ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఇంకా చాలా చాలా విషయాల్లో ప్రముఖుడైన అల్లు అరవింద్ కీలక సంస్త గీతా ఆర్ట్స్ లో ఆదాయ పన్ను అధికారులు సోదాలు జరిపారు. నిన్నటికి నిన్న అంటే గురువారం రోజంతా ఈ సోదాలు జరిగినట్లు బోగట్టా. శుక్రవారం కూడా కొనసాగాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. లేదు, గురువారం మాత్రమే అని కూడా టాక్ వుంది. సోదాల్లో ఏమీ దొరకలేదని, రికార్డులు కొన్ని తీసుకువెళ్లారని, శుక్రవారం నాడు ఆదాయపన్ను ఆఫీసుకు రమ్మని ఆదేశాలు ఇచ్చారని తెలుస్తోంది.
ఈమేరకు గీతాఆర్ట్స్ కు చెందిన కీలకవ్యక్తి బన్నీవాస్ ఆదాయపన్ను ఆఫీసుకు వెళ్లినట్లు బోగట్టా. గీతాఆర్ట్స్ కార్యాలయంలో చాలా కీలక కార్యాలయాలు వున్నాయి. నిర్మాణ రంగం, పంపిణీ రంగం, థియేటర్ల రంగం, ఫైనాన్స్, ఇంకా హీరోలు బన్నీ, శిరీష్ ల అక్కౌంట్లు అన్నీ ఈ కార్యాలయం నుంచే నిర్వహిస్తారు. వాస్తవానికి గీతాఆర్ట్స్ సంస్థకు చెన్నయ్ లో కూడా కార్యాలయం వుంది.
గీతాఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ తో సన్నిహిత బంధుత్వం వున్న సంగతి తెలిసిందే. అలాగే గీతా వ్యవహారాలు అన్నీ చక్కబెట్టే బన్నీ వాస్ జనసేనలో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దాంతో ఇండస్ట్రీలో ఈదాడులకు జనసేన రాజకీయాలకు ఏమైనా సంబంధం వుందా? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ఇవన్నీ రోటీన్ చెకప్ లే అని, ఇయర్ క్లోజింగ్ టైమ్ లో ఇలాంటివి అన్ని కార్యాలయాల్లోనూ కామన్ అని, అడ్వాన్స్ టాక్స్ గా సరైన మొత్తం వసూలుకు ఇలాంటివి చేస్తుంటారని కూడా వినిపిస్తోంది.