Advertisement

Advertisement


Home > Movies - Reviews

The Warriorr Review: మూవీ రివ్యూ: ది వారియర్‌

The Warriorr Review: మూవీ రివ్యూ: ది వారియర్‌

టైటిల్: ది వారియర్‌
రేటింగ్: 2.5/5
తారాగణం: రామ్‌, ఆది పినిశెట్టి, కృతిశెట్టి, అక్షర గౌడ, నదియ తదితరులు
కెమెరా: సుజిత్ వాసుదేవ్
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాత: శ్రీనివాస్ చిత్తూరి
కథ - దర్శకత్వం: ఎన్ లింగుస్వామి

రామ్‌ అనగానే ఇప్పటికీ "ఇస్మార్ట్ శంకర్" గుర్తొస్తుంది. ఆ సినిమా తర్వాత 'రెడ్' అనే ఫ్లాపొచ్చినా, రామ్‌ పై ఇంకా ఇస్మార్ట్ ఇమేజ్ కొనసాగుతోంది. దానివల్ల ఈ ది వారియర్‌ పై కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. 

తమిళ సినిమాలు చూసే వారికి లింగుస్వామి దర్శకత్వమంటేనే పక్కా మాస్ మసాలా అని వేరే చెప్పక్కర్లేదు. దానికి తోడు దేవీశ్రీప్రసాద్ సంగీతమనగానే ఫుల్ డోస్ మాస్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు టార్గెట్ ఆడియన్స్ అవుతారు. మరి ఈ చిత్రం మాస్ ఆడియన్స్ మెప్పుదల పొందేలా ఉందా? 

ఇక విషయంలోకి వెళ్దాం.

కర్నూలులో డీఎస్పీగా చార్జ్ తీసుకున్న సత్య అనే ఆఫీసర్ లోకల్ గూండా గురుని ఎలా ఎదుర్కున్నాడనేది ప్రధాన కథ. 

ఇందులో కథేముంది..ఎప్పుడో వందలసార్లు వాడేసిన ఫార్ములాయే కదా అనిపిస్తోందా! బహుశా దర్శకుడికి కూడా ఇలాగే అనిపించి ఉండొచ్చు. అందుకే ఒక చిన్న పాయింట్ యాడ్ చేసి అదే కొత్తదనమనుకోమన్నాడు. అదేంటంటే .. డాక్టరైన హీరో పోలీసాఫీసరవడం. జబ్బు పడ్డ వ్యవస్థకి మందేయడానికి డాక్టర్ పోలీసవుతాడన్నమాట.

ఇక ఆది పినిశెట్టి ఇందులో విలన్. మర్డర్ చేసే ప్రతిసారి ఒక మొక్క నాటుతూ ఉంటాడు. ఇది కూడా కొత్తదనంలో భాగమే అనుకోవాలి. అయితే, ఎప్పుడో ముఠామేస్త్రిలో ఇలాగే ఒక విలన్ పాత్ర మర్డర్ చేసిన ప్రతిసారి చీమనో, దోమనో కాపాడి- "అక్కడ ప్రాణం తీసా..ఇక్కడ ప్రాణం పోసా..లెవెలైపోయింది" అంటూ ఉంటాడు. ఇక్కడ ఆది పినిశెట్టి ట్రాక్ చూస్తే ఆ ముప్పయ్యేళ్ల నాటి క్యారెక్టర్ గుర్తొస్తుంది. 

ఇలాంటి పాయింట్సేవో కొన్ని పెట్టుకుని కొత్త తరహా సినిమా తీస్తున్నట్టుగా అనుకుని తీసేస్తే ప్రేక్షకులు మాత్రం ఏం చేయగలరు నిట్టూర్చడం తప్ప.

మొదటిసారి డైరెక్ట్ తెలుగు సినిమా తీసిన లింగుస్వామికి ఇక్కడి ఆడియన్స్ పట్ల టేకిట్ ఫర్ గ్రాంటెడ్ అభిప్రాయమున్నట్టుంది. 

అదలా ఉంచితే హీరోయిన్ కృతికి రేడియో జాకీగా మంచి పాత్రే ఇచ్చారు కానీ ఆమె కథకేమీ ఉపయోగపడలేదు. ఇది కూడా దర్శకుడి లోపమే. కథానాయిక పాత్రని కథకి పనికిరాకుండా మలచడం మెచ్చుకోదగ్గ విషయం కాదు.

ఇతర నటీనటులు, సాంకేతికత బాగానే ఉన్నా ఎమోషన్ అందని విధం, రెండవ సగంలో ఆశించిన గ్రిప్ లేకపోవడం ఈ ది వారియర్ ని దెబ్బతినేలా చేసాయి. 

దేవీశ్రీప్రసాద్ స్వరపరిచిన పాటలు మాస్ ప్రేక్షకుల్ని పూర్తిస్థాయిలో రంజింపజేసేలా ఉన్నాయి. ముఖ్యంగా 'విజిల్, 'బుల్లెట్' పాటలు హైలైట్. 

సంభాషణల పరంగా సాయిమాధవ్ బుర్రా అక్కడక్కడ మెరుపులు చూపించాడు.

ప్రతి హీరోకి పోలీస్ క్యారక్టర్ చేయాలని ఉంటుంది. ఇన్నేళ్లకి రామ్‌ కి కూడా ఈ చిత్రంతో అవకాశమొచ్చింది. తన మార్క్ ఎనెర్జీతో పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. పోలీసుగా మారిన డాక్టర్ కనుక డబుల్ షేడ్స్ లో పర్ఫార్మెన్స్ చూపించాడు.

ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విశేషమేదైనా ఉంటే అది డీఎస్పీ సంగీతం, హీరోయిన్ కిడ్నాప్ సన్నివేశాన్ని తెరకెక్కించిన తీరు. మూస కొట్టుడు కథ, ఏ ట్విస్టూ లేని ఫ్లాట్ నెరేటివ్ ఈ సినిమాకి పెద్ద మైనస్సులు.

ఏ సినిమా అయినా ప్రధమార్థమెలా ఉన్నా ద్వితీయార్థం బలంగా ఉండాలి. కానీ ఇక్కడ అది జరగలేదు. హీరో అన్నాక విలన్ మీద గెలుస్తాడని అందరికీ తెలుసు. కానీ ఎలా గెలుస్తాడనే చోట కాంఫ్లిక్ట్ పాయింట్ బలంగా పెట్టుకోవడం ప్రాధమికమైన అంశం. దర్శకుడు ఈ విషయంలో విఫలమయినట్టే. కేవలం రామ్‌ లోని ఎనెర్జీ ప్రేక్షకుల్ని చివరిదాకా కూర్చోబెట్టిందంతే. 

కథ, కథనం, ప్లాట్ పాయింట్ అనే ఆయుధాలని బాగా పదును పెట్టుకుని ది వారియర్ వస్తాడనుకుంటే..పదును లేని పాత కత్తిలాంటి కథతో వచ్చాడు. అందుకే యుద్ధం చేసి ప్రేక్షకుల మనసు గెలవలేకపోయాడు. 

బాటం లైన్: యోధుడు దెబ్బతిన్నాడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?