బీజేపీ జాతీయ విధానం ఇదీ అంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కుని ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు అన్న ప్రశ్నకు ఆమె ఇచ్చిన జవాబు అది.
బీజేపీ కానీ ఆ పార్టీ నాయకత్వం వహిస్తున్న కేంద్రం కానీ జాతీయ విధానంగా తీసుకున్నది ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం.
మరి ఈ విషయంలో ప్రజలతో సంబంధం కానీ సంస్థ లాభ నష్టాలతో పట్టింపు కానీ ఏ రకమైన భావోద్వేగాలతో కానీ అసలు పని ఉండదనుకుంటున్నారు అంతా. అంతే కాదు దేశంలోనే సీ షోర్ లో ఏర్పాటు అయిన తొలి ఉక్కు కర్మాగారం, అలాగే పోరాటాలు త్యాగాల పునాది మీద ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడం కూడా జాతీయ విధానం అని బీజేపీ నేతలు సమర్ధించుకోవడమే చిత్రాతిచిత్రం.
ప్రభుత్వ రంగం అన్నది ఉండకూడదు అని బీజేపీ జాతీయ విధానంగా పెట్టుకున్నపుడు ఇక సర్కార్ రంగంలో ఉన్న మిగిలిన వాటికి ఏదో రోజున ఉసురు పోవడం తప్ప ఊపిరి ఎలా ఉంటుంది.
ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకపోవచ్చు. కానీ మిశ్రమ ఆర్ధిక వ్యవస్థగా భారత దేశం ఉంది. ప్రభుత్వం కూడా వ్యాపార రంగంలో ఉంటేనే ప్రైవేట్ రంగం స్టేబిల్ గా ఉంటుంది, ప్రజలకు కూడా తగిన తీరున అన్నీ అందుబాటులోకి వస్తాయన్నది ఆర్ధిక నిపుణులు చెబుతున్న మాట.
ఇలా ఎన్ని చెప్పుకున్నా బీజేపీకి మాత్రం విశాఖ ఉక్కుని ప్రైవేట్ చేయాలని ఉంది. దానికి జాతీయ విధానం అంటారు, మరోటి అంటారు, లేక ప్లాంట్ ని ఇంకా అభివృద్ధి చేస్తామని అంటారు. ఏది ఏమైనా విశాఖ ఉక్కు ఉసురు తీస్తామని పురంధేశ్వరి మాటల ద్వారా మరోసారి చెప్పేశారు. ఘనకీర్తి కలిగిన విశాఖ ఉక్కు కర్మాగారానికి రోజులు లెక్కబెట్టుకోవడమే మిగిలిందనే అనుకోవాలి. అంతే.