కుటుంబ పార్టీలు, వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకమని ప్రధాని మోదీ మొదలుకుని, బీజేపీ నేతలంతా నీతిసూత్రాలు చెబుతుంటారు. ఓకే…అంగీకరిద్దాం.
వారసత్వానికి బదులు జవసత్వానికి అగ్రస్థానం కల్పించాలని తపన పడుతున్న బీజేపీ విధానాల్ని అభినందిద్దాం. మరి బీజేపీ ఆచరిస్తోందా? నేతిబీరకాయలో నెయ్యి చందంగా కుటుంబ, వారసత్వ పార్టీలకు దూరమనే బీజేపీ మాటల్లోని నిజాయతీ ఉంటోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏపీ విషయానికి వస్తే వైసీపీని గద్దె దించేందుకు టీడీపీతో కలిసి పొత్తు కుదుర్చుకోవాలనేది జనసేనాని పవన్‌కల్యాణ్ కోరిక. ఈ మేరకు మిత్రపక్షమైన బీజేపీ ఎదుట ఆయన ఓ ప్రతిపాదన పెట్టారు. పవన్ ప్రతిపాదనను బీజేపీ నిర్ద్వందంగా వ్యతిరేకించింది. వారసత్వ, కుటుంబ పార్టీలైన టీడీపీ, వైసీపీలకు తాము వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా అవతరిస్తామని బీజేపీ తేల్చి చెప్పింది. పవన్ కల్యాణ్ కూడా నోరెత్తలేని పరిస్థితి.
అయితే వివిధ అంశాలకు సంబంధించి ఇవే కుటుంబ, వారసత్వ పార్టీల మద్దతు తీసుకోడానికి మాత్రం బీజేపీకి ఎలాంటి నిబంధనలు అడ్డురాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మాత్రం వైసీపీ, టీడీపీ మద్దతు జాతీయ అధికార పార్టీ ఎలా తీసుకుందనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ అడగకపోయినా వాళ్లంతకు వాళ్లు ఇచ్చినా …ఎలా తీసుకుంటారనే నిలదీత నెటిజన్లు నుంచి ఎదురవుతోంది.
పొత్తుకు వర్తించే సూత్రం… మద్దతు విషయానికి వచ్చే సరికి ఏమైందని బీజేపీని నెటిజన్లు నిలదీస్తున్నారు. బీజేపీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతూ, ప్రశ్నించే పార్టీలు లేవని ఇష్టానుసారం వ్యవహరిస్తోందనే విమర్శలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. బీజేపీ నీతులకు అర్థాలే వేరులే అని నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు.