ఎన్డీయే తరఫు అభ్యర్థి ద్రౌపది ఇప్పుడు రాష్ట్రపతి కాబోతున్నారు. ఎన్నిక తర్వాత ఆమె అపాయింట్మెంట్ తీసుకోవడం కూడా చాలా పెద్ద ప్రక్రియగా ఉంటుంది.
ఆమె ఎటూ ఓట్లు అభ్యర్థిస్తూ దేశమంతా తిరుగుతున్నది గనుక.. చిన్నా సన్నా రాజకీయ నాయకులందరూ ఆమెను కలుస్తున్నారు. కానీ, జనసేనాని పవన్ కల్యాణ్ కు మాత్రం ఆ అవకాశం రాలేదు. ఆ చాన్స్ ఆయన మిస్సయ్యారు. ‘‘రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాతో చాలా ప్రేమగా మాట్లాడుతారు, ఆప్యాయంగా ఉంటారు..’’ అంటూ భవిష్యత్తులో బహిరంగ సభల్లో చెప్పుకోగల అవకాశం ఆయన కోల్పోయారు.
పవన్ కల్యాణ్ రాజకీయం.. ప్రస్తుతం ఏపీ రోడ్ల మీదుగా సాగుతోంది. ఆ సంగతి పక్కన పెడితే.. గతంలో ఎన్నడో తాను పార్టీ పెట్టిన కొత్తల్లో, పార్టీని తీసుకెళ్ల బిజెపి పొత్తుల్లో కూర్చోబెట్టిన వేళల్లో మోడీ, అమిత్ షా తనతో ఆప్యాయంగా మాట్లాడారు కదాని.. అదే భ్రమంలో ప్రతి సభలోనూ.. నాకు మోడీ చాలా సన్నిహితుడు అని చెప్పుకునే అలవాటున్న నాయకుడు పవన్ కల్యాణ్.. కాబోయే రాష్ట్రపతి ద్రౌపదితో అలాంటి అవకాశాన్ని మిస్సయ్యారు.
పవన్ కల్యాణ్ ప్రధాన రాజకీయ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ద్రౌపది ఏపీకి వచ్చారు. తన విజయానికి ఎంతో కీలకమైన మద్దతు ఇవ్వగల, వైసీపీ ప్రజాప్రతినిధులందరినీ కలిశారు. జగన్ ఇంటికి వెళ్లి తేనీటి విందు స్వీకరించారు. చంద్రబాబునాయుడును, ఆ పార్టీవారిని కూడా కలిశారు. అయితే ఎన్డీయే భాగస్వామ్య పక్షంగనుక.. ఆమెను రిజర్వ్డ్ టైంలో తాను కూడా కలిసేలాగా.. పవన్ కల్యాణ్ తన ఢిల్లీ పలుకుబడిని ఉపయోగించుకుని ఓ భేటీ ఏర్పాటు చేసుకుని ఉంటే బాగుండేది.
ఒక వేళ ద్రౌపది హైదరాబాదు వచ్చి ఉంటే ఇక్కడ ఆమె కార్యక్రమాల షెడ్యూలు కూడా చాలా పరిమితమే. బిజెపి నాయకుల తర్వాత.. ఎన్డీయే భాగస్వామి పార్టీ అధినేతగా జనసేన పవన్ కల్యాణ్ ను కలిసే చాన్సుండేది. అలాంటి చాన్స్ పవన్ కు మిస్సయింది.
ఇలాంటి పరిణామాలు గమనించినప్పుడు.. జనసేన అనేది ఇంకా ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్నదనే మాట నిజమేనా? అనే సందేహం కలుగుతుంది. ఏపీలో ఎక్కడైనా ఉప ఎన్నికల్లోనో, ఇతర చిన్న సన్న ఎన్నికల్లోనో బిజెపి బరిలోకి దిగుతున్నప్పుడు తప్ప.. ఆ పార్టీ నాయకులు పవన్ కల్యాణ్ ను, జనసేనను గుర్తు చేసుకోరు!
తెలంగాణలో అయితే.. అసలు జనసేన అనే పార్టీ ఒకటి ఉన్నదని కూడా.. ఇప్పటిదాకా బిజెపి నాయకులు ఏ సందర్భంలోనూ పట్టించుకన్న దాఖలాలు లేనే లేవు. ఇలాంటి నేపథ్యంలో.. పవన్ కల్యాణ్ ఎత్తుగడలు ఎలా సాగుతాయో చూడాలి.