ఈ నిర్ణయం వ్యవస్థను అవమానించడం కాదా?

రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. గ్రామాలలో పనిచేస్తున్న వాలంటీర్లు ఏ రకమైన ఎన్నికల సందర్భంలోనూ ఏ రకమైన వీధిలోనూ పాల్గొనడానికి వీలు లేదని ఉత్తర్వులు జారీ చేసింది.   Advertisement…

రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. గ్రామాలలో పనిచేస్తున్న వాలంటీర్లు ఏ రకమైన ఎన్నికల సందర్భంలోనూ ఏ రకమైన వీధిలోనూ పాల్గొనడానికి వీలు లేదని ఉత్తర్వులు జారీ చేసింది.  

ఎన్నికల కు సంబంధించిన ఎలాంటి బాధ్యతలు కూడా గ్రామ వాలంటీర్లకు అప్పగించడానికి వీల్లేదని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. గ్రామాల్లో ఉన్న వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల్లాగా పని చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఉత్తర్వులు వచ్చినట్లుగా తెలుస్తోంది!

అయితే ఈ నిర్ణయం లో ఉన్నఔచిత్యం ఎంత అనేది మాత్రం ప్రశ్నార్థకం.. చర్చనీయాంశం! ప్రభుత్వానికి ప్రజలకి మధ్య క్షేత్రస్థాయిలో కీలకమైన విధులు నిర్వర్తించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చింది.  

ఇవాళ ప్రతి నెల ఒకటవ తేదీ నాడు గ్రామాల్లో లబ్ధిదారులకు ప్రభుత్వ పెన్షన్ వారి ఇంటి ముందుకే వచ్చి అందుతున్నది అంటే.. అది కేవలం వాలంటీరు వ్యవస్థ ద్వారా మాత్రమే సాధ్యమవుతోంది! ఇది ఎవరూ కాదనలేని సత్యం. గ్రామాలలో ప్రతి ఒక్క ఇంటి తోనూ అనుసంధానమై ప్రభుత్వం తరఫున పని చేసే ప్రజా సేవకుడిగా ఇవాళ వాలంటీర్లు గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిని ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టడం అంటే అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి!

ప్రభుత్వ ఉద్యోగులు అయినంత మాత్రాన ప్రతి ఒక్కరికి వారి వారి రాజకీయ రాగద్వేషాలు ఉంటాయి. అందుకు అతీతం కాకపోవచ్చు. ఎన్నికల పర్వం జరుగుతున్నప్పుడు వాలంటీర్లు కూడా ఎక్కడైనా రాజకీయ ప్రచారాలలో కనిపించి ఉండవచ్చు. అంతమాత్రాన మొత్తం వాలంటీర్ల వ్యవస్థనే అనుమానించేలా, అవమానించేలా వారిని ఎన్నికల విధుల నుంచి దూరం చేయాలనే ఉత్తర్వుల పట్ల వారిలో అసంతృప్తి కలుగుతుంది. 

‘ఏ అభ్యర్థికి కూడా వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్ గా కూర్చోకూడదు’ అని  ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇవ్వడంలో అర్థముంది. అయితే ఓటరు జాబితాలో పనుల దగ్గరనుంచి, కొత్త ఓటర్ల  చేరిక, ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు,  ఓటర్లకు పోలింగ్ స్లిప్పులు పంపిణీ లాంటి కనీసమైన పనుల నుంచి కూడా వారిని దూరం పెట్టడం తగని పని.   

నిత్యం ప్రభుత్వ కార్యక్రమాల అమలులో భాగస్వాములై ఉంటూ..  గ్రామంలో ప్రతి ఇంటితో అనుసంధానమై ఉండే ప్రభుత్వ ప్రతినిధులను ఓటరు జాబితా సవరణ వంటి వాటికి కూడా ఆశ్రయించకుండా ప్రజలు ఎలా ఉండగలరు? పోలింగ్ ఏజెంట్ తరహాలో..  ఓటరు జాబితాలో పనులు అనేవి రాజకీయ కార్యకలాపాలు కాదు కదా! అనే చర్చ నడుస్తుంది.

ఆ మాటకొస్తే ఎన్నికల విధులు ప్రధానంగా నిర్వహించే రెవెన్యూ సిబ్బంది మరియు టీచర్లకు రాజకీయ రాగద్వేషాలు ఉండటం లేదా? వారు ఏ రకంగానూ ఓటర్లను ప్రభావితం చేయకుండానే వ్యవహరిస్తున్నారా? అనే చర్చ కూడా వినిపిస్తోంది! ఇవన్నీ ఇలా సాగుతుండగానే, కేవలం వాలంటీర్లను మాత్రం అనుమానంగా చూడటం, వారిని ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించడం సరికాదు!!