ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులకు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కేసీఆర్, జగన్ తనతో కలిసొస్తే విభజన హామీలను సాధిస్తానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. ప్రజాశాంతి పార్టీని గెలిపించడానికి ఇదే చివరి అవకాశముంటూ ఓటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే ఇక్కడ మరింత ఆసక్తిని కలిగించే విషయం ఏమిటంటే ఈసారి ఏకంగా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకే ఆఫర్ ఇచ్చారు.
కేసీఆర్, జగన్ తనతో కలిసొస్తే విభజన హామీలను సాధిస్తానంటున్నారు. ఏపీ, తెలంగాణకు ఇచ్చిన విభజన హామీల సాధన కోసం ఈనెల 16న ఢిల్లీలో మౌనదీక్ష చేపట్టబోతున్నట్లు పాల్ ప్రకటించారు. రాజ్‌ఘాట్ వేదికగా తాను చేయబోయే ఆందోళనలో కలిసి రావాలని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు.
కేసీఆర్, జగన్ వస్తానంటే ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్స్ కూడా అరేంజ్ చేస్తానంటున్నారు కేఏ పాల్. ఒక్క మూడు గంటలపాటు తనతో కలిసి మౌనదీక్ష చేపట్టాలని కేసీఆర్, జగన్‌ను కోరుతున్నానని అన్నారు.
జులై 16న చేపట్టబోయే మౌనదీక్షకు ఏపీ, తెలంగాణకు చెందిన అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నానని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్ కమార్, కోదండరాం.. సహా అందరూ రావాలంటు తనదైన శైలిలో కేఏ పాల్ పిలుపునిచ్చారు.
ఇక, ఎప్పటిలాగే ఇంట్రెస్టింగ్ పొలిటికల్ కామెంట్స్ చేసిన ఈయన, తనను తెలంగాణకు ముఖ్యమంత్రిని చేస్తే వేలకోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తానన్నారు. ఆ తర్వాత ప్రధానిగా అవకాశం వస్తే, ప్రపంచానికి ప్రజాశాంతి పార్టీ సత్తా ఏంటో చూపిస్తానంటూ వ్యాఖ్యానించారు కేఏ పాల్.
ఇలా వినడానికి కాస్త హాస్యాస్పదంగా అనిపించేలా మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ నెల 16న ఢిల్లీలో ఏమి జరుగుతుందో వేచి చూడాలి.