శిష్యుడిలో రోషం…బాబులో మ‌చ్చుకైనా లేదే!

శిష్యుడి రోషంలో క‌నీసం ఒక్క‌శాతం కూడా టీడీపీ అధినేత చంద్ర‌బాబులో క‌నిపించ‌లేదు. త‌న‌ది, త‌న పార్టీది రోషం, ఆత్మ‌గౌర‌వం లేని జీవిత‌మ‌ని ఆయ‌న నిరూపించుకున్నారు. ఇందుకు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ప్ర‌క్రియ వేదికైంది. …

శిష్యుడి రోషంలో క‌నీసం ఒక్క‌శాతం కూడా టీడీపీ అధినేత చంద్ర‌బాబులో క‌నిపించ‌లేదు. త‌న‌ది, త‌న పార్టీది రోషం, ఆత్మ‌గౌర‌వం లేని జీవిత‌మ‌ని ఆయ‌న నిరూపించుకున్నారు. ఇందుకు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ప్ర‌క్రియ వేదికైంది. 

కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న ఎన్‌డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్మును నిలిపింది. విప‌క్షాలు త‌మ అభ్య‌ర్థిగా య‌శ్వంత్‌సిన్హాను నిలిపాయి. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌డంలో తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు భిన్న వైఖ‌రి అవ‌లంబిస్తున్నాయి.

య‌శ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మ‌ద్ద‌తు ప‌లికింది. ఏపీ విష‌యానికి వ‌స్తే… పాల‌క ప్ర‌తిప‌క్ష పార్టీలైన వైసీపీ, టీడీపీ ఎన్‌డీఏ అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తు తెలిపాయి. ఇదే తెలంగాణ‌లో య‌శ్వంత్‌సిన్హాకు టీఆర్ఎస్ ఘ‌న స్వాగ‌తం ప‌ల‌క‌గా, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ మాత్రం రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిని క‌ల‌వాడినికి నిరాక‌రించింది.

కేసీఆర్‌ను క‌లిసిన అభ్య‌ర్థిని తాము క‌ల‌వ‌బోమ‌ని, ఓట్లు మాత్రం వేస్తామ‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. త‌మ వైఖ‌రిని కాంగ్రెస్ అధిష్టానానికి కూడా స్ప‌ష్టం చేసిన‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు. 

ఎందుకంటే తెలంగాణ‌లో టీఆర్ఎస్‌తో ఢీకొట్టున్న నేప‌థ్యంలో జ‌నంలోకి వ్య‌తిరేక సంకేతాలు వెళ్తాయ‌ని రేవంత్‌రెడ్డి చెప్పారు. చంద్ర‌బాబుకు రేవంత్‌రెడ్డి ప్రియ‌శిష్యుడ‌నే సంగ‌తి తెలిసిందే. శిష్యుడి పౌరుషం అలా వుంది మ‌రి.

ఏపీ విష‌యానికి వ‌స్తే త‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి వైసీపీకి బీజేపీ ప్రాధాన్యం ఇస్తోంద‌ని తెలిసినా… టీడీపీ మాత్రం సిగ్గులేకుండా తానూ వెంబ‌డిస్తోంద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

పైగా ద్రౌప‌ది ముర్మును క‌ల‌వ‌డానికి పెద్ద ఎత్తున లాబీయింగ్ చేయ‌డం టీడీపీకే చెల్లింది. అంతేకాదు, త‌మ‌ను క‌ల‌వ‌కుండా వైసీపీ నేత‌లు ప్ర‌య‌త్నించార‌ని సొంత మీడియా ద్వారా ఊద‌ర‌గొడుతున్నారు.

తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డి క‌న‌బ‌రిచిన పౌరుషం కూడా చంద్ర‌బాబులో లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. రాజ‌కీయాల్లో అధికార‌మే అంతిమ ల‌క్ష్యం కావ‌చ్చు. కానీ ప‌రువు, ప్ర‌తిష్ట‌, ఆత్మ‌గౌర‌వం, పౌరుషానికి మించి అధికారం సంతోషాన్ని ఇస్తుందా?  

హేమిటో చంద్ర‌బాబు చివ‌రికి ఇలా త‌యార‌య్యార‌నే కామెంట్స్ సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్నాయి.