మూత పడ్డ వందలాది థియేటర్లు

టాలీవుడ్ ఎగ్జిబిషన్ సెక్టార్ మళ్లీ సంక్షోభంలో కూరుకుపోతోంది. ఈ ఏడాది తొలిసగంలో పెద్ద సినిమాలు అన్నీ ఎవరో తరుముకు వస్తున్నట్లు క్యూ కట్టేసాయి.  Advertisement ఇక చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు మిగిలాయి. ఒకటి…

టాలీవుడ్ ఎగ్జిబిషన్ సెక్టార్ మళ్లీ సంక్షోభంలో కూరుకుపోతోంది. ఈ ఏడాది తొలిసగంలో పెద్ద సినిమాలు అన్నీ ఎవరో తరుముకు వస్తున్నట్లు క్యూ కట్టేసాయి. 

ఇక చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు మిగిలాయి. ఒకటి రెండో కాస్త పెద్ద సినిమాలు. టాప్ లైన్ హీరోల సినిమాలు ఏవీ ఇప్పట్లో లేవు. పైగా విడుదలవుతున్న సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర డింకీ కొట్టేస్తున్నాయి. 

వీటన్నింటికి తోడు వర్షాలు, గాలులు ఇంకో పక్క వ్యవసాయ పనులు పెరగడం. మొత్తం మీద అన్నీ కలిసి థియేటర్లకు సినిమాలు లేకుండా, వున్నా కూడా కలెక్షన్లు లేకుండా చేసేసాయి.

దాంతో ఈ వారం ఆంధ్ర, సీడెడ్, తెలంగాణలో చాలా థియేటర్లు మూత పెట్టారు. వారియర్ సినిమా విడుదలైతే మళ్లీ వీటిని తెరుస్తారు. అంతవరకు చాలా థియేటర్లు మూత పెట్టేసి వుంచారని బిజినెస్ వర్గాల బోగట్టా.

ఇలా మూసేసిన థియేటర్ల సంఖ్య 500 నుంచి 800 వరకు వుంటుందని అంటున్నారు. అయితే థియేటర్లు ఇలా నాలుగైదు రోజులు మూసినా ఉపయోగం ఏమీ వుండదు. కాస్త కరెంట్ బిల్లు తగ్గుతుంది తప్ప మరే ఇతర ఖర్చులు తగ్గవు.

దాని వల్ల ఎగ్జిబిషన్ సెక్టార్ మరింత నష్టాలే చవిచూడాల్సి వస్తోంది. పైగా ఈవారం వారియర్ విడుదలైనా, ఆ పై వారం నుంచి వారానికి ఒకటి, లేదంటే రెండు సినిమాలు తప్ప ఎక్కువగా వుండడం లేదు. 

ఇలా విడుదలైన సినిమా అలా లేచిపోతోంది. దీని వల్ల అన్ని థియేటర్లకు సరిపడా సినిమాలు వుండడం లేదు. ఈవారం విడుదలవుతున్న వారియర్ సినిమా ఓపెనింగ్స్ మీద టాలీవుడ్ కన్నేసి వుంది. 

ఇక ఈ సినిమాకు కూడా ఓపెనింగ్స్ రాకపోతే ఏం చేయాలి అన్నది టాలీవుడ్ ఆలోచించుకుంటుంది.