దర్శకుడు కొరటాల ఆఫీసులో బయ్యర్ల గడబిడ మొదలైంది. నిన్నటికి నిన్న పాతిక మంది ఎగ్జిబిటర్లు..సెకండరీ బయ్యర్లు..సీడెడ్ నుంచి హైదరాబాద్ లోని కొరటాల కార్యాలయానికి చేరుకున్నారు.
రాత్రి అంతా అక్కడే వున్నారు. తెల్లవారి అక్కడే స్నానాలు చేసారని తెలుస్తోంది. కొరటాల, ఆయన స్నేహితుడు సుధాకర్ రావాలని కోరుతూ అక్కడే భైటాయించారని తెలుస్తోంది. మైత్రీ సంస్థ అధినేత నవీన్ రాయబారానికి వెళ్లినా వాళ్లు అంగీకరించలేదని తెలుస్తోంది.
కొరటాల, సుధాకర్ ఇద్దరూ రావాల్సిందే అని పట్టుపడుతున్నట్లు బొగట్టా. ఇక్కడ సమస్య ఏమిటంటే సీడెడ్ బయ్యర్ అభిషేక్ చాలా వరకు కింద అమ్మేసారు. అలా కొనుక్కున్నవాళ్లంతా దారుణంగా నష్టపోతారు.
ఇటీవల ఆంధ్ర ఏరియాకు కొంత సెటిల్ మెంట్లు చేసారు. కానీ సీడెడ్ కు చేయలేదు. దాంతో అందరూ వచ్చి కూర్చున్నారు. సీడెడ్ బయ్యర్ అభిషేక్, ఫైనాన్సియర్ శోభన్ కూడా రాత్రంతా అక్కడే పడుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు కొంచెం ఇస్తాం అడ్జస్ట్ చేసుకోండి అని అంటే అంగీకరించలేదని తెలుస్తోంది. 15 కోట్లు నష్టం వచ్చిందని ఎంత ఇస్తారో క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వాళ రేపు చూసి, ఎల్లుండి 250 మందితో చిరంజీవి ఇంటికి వెళ్తామని హెచ్చరిస్తున్నారు.