అసెంబ్లీ ఎన్నికలు కావొచ్చు, లోక్ సభ ఎన్నికలు కావొచ్చు అధికారంలో ఉన్న పార్టీకీ వందకు వంద సీట్లు రావడం జరగదు. కాకపొతే ఉన్న సీట్లలో అత్యధికంగా సీట్లు గెలుచుకోవచ్చు. అత్యధిక సీట్లు సాధించడం సహజం. వందకు వంద శాతం సీట్లు సాధించడం అసహజం. అసెంబ్లీ సీట్లు గెలుచుకునే విషయంలో వైసీపీ వైఖరి, అధినేత కమ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటలు అసహజంగానే ఉన్నాయని చెప్పొచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 సీట్లు గెలుచుకుంటామని జగన్ చెప్పడం అతి విశ్వాసమని చెప్పుకోవచ్చు.
సహజంగా కూడా ఉందని అనుకోవచ్చు. పార్టీ ప్లీనరీలో అధినేతతో పాటు కీలక నేతలు వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలుచుకుంటామని గంటాపథంగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ సైతం నూటికి నూరు శాతం సీట్లు గెలుచుకోలేదు. నూటికి నూరు శాతం సీట్లు గెలుచుకుంటామని జగన్, నాయకులు ధీమాగా చెప్పినప్పుడు అది ఎలా సాధ్యమో కూడా చెప్పాలి కదా. అయితే కొందరు వైసీపీ నాయకులు మాత్రం ప్లీనరీ సక్సెస్ కావడంతో తమ పార్టీకి 120 స్థానాలకు తక్కువ రావని అంటున్నారు.
నూటికి నూరు శాతం సీట్లు అధికార పార్టీ గెలుచుకుంటే ప్రతిపక్షాలు ఎందుకూ పనికిరానివై ఉండాలి. ఆ పార్టీల నాయకులు పనికిమాలిన దద్దమ్మలై ఉండాలి. వైసీపీ ప్లీనరీ విజయవంతమైందన్న మాట వాస్తవం. కనీవినీ ఎరుగని రీతిలో జనసమీకరణ జరగింది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది వైసీపీ శ్రేణులు తరలివచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా ఏర్పాటుచేసిన ప్లీనరీ సక్సెస్ కావడంతో అధిష్టానం, ఇటు పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకుంటున్నాయి. దీనికి కారణం లేకపోలేదు.
గడిచిన మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తోంది. ఒక వైపు సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నా.. ప్రజా వ్యతిరేకత మాత్రం మూటగట్టుకుందన్న అభిప్రాయం ఉంది. అటు విపక్షాల ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరవుతూ వస్తోంది. వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తున్నా.. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై మాత్రం అంత నమ్మకం లేకుండా పోయింది.
అటు టీడీపీ, జనసేన కార్యక్రమాలకు జనాలు పెద్దఎత్తున తరలివస్తుండడం, గడిచిన ఎన్నికల్లో ఏకపక్షంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు దూరం కావడం వంటివి వైసీపీ నాయకత్వానికి కలవరపాటుకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్లీనరీ విజయవంతం అవుతుందా? లేదా? అన్న అనుమానం వెంటాడింది. అయితే వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ప్లీనరీకి భారీగా జనాలు తరలిరావడంతో ఆ పార్టీకి ఉపశమనం కలిగించే విషయం.
ఇప్పుడు అదే శ్రేణులకు టానిక్ లా పనిచేస్తోంది. అంతటా ఇదే చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఏడాది పాలనలో లోపాలు అధిగమించేందుకే సరిపోయింది. 2020 మార్చిలో కొవిడ్ వ్యాప్తి ప్రారంభమైంది. దీంతో పార్టీ కార్యక్రమాల నిర్వహణకు వీలుపడలేదు. గత మూడేళ్లు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి చెప్పుకునే అవకాశం లేకపోయింది. పైగా జగన్ తాడేపల్లి ప్యాలెస్ ను విడిచిపెట్టడం లేదన్న అపవాదును సైతం మూటగట్టుకున్నారు.
పార్టీ కేడర్ తో పాటు ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఆ పార్టీ ప్రజాప్రతినిధులను సైతం కలవడం లేదన్న విమర్శలున్నాయి. కేవలం సంక్షేమ పథకాల మీట నొక్కేందుకే ఉన్నారంటూ విపక్షాలు సైతం తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చాయి. అయితే వీటన్నింటికీ ప్లీనరీ వేదికగా జగన్ సమాధానం చెప్పినట్టయ్యింది. పార్టీ ఆవిర్భావం నుంచి తనను వెన్నుదన్నుగా నిలుస్తున్న వర్గాలకు ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోనని సైతం జగన్ గట్టి భరోసా కల్పించారు. రెండు రోజుల పాటు ప్రారంభ, ముగింపు ప్రసంగాల్లో అనుమానాలు, లోపాలను నివృత్తి చేశారు. అటు నేతలు కూడా తమలో ఉన్న అభద్రతా భావాలను, మనసులో ఉన్న అనుమానాలను కక్కేశారు.
పార్టీయే అల్టిమేట్ అని చెప్పుకొచ్చారు. దీంతో శ్రేణుల్లో కూడా ఒక రకమైన అత్మస్థైర్యం పెరిగింది.ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో మునుపటి ధైర్యం కనిపిస్తోంది. అయితే ప్లీనరీ విజయవంతమైనంత మాత్రాన మొత్తం వైసీపీ సాధిస్తుందంటే ఎలా? ప్లీనరీలు, బహిరంగ సభలు విజయవంతమైతే, వాటికి జనం కుప్పలు తెప్పలుగా వస్తే ఆశలు హద్దులు దాటడమేనా?