ఇది నిజమా, ఇలాంటి ప్రకటనలను ఎన్నో సార్లు విన్నాం కదా. ఇపుడు కూడా అలాంటిదేనా అంటే. కానే కాదు, ఈసారు ఆరు నూరు కావచ్చు. కానీ జగన్ మాత్రం విశాఖలో మకాం పెట్టడం ఖాయమని పార్టీ వర్గాల నుంచి వస్తున్న విలువైన సమాచారం.
విశాఖను పాలనారాజధాని అని ప్రకటిస్తేనే న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి. అలా కాకుండా సీఎం క్యాంప్ ఆఫీస్ ని విశాఖలో ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి పాలించడానికి గల అవకాశాలను వైసీపీ సర్కార్ చాలా సీరియస్ గానే పరిశీలిస్తోంది అని అంటున్నారు.
ఆగస్ట్ నెల అంటే శ్రావణమాసం, మంచి ముహూర్తాలు ఉంటాయి. వాటిలో ఒక దాన్ని ఎంచుకుని ముఖ్యమంత్రి విశాఖ వస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి విశాఖలో మకాం కోసం ఆయన క్యాంప్ ఆఫీస్ కోసం భవనాలను ఎంపిక చేసి సిద్ధం చేసి కూడా ఉంచారు. రానున్న రెండేళ్ళ కాలమంతా జగన్ విశాఖ నుంచే తన పాలన సాగిస్తారు అని తెలుస్తోంది.
వారానికి అయిదు రోజులు విశాఖ నుంచే పాలన సాగేలా కీలకమైన నిర్ణయం దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది అని చెబుతున్నారు. అన్నీ అనుకూలిస్తే సాధ్యమైంత త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి అవుతాయని అంటున్నారు.
మూడు రాజధానుల విషయంలో న్యాయపరమైన అడ్డనుకు ఉన్నా సీఎం క్యాంప్ ఆఫీస్ ఎక్కడ పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న టెక్నికల్ రీజన్స్ ని అనువుగా చేసుకుని ఈ సంచలన నిర్ణయానికి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది అని తెలుస్తోంది.
అదే జరిగితే ఏపీ మరో మారు రాజకీయంగా వేడెక్కడం ఖాయం. అలాగే విశాఖ కూడా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ స్పాట్ గా ఉంటుంది.