పార్లమెంట్‌లో వాడకూడని పదాల జాబితా విడుదలైంది. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ సెక్రటేరియట్ తాజాగా నిషేధిత పదాల జాబితాను విడుదల చేయడం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం పేర్కొన్న పదాలను ఎవరైనా సభ్యులు ప్రయోగిస్తే వాటిని రికార్డుల నుంచి తొలగించనున్నట్టు ప్రకటించారు.
నిషేధిత పదాల గురించి తెలుసుకుందాం. సిగ్గుచేటు, వేధించడం, మోసగించడం, అవినీతిపరుడు, డ్రామా, హిపోక్రసీ, నియంత, శకుని, తానాషా, వినాశ పురుష్, ఖలిస్థానీ, ద్రోహ చరిత్ర, చంచా, చంచాగిరి, పిరికివాడు, క్రిమినల్, మొసలి కన్నీళ్లు, గాడిద, అసమర్థుడు, గూండాలు, అహంకారి, చీకటిరోజులు, దాదాగిరి, లైంగిక వేధింపులు, విశ్వాసఘాతకుడు తదితర పదాలు ఇకపై పార్లమెంట్‌లో నిషిద్ధం.
చట్టసభల్లో బాగా మాట్లాడ్డం అంటే అర్థం మారిపోయిన పరిస్థితుల్లో …పైన పేర్కొన్న పదాలను నిషేధిస్తే సభ్యుల పరిస్థితి ఏం కావాలి? సబ్జెక్ట్, సమస్యల గురించి మాట్లాడే ప్రజాప్రతినిధులను పట్టించుకునే దిక్కులేదు. పరస్పరం తీవ్రస్థాయిలో తిట్టుకునే వాళ్లకే గుర్తింపు ఉంది. ఎంత బాగా తిట్టుకుంటే, అంత బాగా మీడియాకు మేత ఇచ్చిన వాళ్లవుతారు. బాగా తిట్టే నాయకులే మంచి వక్తలుగా, నాయకులుగా చెలామణి అవుతున్న కాలం ఇది. అలాంటి నాయకులే ఫైర్‌బ్రాండ్లుగా రాజకీయాల్లో ఉండడం చూస్తున్నాం. తిట్టుకునే వాళ్లకు మీడియా ఇచ్చే ప్రాధాన్యం, ప్రజాసమస్యలపై మాట్లాడే వాళ్లకు అసలు ఇవ్వదు.
రేటింగ్ పునాదులపై భవిష్యత్ ఆధారపడిన మీడియాకి బూతుపురాణాలే ప్రాధాన్య అంశాలు. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పరస్పరం… నువ్వు మోసగాడంటే, లేదు నువ్వు గజదొంగవని విమర్శించుకోవడం చూశాం. అవినీతిపరుడు, నియంత, గూండా, చంచా, పిరికివాడు. గాడిద, అసమర్థుడు, వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు తదితర పదాలు చట్టసభల్లో సహజంగా ఉపయోగించే పదాలయ్యాయి.
ముఖ్యంగా ఏపీలో రాజకీయ నేతలు ప్రత్యర్థులపై ప్రయోగించే బూతు పదాలతో పోల్చి చూస్తే… నిషేధిత జాబితాలోని పదాలు ఏమంత అమర్యాదకరమైనవిగా అనిపించవు. అయినప్పటికీ వాటిపై నిషేధం విధిస్తే, గౌరవ పార్లమెంట్ సభ్యుల హక్కుల్ని హరించినట్టు కాదా? అందుకే నిషేధిత పదాలపై అప్పుడే ప్రతిపక్ష సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.
నిషేధిత పదాలపై తృణముల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ఘాటుగా స్పందించారు. నిషేధిత పదాలను వాడుతానని, సస్పెండ్ చేసుకోవచ్చని ఆయన నిరసన ప్రకటించడం గమనార్హం. ఏవైతే నిషేధిత జాబితాలో ఉన్నాయో ఆ పదాలను వాడుతానని ఆయన తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ సీరియస్‌గా స్పందించింది. మోదీ సర్కార్ నిజస్వరూపాన్ని కళ్లకు కట్టేందుకు అన్ని పదాలు అమర్యాదకరమైనవని ప్రభుత్వం పేర్కొందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ విమర్శించారు. తర్వాత ఏంటి విశ్వగురు అని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు.