల అధికారుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో జ‌గ‌న్ కీల‌క ఆదేశాలు జారీ చేశారు. అప్ప‌ట్లో ఆయ‌న ఏమ‌న్నారంటే…

‘రాష్ట్రంలో జూలై 15 కల్లా రహదారులపై ఉన్న గుంతలు పూడ్చాలి. జూలై 20న అభివృద్ధిచేసిన రహదారుల ఫొటో గ్యాలరీలు ఏర్పాటు చేయాలి. గత సర్కారు హయాంలో రోడ్ల మరమ్మతుల కోసం ఐదేళ్లలో రూ.1,300 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు మూడేళ్లలోనే రూ.2,400 కోట్లు వ్యయం చేశాం. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఆగిపోవాలని ఏకైక అజెండాతో ప్రతిపక్షాలు పని చేస్తున్నాయి’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు.  

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ విధించిన టార్గెట్ డేట్ రానే వ‌చ్చింది. రోడ్లు త‌ళ‌త‌ళ మెర‌వ‌డం సంగ‌తేమో గానీ, మోకాళ్ల లోతు గుంత‌లు క‌నిపిస్తున్నాయి. గంట ప‌ట్టాల్సిన ప్ర‌యాణం రెండు మూడు గంట‌ల‌వుతున్న దుస్థితి. రోడ్ల‌పై ప్ర‌యాణించే వారంతా జ‌గ‌న్ స‌ర్కార్‌ను తిట్టుకోవ‌డం ఓ ప‌నైంది. మ‌రి అన్ని వేల కోట్లు, ఇన్ని వేల కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం గొప్ప‌లు చెప్పుకుంటోంది. 

ఆ డ‌బ్బంతా ఎక్క‌డ ఖ‌ర్చు పెట్టారో అర్థం కాని ప‌రిస్థితి. ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అనే సామెత చందాన రోడ్ల‌పై గుంత‌లు మాత్రం మ‌రింత అధ్వానంగా త‌యారవ‌డ‌మే త‌ప్ప‌, బాగుప‌డిన దాఖ‌లాలు లేవు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం రోడ్ల‌పై దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంది.