నందమూరి బాలయ్య కేవలం సినిమా హీరో కాదు. ఓ పెద్ద కుటుంబానికి ప్రతినిధి. అంతే కాదు, ఓ నియోజకవర్గానికి ప్రతినిధి. శాసనసభ్యుడు. ప్రజలు విపత్తులో వున్నపుడు స్పందించాల్సిన బాధ్యత, ఆదుకోవాల్సిన అవసరం వున్నాయి. కానీ వితరణ సంగతి తరువాత కనీసం ఓ మాట కూడా రావడం లేదు బాలయ్య నుంచి.
చాలా మంది హీరోలు, సెలబ్రిటీలు విరాళాలు ప్రకటిస్తుంటే, లేదా కనీసం విడియో బైట్ లు వదులుతుంటే, బాలయ్య అసలు ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. రాజకీయనాయకులు నెల జీతాలు సిఎమ్ రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ప్రకటిస్తున్నారు. కానీ బాలయ్య నుంచి అలాంటి ప్రకటన ఏదీ రాలేదు.
సినిమా ప్రముఖులు అంతా కలిసి మెగాస్టార్ ఆధ్వర్యంలో సిసిసి కమిటీ కూడా ఏర్పాటు చేసారు. ఈ కమిటీకి కూడా బాలయ్య దూరంగానే వున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన సమకాలికులు నాగ్, వెంకీ, చిరు అందరూ ఈ కమిటీకి విరాళాలు ఇచ్చారు. కానీ బాలయ్య నుంచి స్పందన ఏదీ లేదు.
ఇంత నిర్మొహమాటంగా కరోనా మీద మొహమాటం లేకుండా మౌనంగా వున్న ఏకైక సెలబ్రిటీ బాలయ్య నే అనుకోవాలి.