ఆ మధ్య ఓ వార్త సంచలనం కావడం గుర్తు వుండే వుంటుంది. తిరుపతిలో పవన్‌కల్యాణ్ పోటీ చేస్తే లక్ష మెజార్టీ తెస్తామని, కావున ఇక్కడే పోటీ చేయాలని ఏకంగా జనసేన తీర్మానం చేసింది. లక్ష మెజార్టీ తెస్తామంటే… కనీసం గెలుపునకు డోకా ఉండదని ఎవరైనా నమ్ముతారు. కానీ తిరుపతి జనసేన నాయకుల మాటలన్నీ ఉత్తుత్తివే అని అక్కడి ఓ మినీ పోరు తేల్చి చెబుతోంది. తిరుపతి జనసేన నాయకుల మాటలు నమ్మితే… మరో భీమవరం, గాజువాక ఫలితాలే రిపీట్ అవుతాయని హెచ్చరించక తప్పదు.
తిరుపతి టౌన్‌బ్యాంక్ పాలక మండలి ఎన్నికలను అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తం 57 వేల ఓట్లున్నాయి. ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. 11న నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. 12 డైరెక్టర్ల పోస్టులకు ఇటు వైసీపీ, అటు టీడీపీ నామినేషన్లు వేశాయి. తిరుపతిలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వైసీపీ, టీడీపీ మద్దతుదారులు భారీగా ప్రచారం చేస్తున్నారు.
బీజేపీ తరపున ఏకైక అభ్యర్థి వరప్రసాద్ నామినేషన్ వేశారు. ఇక్కడ కూడా బీజేపీలో భానుప్రకాశ్‌రెడ్డి అనే పే…ద్ద లీడర్ ఉన్నారు. ఈయన టీవీ చర్చల్లో తప్ప, తిరుపతి జనం మధ్య ఎప్పుడూ కనిపించరు. బతకనేర్చిన రాజకీయ నాయకుడని ఈయనను తిరుపతిలో ముద్దుగా పిలుస్తుంటారు. అందుకే ఒక్కరంటే ఒక్కరే నామినేషన్ వేశారు. ఇక బీజేపీ మిత్రపక్షం జనసేనకు సంబంధించి ఒక్కరంటే ఒక్కరు కూడా నామినేషన్ వేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తిరుపతి జనసేన నాయకులుగా మీడియాలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ ప్రముఖంగా కనిపిస్తుంటారు. ఏయ్ వైసీపీ నాయకుల అంతు తేలుస్తామని ప్రగల్భాలు పలుకుతుంటారు. రాజారెడ్డి అనే నగర అధ్యక్షుడు కూడా ఉన్నాడు. డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కూడా. అలాగే కిరణ్‌రాయల్ తిరుపతి శాసనసభ నియోజకవర్గ ఇన్‌చార్జ్. వీళ్లే ఇటీవల తిరుపతిలో పవన్‌కు లక్ష మెజార్టీ తెస్తామని తీర్మానించింది.
తాజాగా తిరుపతి అసెంబ్లీ మినీపోరుగా భావిస్తున్న తిరుపతి టౌన్‌బ్యాంక్ పాలక మండలి ఎన్నికలకు జనసేన దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. కనీసం 12 డైరెక్టర్ పోస్టులకు నామినేషన్ వేసే దిక్కు కూడా జనసేనకు తిరుపతిలో లేదా? పార్టీ అంత అధ్వానంగా ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికలున్నాయని జనసేన అధిష్టానానికి తెలియదని సమాచారం. ఈ ఎన్నికల ప్రాధాన్యం పార్టీ దృష్టికి ఉద్దేశ పూర్వకంగా తిరుపతి జనసేన నాయకులు తీసుకెళ్లలేదని తెలిసింది.
ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన అధిష్టానం ఆదేశిస్తే తమ బండారం బయటపడుతుందని తిరుపతి నాయకులు జాగ్రత్త పడ్డారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా రెండు మూడు స్థానాలకు మించి జనసేన పోటీ చేయని సంగతి తెలిసిందే. జనసేనను అడ్డుపెట్టుకుని పసుపులేటి హరిప్రసాద్ గతంలో టీటీడీ బోర్డు మెంబర్ పదవిని దక్కించుకున్నారు.
ఎన్నికల విషయానికి వచ్చే సరికి ఆయన దూరంగా ఉంటారు. అలాగే మరికొందరు నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతూ అధినేత దృష్టిలో పవన్ దృష్టిలో పార్టీ కోసం పని చేస్తున్నారనే బిల్డప్ ఇస్తున్నారు. కొందరు నాయకులు జనసేనను అడ్డుపెట్టుకుని తిరుమల దర్శన టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని గతంలో చెప్పుకున్నాం.
కేవలం జనసేనను సొంత ప్రయోజనాలకు వాడుకోవడమే తప్ప, పార్టీకి వాళ్లు చేస్తున్నదేమీ లేదనేందుకు తిరుపతి టౌన్ బ్యాంక్ పాలక మండలి ఎన్నికల్లో జనసేన చేతులెత్తేయడమే నిదర్శనమని చెప్పొచ్చు. ఇలాంటి వాళ్లను నమ్ముకుని లక్ష మెజార్టీ వస్తుందని పవన్ తిరుపతిలో పోటీ చేస్తే నిండా మునగడం ఖాయం.
తిరుమలకు వెళ్లకుండానే తిరుపతిలోనే పవన్‌కు సొంత పార్టీ నాయకులు గుండు కొడతారనే సరదా కామెంట్స్ ఆధ్మాత్మిక క్షేత్రంలో వినిపిస్తున్నాయి.