తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి శ్రమ ఫలించింది. తిరుపతి జిల్లా వెంకటగిరి కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్మీడియట్ కోర్సును ప్రవేశ పెట్టాలనే ఆయన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చాయి.
వెంకటగిరి కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్ విద్యను స్టార్ట్ చేసేందుకు కేంద్రవిద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణదేవి సమ్మతించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా ఇచ్చారు.
వెంకటగిరిలో కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి వరకూ చదువుకునే అవకాశం ఉంది. టెన్త్ తర్వాత సీబీఎస్ఈలో చదువుకునే అవకాశం లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఈ విషయమై కేంద్రీయ విద్యాలయ విద్యార్థుల తల్లిదండ్రులు ఎంపీ గురుమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.
సీబీఎస్ఈ విద్య ప్రాధాన్యతను, అలాగే కేంద్రీయ విద్యార్థుల ఇబ్బందులను కేంద్రవిద్యాశాఖ దృష్టికి డాక్టర్ గురుమూర్తి పలుమార్లు తీసుకెళ్లారు. వెంకటగిరి కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్మీడియట్ కోర్సును ప్రారంభించాల్సిన ఆవశ్యకతను కేంద్రానికి వివరించారు.
తిరుపతి ఎంపీ వినతిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. హైదరాబాద్ రీజియన్‌లో ఉన్న వెంకటగిరి కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్‌ను ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. డాక్టర్ గురుమూర్తి కృషిని కేంద్రీయ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఆ విద్యాసంస్థ సిబ్బంది అభినందిస్తున్నారు.