కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సెలబ్రిటీల విరాళాల పరంపర కొనసాగుతూ ఉంది. ఈ విషయంలో టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కొహ్లీ- ఆయన భార్య, నటి అనుష్కా శర్మలు జాయింటుగా తమ డొనేషన్ ను ప్రకటించారు. ట్విటర్ లో ఆ భార్యాభర్తలు ఆ మేరకు ప్రకటన చేశారు. కోవిడ్ 19 ప్రబలుతున్న వేళ తమ వంతుగా ప్రభుత్వాలకు బాసటగా నిలుస్తున్నట్టుగా వారు పేర్కొన్నారు. ఈ విషయంలో వారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహాయ నిధి పీఎం-కేర్ కు, సీఎం రిలీఫ్ ఫండ్(మహారాష్ట్ర) ఖాతాకు విరాళాన్ని జోడిస్తున్నట్టుగా ప్రకటించారు.
తాము విరాళాన్ని ఇస్తున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన వీరిద్దరూ.. ఆ మొత్తం ఎంతనే విషయం గురించి అందులో పేర్కొనలేదు. కేవలం విరాళం ఇస్తున్నట్టుగా మాత్రమే వీరు ప్రకటించారు. ఆ డబ్బు ఎంతనే విషయాన్ని ప్రస్తావించలేదు. అయితే ఇండస్ట్రీ సోర్సెస్ ప్రకారం.. వీరు మూడు కోట్ల రూపాయల మొత్తాన్ని వారు డొనేట్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇది వారిద్దరి స్థాయికీ అంత భారీ మొత్తం ఏమీ కాకపోవచ్చు, అలాగని ఇది మరీ చిన్న మొత్తం కూడా కాదు. అస్సలు స్పందించని సెలబ్రిటీలతో పోలిస్తే విరాట్-అనుష్కలు ప్రకటించిన మొత్తం ఫర్వాలేదనిపించే స్థాయిదే. అయితే ప్రస్తుతం వారి కెరీర్ లు పీక్స్ లో ఉన్న నేపథ్యంలో వారు సంపాదించే దాంట్లో ఇదేమాత్రం పెద్ద మొత్తం అయితే కాదని స్పష్టం అవుతోంది.