వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కించపరిచే క్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ అభాసుపాలయ్యారు. బీజేపీ అధిష్టానం సీరియస్ కావడంతో సత్యకుమార్ బొక్కబోర్లా పడి మూతిపళ్లు రాలగొట్టుకున్నట్టైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని వైసీపీని తాము అడగనే లేదని సత్యకుమార్ ప్రేలాపనలు రాజకీయ దుమారం రేపాయి. వైసీపీని అంటరాని పార్టీగా చూస్తామని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సత్యకుమార్‌కు మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సత్యకుమార్ ఎందుకలా మాట్లాడారని పార్టీ నాయకుల్ని బీజేపీ అధిష్టానం ఆరా తీసినట్టు సమాచారం. ఏపీ బీజేపీ నేతలు అధిష్టానానికి పంపిన సమాచారం ఏంటంటే…
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హాతో సత్యకుమార్‌కు మంచి స్నేహ సంబంధాలున్నాయి. గతంలో యశ్వంత్‌సిన్హా బీజేపీలో ఉన్నారు. కేంద్రమంత్రిగా పని చేశారు. వెంకయ్యనాయుడు కేంద్రగ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా ఉన్నప్పుడు సత్యకుమార్ ఓఎస్డీగా వ్యవహరించారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా వెంకయ్య ఉన్నప్పుడు సత్యకుమార్ కీలక పాత్ర పోషించారు.
వెంకయ్య, యశ్వంత్ సమకాలికులు, మంచి స్నేహితులు కావడంతో సత్యకుమార్ కూడా ప్రస్తుత విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా దగ్గరయ్యారని అధిష్టానానికి పంపిన నివేదికలో పొందుపరిచారు. వైఎస్సార్‌సీపీని రెచ్చగొట్టడం ద్వారా ద్రౌపది ముర్ముకు మద్దతు లేకుండా చేసి, యశ్వంత్ సిన్హాకు పరోక్షంగా లాభం కలిగించొచ్చనే ఎత్తుగడ వేశారనే అనుమానాలు లేకపోలేదు.
మరోవైపు తాము ఆరాధించే టీడీపీని మాట వరుసకు కూడా బీజేపీ మద్దతు అడగకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారనే వాదన తెరపైకి వచ్చింది. సాధారణంగా ఒకవేళ అడగకపోయినా మద్దతు ఇచ్చిన వాళ్లకు కృతజ్ఞతలు చెప్పడం సంస్కారం.
ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేరుగా జగన్‌కు ఫోన్ చేసి మద్దతు కోరారని తెలిసి కూడా వైఎస్సార్‌సీపీపై నోరు పారేసుకోవడాన్ని బీజేపీ నేతలే తప్పు పడుతున్నారు.
సొంత పార్టీ అండతో వేల కోట్లకు పడగలెత్తి, నేడు సొంత ఎజెండాను అమలు చేసే క్రమంలో, సొంత పార్టీకి వెన్నుపోటు పొడవాలనే కుట్రలకు తెరలేపారనే కోణంలో అధిష్టానానికి ఏపీ బీజేపీ నేతలు నివేదించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.
మరోవైపు తన సమీప బంధువును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయలేదనే అక్కసు …చివరికి ద్రౌపది ముర్ముకు వైఎస్సార్‌సీపీ మద్దతు దూరం చేయాలనే వరకూ ఆయన్ని దిగజార్చిందని అధిష్టానానికి నివేదించినట్టు సమాచారం.