తాటాకు చప్పుడుకే బెదిరితే.. ఇదేం పులి!

పులి గాండ్రిస్తే మదగజాలు తత్తరపడాలి. అంతే తప్ప తాటాకు చప్పుళ్లకే పులిబెదిరిపోతే ఎలాగ? చాలా కామెడీగా ఉంటుందది! ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయ ఎరీనాలో అలాంటి కామెడీనే చోటు చేసుకుంటున్నది. Advertisement ‘పులి’గా తమను తాము…

పులి గాండ్రిస్తే మదగజాలు తత్తరపడాలి. అంతే తప్ప తాటాకు చప్పుళ్లకే పులిబెదిరిపోతే ఎలాగ? చాలా కామెడీగా ఉంటుందది! ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయ ఎరీనాలో అలాంటి కామెడీనే చోటు చేసుకుంటున్నది.

‘పులి’గా తమను తాము గుర్తించుకునే శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే.. కమలదళం వ్యూహంలో చిక్కి బిక్కిరిస్తున్నారు. శివసేన పార్టీని తనకు చెందకుండా చేస్తారేమో అనే భయంలో.. వారి భజనకే సిద్ధమవుతున్నారు. చిన్న బెదిరింపులకే జడుసుకుని.. బిజెపి అభ్యర్థి ద్రౌపది ముర్ముకే రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ మద్దతు ఇస్తుందంటూ.. ఆయన తమ మహా వికాస్ ఆఘాడీ ఆకాంక్షలకు విరుద్ధంగా మాట్లాడడం ఇక్కడ గమనార్హం.

మహా రాజకీయాలు దేశానికి ఒక గుణపాఠం నేర్పుతున్నాయి. నాన్ బిజెపి ప్రభుత్వాలు ఉండే చోట.. ఒక్కో రకం స్కెచ్ వేసి ప్రభుత్వాలను కూల్చడం అనేది తమ రాజకీయ వ్యాపకంగా బిజెపి మార్చుకుంది. ఆ క్రమంలోనే.. మహారాష్ట్రలో ఏక్‌నాధ్ శిండే ప్రభుత్వమూ ఏర్పడింది.

బిజెపి తన చేతికి మట్టికుంటకుండా, తన చేతికి ముఖ్యమంత్రి పదవినీ అంటించుకోకుండా.. శివసేన పతనాన్ని నిర్దేశించే ప్రయత్నంలో ఉంది. ఇలాంటి సమయంలో.. బిజెపి టక్కుటమార విద్యలకు వ్యతిరేకంగా పోరాటస్ఫూర్తిని ప్రదర్శించాల్సిన శివసేన ‘పులి’ ఉద్ధవ్ థాక్రే చేతులెత్తేసి.. ద్రౌపదికి మద్దతు ప్రకటించడం తమాషా!

‘‘తొలిసారిగా ఆదివాసీ మహిళ రాష్ట్రపతి రేసులో ఉన్నది గనుక’’ అనే పడికట్టు పదజాలాన్ని ఉద్ధవ్ కూడా ప్రయోగించారు. కాకపోతే.. ఆయన బిజెపి బెదిరింపులకు లొంగిపోయారనే గుసగుసలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాంటి ప్రకటన చేయకుండా ప్రస్తుతానికి థాక్రే చేయగలిగింది కూడా ఏమీలేదు.

శివసేన ఎమ్మెల్యేలు గరిష్టంగా శిందే గుప్పిట్లోనే ఉన్నారు గనుక.. ఎటూ ద్రౌపదికే ఓటు వేస్తారు. కొన్ని రోజుల కిందట తన నివాసం మాతోశ్రీలో ఎంపీలతో థాక్రే సమావేశం నిర్వహిస్తే.. ఆ పార్టీకి ఉన్న 18మంది ఎంపీల్లో 12 మంది హాజరయ్యారు. సంఖ్య చూసుకుని మురిసిపోయే పరిస్థితి ఆయనకు లేదు. ఎందుకంటే వారంతా కూడా ద్రౌపదికి మద్దతు ఇవ్వాలని ఒత్తిడి చేయడానికే మీటింగుకు వచ్చారు. గతిలేని పరిస్థితుల్లో ఉద్ధవ్ ఆ ప్రకటన చేసినట్టుగా కనిపిస్తోంది. 

ఆయన నిర్ణయం మహావికాస్ ఆఘాడీని చరమాంకానికి నెట్టింది. శివసేనకు 56 మంది ఎమ్మెల్యేలుండగా, 53 మంది ఎమ్మెల్యేలున్న ఎన్సీపీ, 44 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ కలిసి ఉద్ధవ్ ను సీఎం పీఠంపై కూర్చోబెట్టాయి. ఆయన పార్టీలో తిరుగుబాటు జరిగింది సరే.. కానీ ఆ తిరుగుబాటు ఫలితాలు మొత్తం పార్టీని తన నుంచి దూరం చేసేస్తాయనే భయంలో ఉన్న ఉద్ధవ్.. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ‘శివసేన పులి’ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారు. తిరిగి బిజెపికి జైకొట్టే బాట ఎంచుకున్నారు.

రాజకీయాల్లో కుట్రలు కూహకాలు అనేకం జరుగుతూనే ఉంటాయి. కానీ.. ఇలాంటి తాటాకు చప్పుడు కుట్రలకే జడుసుకునే పులి ఎలా మనుగడ సాగిస్తుందా? అని ‘మహా’ పరిణామాలు గమనిస్తున్న పలువురు విస్తుపోతున్నారు!