పెళ్లి అనేది వ్యక్తిగత విషయం. పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం అతడు లేదా ఆమె ఇష్టం. ఇది మొదటి పెళ్లి విషయంలోనే. కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ కారణం వల్లనైనా రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. భయపడకండి. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి.
బీహార్ ప్రభుత్వం ఈ నిబంధన పెట్టింది. ఈ నిబంధన పెట్టడానికి కారణం తెలియదుగానీ మొత్తమ్మీద బీహార్ ప్రభుత్వ ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం అనుమతి తప్పనిసరి.
దంపతులు విడాకులు తీసుకుంటే లేదా జీవిత భాగస్వామి మరణిస్తే రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందుగా తాము పని చేస్తున్న డిపార్ట్ మెంట్ హెడ్ కు సమాచారమిచ్చి అనుమతి తీసుకోవాలి.
అనుమతి వస్తేనే పెళ్లి చేసుకోవాలి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగి/ఉద్యోగిని రెండోసారి పెళ్లి చేసుకోవాలనుకుంటే చట్టపరంగా విడాకులు తీసుకున్నట్లు నిరూపించాలి.
అంటే అందుకు సంబంధించి ఆధారాలు డిపార్టుమెంటుకు సమర్పించాలి. ఒకవేళ మరణిస్తే అందుకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలి. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు మొదటి భార్య ఉండగానే మరొక మహిళను చేసుకుంటారు. ఇలాంటి కేసుల్లో మొదటి భార్య అభ్యంతరం చెప్పడం సహజం.
ఒకవేళ మొదటి భార్య నుంచి అభ్యంతరం వచ్చినా ఖాతరు చేయకుండా రెండో పెళ్లి చేసుకుంటే రెండో భార్యకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు/పథకాలూ అందవు.
ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ముందస్తు అనుమతి లేకుండా రెండో వివాహం చేసుకొని, ఏదైనా కారణంవల్ల సర్వీసు మధ్యలోనే మరణిస్తే రెండో భార్య /భర్త ద్వారా పుట్టిన పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారు. అప్పుడు మొదటి భార్య /భర్త ద్వారా పుట్టిన పిల్లలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు.