ప్రతిపక్షాలే కావచ్చు.. పచ్చ మీడియా కావొచ్చు.. ఇప్పుడు చాలా వేగంగా పనిచేస్తున్నాయి. చాలా క్రియేటివ్‌గా ఇన్నోవేటివ్‌గా పనిచేస్తున్నాయి. అందరిదీ ఒకటే కామన్ టార్గెట్! జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లాలి. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి. వారి పరువు తీయాలి. ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదు అనే భ్రమ ప్రజల్లో కల్పించాలి.
ఏదైనా ప్రభుత్వం పని చేస్తే గనుక.. అది మావల్ల మాత్రమే జరిగింది తప్ప.. ప్రభుత్వం పూనుకోవడం వల్ల కాదు అని టముకు వేసుకోవాలి.. అనే రకాల నీచమైన ఆలోచనలో వారు చెలరేగుతున్నారు.
విషయంలోకి వస్తే..
‘‘రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతింటున్నాయి. వర్షాల నేపథ్యంలో రోడ్లు ఎక్కువగా దెబ్బతింటున్నాయి. వీటి వలన ఏర్పడగల సమస్య కూడా ప్రజలను బాగా ఇబ్బంది పెడుతోంది.’’ ఇది వాస్తవం. ‘‘ప్రభుత్వం దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేయడానికి తమ వంతు కృషి చేస్తూనే ఉంది. ఒక్కటొక్కటిగా బాగవుతున్నాయి’’. ఇది కూడా వాస్తవమే.
అయితే మొదటి వాస్తవం మాత్రమే మీడియాలో బాగా హైలైట్ అవుతోంది. రెండో వాస్తవం మరుగున పడిపోతోంది. లేదా, తాము పోరాడబట్టి, తాము ప్రచురించబట్టి రోడ్లను బాగు చేస్తున్నారు.. అని రంగు పూసి వారికి అనుకూలంగా, ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసేలా ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు తర్కబద్ధంగా ఆలోచిస్తే..
వర్షాలు విడవకుండా కురుస్తున్నప్పుడు.. రోడ్లు దెబ్బతినకుండా ఏ ఏడాదిలోనైనా వానాకాలం సీజన్ ముగిసిందా? ఆ మాటకొస్తే.. వర్షాలు ఆగకుండా రోడ్లను మరమ్మతు చేయడం సాధ్యం అవుతుందా? అనేవి మనకు ఎదురయ్యే ప్రశ్నలు. అయితే.. ఇలాంటి వాదన ప్రభుత్వానికి అనుకూలమైనది గనుక.. ఇలాంటి ప్రశ్నలు ప్రజలకు కలగకముందే.. దుష్ప్రచారం మిన్నంటి సాగుతోంది.
ప్రభుత్వంలో వైసీపీ మాత్రమే కాదు, తెలుగుదేశం ఉన్నా, కమలదళమే ఉన్నా.. ఎవరున్నా సరే.. వర్షాకాలంలో రోడ్లు దెబ్బతినడం చాలా సాధారణమైన విషయం. వర్షాలు ఆగకుండా ఆ రోడ్లను మరమ్మతు చేయడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. ఎందుకంటే.. ఒకవైపు వర్షం చినుకులు పడుతూ ఉండగా రోడ్లు రిపేరు చేస్తే.. అవి వారం రోజులు కూడా స్థిరంగా ఉండవు. మళ్లీ నాసిరకం మరమ్మతులు అంటూ విమర్శలు వస్తాయి. అంటే.. వర్షాల్లో రోడ్లు దెబ్బతినడానికి, వాటి మరమ్మతులు జరగడానికి మధ్య ఒక ‘గ్యాప్’ అనివార్యంగా ఉంటుంది.
ప్రతిపక్షాలకు, పచ్చ మీడియాకు కావాల్సింది కూడా ఇదే. ఎప్పటిలాగా వర్షాలకు రోడ్లు దెబ్బతినాలి.. మరమ్మతులు పూర్తయ్యేలోగా గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ ను సద్వినియోగం చేసుకోవాలనే వారంతా ఎగబడుతున్నారు. పచ్చ మీడియా ఈ గ్యాప్ లోనే ఆ దెబ్బతిన్న రోడ్ల గురించి కథనాలు వండి వారుస్తుంది. ప్రతిపక్ష పార్టీలు ఈ గ్యాప్ లోనే.. సోషల్ మీడియా ఉద్యమాలు అనీ, ఆన్ లైన్ ఉద్యమాలు అనీ.. తాము అడుగు బయటపెట్టకుండా, కష్టం లేకుండా, ప్రజలతో కలవకుండా, కానీ ఖర్చు కూడా ప్రభుత్వం మీద బురద చల్లడం షురూ చేసేస్తారు. ప్రభుత్వం ఎటూ మరమ్మతులకు కాసింత అవకాశం రాగానే, వాతావరణం తెరపివ్వగానే.. రోడ్లు బాగు చేసేస్తుంది.
అంతే వెంటనే ఇంకో ప్రచారం మొదలవుతుంది. మేం కథనాలు వేయడం వల్లనే బాగు చేశారు, మేం సోషల్ మీడియా పోరాటం వల్లనే ప్రభుత్వంలో కదలిక వచ్చింది.. అంటూ వారు టముకు వేసుకుంటారు.
ఇలాంటి మాయల మరాఠీలకు కొందరు ప్రజలు మోసపోతుంటారు. కొందరు ప్రజలు వాస్తవాల్ని వాస్తవాలుగా గ్రహించగలిగే వివేచన కలిగి ఉంటారు.