వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై 2019కి ముందు ఏ స్థాయిలో ప్రజాదరణ ఉందో, నేటికీ అది చెక్కు చెదరలేదా? అంటే…ఔనని టీడీపీ ఫేక్ సర్వేలు చెబుతున్నారు.
ముఖ్యంగా వైసీపీ ప్లీనరీ దిగ్విజయం కావడంతో ప్రధాన ప్రత్యర్థి టీడీపీలో వణుకు మొదలైంది. వైసీపీ ప్లీనరీ సునామీలో టీడీపీ కొట్టుకుపోయింది. టీడీపీలో ఉత్సాహాన్ని… వైసీపీ ప్లీనరీకి ముందు, తర్వాత అని చెప్పుకోవాలి.
టీడీపీ మహానాడు విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. 2024లో అధికారం తమదే అని ప్రతిపక్ష పార్టీ గ్రామస్థాయి కార్యకర్త మొదలుకుని చంద్రబాబు వరకూ అందరూ ఉత్సాహంగా చెప్పారు. అయితే వైసీపీ ప్లీనరీ కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించడంతో ఒక్కసారిగా టీడీపీలో నైరాశ్యం నెలకుంది. దీంతో మళ్లీ టీడీపీలో నూతనోత్తేజాన్ని తీసుకురాడానికి పడరాని పాట్లు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం జగన్ గ్రాఫ్ పడిపోయిందంటూ ఓ సర్వే తెరపైకి వచ్చింది. తీరా అసలు విషయం ఏంటా అని ఆరా తీస్తే … సెంటర్ ఫర్ నేషనల్ స్టడీస్ (సీఎన్‌వో) అనే సర్వే సంస్థ టీడీపీ వ్యూహకర్త రాబిన్‌శర్మదని తేలింది. సర్వే రావడమే ఆలస్యం, దాని వెనుక సూత్రధారులు, పాత్రధారులెవరో వైసీపీ నిగ్గు తేల్చింది. అలాంటి సర్వే సంస్థ ఫలితాలకు విశ్వసనీయత ఏ పాటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఈ సర్వే పుణ్యమా అని టీడీపీ ఎంతగా భయపడుతున్నదో అర్థమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్‌కు గ్రాఫ్ పడిపోతుందని, మళ్లీ అధికారంలోకి రారనే భరోసా నింపేందుకు టీడీపీ ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తోంది. చంద్రబాబు, లోకేశ్ గ్రాఫ్ పెరిగి తమ పార్టీ అధికారంలోకి వస్తుందనే భరోసాను ఆ పార్టీ ఇవ్వకపోవడాన్ని ప్రధానంగా గమనించాలి. ఎంతసేపూ జగన్‌కు ప్రజాదరణ తగ్గితే తప్ప, తమ పార్టీకి పుట్టగతులుండవని టీడీపీ తన ఫేక్ సర్వేలతో ధీమా నింపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఈ సర్వేపై మాజీ మంత్రి పేర్ని నాని ఇప్పటికే ఉతికి ఆరేశారు. అట్టడుగుకు వెళ్తున్న టీడీపీని కాపాడుకునేందుకు ఆ పార్టీ చేయించిన సీఎన్‌వో సర్వే అది అని చెప్పారు. ఆ సర్వే చేసిన సెంటర్ ఫర్ నేషనల్ స్టడీస్ సంస్థ టీడీపీ జీతగాడు రాబిన్‌శర్మదే అని ఘాటు వ్యాఖ్య చేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా కూడా సర్వేపై తీవ్రంగా స్పందించారు. బోగస్ సర్వేలు చేయించే చంద్రబాబుని అందరు బోగస్ బాబుగా పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. పది రోజులకి ముందు సీఎం అయినా మహారాష్ట్ర సీఎంకు టాప్ 5 ర్యాంకు, మూడేళ్లుగా అన్ని పథకాలను అమలు చేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి అట్టడుగు ర్యాంకు ఇవ్వడం ఏంటని రోజా నిలదీశారు. చంద్రబాబు, నారా లోకేశ్‌కి చిన్న మెదడు చిట్లిపోయిందని విమర్శించారు.