జీవిత కథలంటే సినిమా కథలేం గొప్ప కాదు. అసలు జీవితం నుంచే సినిమాలైనా, ఇతర ఏ కళలైనా ఆవిర్భవిస్తాయి. నిజానికి జీవితం నుంచి పుట్టినవే ప్రజల్ని రంజింపజేస్తాయి. వాస్తవికతకు కాసింత కాల్పనికత తోడైతే మంచి ఆర్ట్ అవుతుంది. అది సినిమా అయినా, నాటకమైనా, కథైనా, నవలైనా…దేనికైనా ఈ సూత్రం వర్తిస్తుంది.
ప్రముఖ సినీ రచయిత హిమాన్షు శర్మ, బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి బాలీవుడ్‌లో కథలు కథలుగా చర్చ నడిచింది. రాంఝానా అనే సినిమా షూటింగ్‌లో హిమాన్షుతో స్వరాభాస్కర్‌కు పరిచయం…ప్రేమ, పెళ్లికి దారి తీసింది. ఆ తర్వాత వాళ్లద్దరి విభేదాలు వచ్చి గత ఆగస్టులో విడిపోతున్నట్టు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సరదాగా మాట్లాడారు. హిమాన్షుతో బ్రేకప్ గురించి చెప్పారు. బ్రేకప్ గురించి ఇచ్చిన సుదీర్ఘ వివరణ ఓ సినిమా కథను తలపించింది. అదేంటో మనమూ తెలుసుకుందామా!
“బ్రేకప్ గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటాను. అదో పీడకలలా జరిగిపోయింది. ఇప్పటికీ నేను నమ్మలేకున్నాను. కానీ బ్రేకప్ జరిగిపోయింది. దాని గురించి అందరికీ చెప్పాలి. ఒక పార్క్‌లో మీరు, మీరు ప్రేమిస్తున్న వ్యక్తి కలిసి నడుస్తున్నారనుకోండి. పార్కులో చివరి వరకూ కలిసే నడవాలనుకుంటారు. అలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత…రెండు దారులు మీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి.
ఒకటి కుడి వైపు, రెండోది ఎడమ వైపు దారి. ఇద్దరూ కూడా చెరో దారిలో నడవాలని అనుకుంటారు. కానీ ఇద్దరూ కలిసి ఒకే దారిలో నడవాలనుకుంటే…కుడి లేదా ఎడమ వైపు దారికి ఇద్దరూ రావాల్సి ఉంటుంది. అంటే ఇద్దరిలో ఒకరు తమ కోరికను చంపుకుని….సరే నేను నా దారిని వదిలి నీతో నడుస్తాను అని చెప్పాలి. అలా నిర్ణయించుకోని పక్షంలో…ఆ ఇద్దరు గుడ్ బై చెప్పుకోవాలి.
మన ఇష్టాలను మాత్రమే కాకుండా పక్కవారి ఇష్టాలను కూడా గౌరవించుకున్నప్పుడే ఓ ఉన్నతమైన మనిషిగా మనం పరిణతి చెందిన వాళ్లమవుతాం. నా విషయంలో బ్రేకప్ ఎందుకు జరిగిందో అర్థమైందనుకుంటా. అయితే మా బ్రేకప్ విషయంలో ఎవరి తప్పూ లేదు” అని బాలీవుడ్ నటి బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ చెప్పుకొచ్చింది. మొత్తానికి బ్రేకప్ గురించి చెప్పమంటే….ఓ పెద్ద ప్రేమ కథనే చెప్పిందామె.