వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేషనల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ సెటైర్ వేశారు. నిజానికి ఆయన జగన్ కార్యనిర్వహణ సామర్థ్యాన్ని ప్రస్తుతించడం మాత్రమే జరిగింది. కానీ వాస్తవంలో అది వేరే వారిమీద సెటైర్ లాగా ధ్వనించింది. అయితే ఆయన వేసిన సెటైర్ మోడీ మీదనా? కేసీఆర్ మీదనా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
కరోనా ఉధృతరూపం దాల్చిన నాటినుంచి.. దేశంలోని దాదాపుగా అన్ని ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. మోడీ మార్చి 22న ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ విధించి, ఆ మరునాటినుంచే దేశం లాక్ డౌన్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి మద్దతుగా లాక్ డౌన్ ప్రకటించాయి. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకుండా.. కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి.
నరేంద్రమోడీ తతిమ్మా అన్ని కార్యకలాపాలను పక్కన పెట్టినట్టుగా… పూర్తి స్థాయిలో కరోనా మీదనే పనిచేస్తున్నారు. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వివిధ వర్గాల వారితో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. కరోనాపై పోరాటం ఎలా సాగాలో సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. అలాగే రోగులతోను, డాక్టర్లతోను కూడా మాట్లాడుతున్నారు. అతి తరచుగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. కరోనా విషయాలపై ప్రజలకు అప్ డేట్ లు తెలియజెబుతున్నారు. కేసీఆర్ కూడా ప్రతి రెండు రోజులకు ఒకసారి అధికార్లతో సమీక్ష, ప్రెస్ మీట్ పెడుతున్నారు.
జగన్మోహన రెడ్డి కూడా ఇదేస్థాయిలో పనిచేస్తున్నారు. వీరితో పోలిస్తే స్వయంగా పెట్టే ప్రెస్ మీట్ లు తక్కువ. అయితే విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో జగన్ చేతల మనిషి అని ప్రచారానికి ఆయన ఎప్పుడూ దూరంగా ఉంటారని పేర్కొన్నారు. ఇతర నేతల్లోని ప్రచారకాంక్షను ఆయన ఎత్తిచూపుతున్నట్లుగా ఉన్నదనే అభిప్రాయాలూ వస్తున్నాయి. టాస్క్ విజయవంతం అయితే జగన్, ఆ క్రెడిట్ ను అధికారులకు ఇస్తారని అంటున్న విజయసాయిరెడ్డి.. తాము గెలిపించిన నాయకుడే తమకు నేరుగా భరోసా ఇవ్వాలని ప్రజలు కోరుకుంటారని, అధికారులు వచ్చి చెప్పినంత మాత్రాన సంతుష్టి చెందరని ఎందుకు గుర్తించడం లేదో అర్థం కాని సంగతి.