ఆశల కమలానికి ఇది అవమానం కాదా?

తెలంగాణలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని కమలదళం కలగంటోంది. అందుకు అన్ని రకాలుగానూ సన్నద్ధం అవుతోంది. రుజుమార్గంలోనూ, వక్రమార్గంలోనూ ఎన్ని రకాల రాజకీయాలు చేయవచ్చునో.. అన్ని రకాల రాజకీయాలూ వారు చేస్తున్నారు. అయితే..…

తెలంగాణలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని కమలదళం కలగంటోంది. అందుకు అన్ని రకాలుగానూ సన్నద్ధం అవుతోంది. రుజుమార్గంలోనూ, వక్రమార్గంలోనూ ఎన్ని రకాల రాజకీయాలు చేయవచ్చునో.. అన్ని రకాల రాజకీయాలూ వారు చేస్తున్నారు. అయితే.. భారతీయ జనతా పార్టీ (ఎన్డీయే) తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది, తన ఎన్నిక విషయంలో ఓట్లు అభ్యర్థించడానికి అసలు తెలంగాణ రాష్ట్రానికే రాకపోవడం స్థానికంగా ఆ పార్టీకి అవమానం కాదా? 

పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ కు కూడా వెళ్లి.. తమ మిత్ర పక్షం కాని పార్టీలతో కూడా భేటీ అయి ఓట్లు అభ్యర్థించిన ద్రౌపది.. తెలంగాణలో అడుగు పెట్టకుండా విస్మరిచడం గురించి.. ఇక్కడ కమలదళాలు ఎలా సర్ది చెప్పుకోగలరు? అనేది చర్చ!

రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినంత వరకు తెలంగాణలో అడుగుపెట్టవలసిన అవసరం ద్రౌపదికి లేకపోవచ్చు. కానీ..  యావత్ భారతదేశానికి ప్రథమ పౌరురాలిగా.. అత్యున్నత స్థానాన్ని అధిష్ఠించబోతున్న ద్రౌపది.. తనకు దేశంలోని అన్ని రాష్ట్రాలూ సమానమే అన్న భావన కలిగించడానికైనా తెలంగాణలో అడుగుపెట్టి ఉండవచ్చు కదా అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. 

పూర్తిగా అసలు ఆమె షెడ్యూలులోనే లేని రాష్ట్రం అయినా ఇంకో రకంగా ఉండేది. కానీ తెలంగాణకు ద్రౌపది రానుందని తొలుత ప్రకటనలు వచ్చాయి. తెలంగాణ మీద బిజెపికి చాలా ఆశలున్నాయి. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని కూడా హైదరాబాదులోనే నిర్వహించి.. రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించింది. ద్రౌపది కూడా హైదరాబాదు వచ్చి ఉంటే.. మరో కార్యకమం ద్వారా మీడియా అటెన్షన్ రాబట్టడానికి వారికి అవకాశం దక్కేది. 

నిజానికి తెలంగాణలో ప్రస్తుతం నాలుగు పార్టీల అస్తిత్వం మాత్రమే ఉంది. అధికారంలో ఉన్న తెరాసతోపాటు బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం ఉన్నాయి. బిజెపియేతర పార్టీలు మూడూ.. చాలా స్పష్టంగా విపక్ష అభ్యర్థి యశ్వంత్ కే ఓటు వేస్తాయి. ఇక సొంత పార్టీ బిజెపి వారు చచ్చినట్టు తనకే వేస్తారనే ధీమా ఉంది గనుక.. తెలంగాణకు ద్రౌపది వచ్చి ఉండకపోవచ్చు. 

అయితే ఆమె రాకపోవడం అనేది.. తెలంగాణ మీద సహజంగానే బిజెపికి ఉన్న చిన్నచూపునకు మరో నిదర్శనం అని.. ఇప్పుడు తెరాస సూటిపోటి మాటలు అనడానికి మరో అవకాశం ఏర్పడింది. 

తన శీతాకాల విడిది గృహం ఉన్న హైదరాబాదు నగరాన్ని సందర్శించకుండా.. ద్రౌపది ముర్ము తన ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేయగలరు.. కానీ పదవీకాలాన్ని పూర్తి చేయలేరు!!