టాలీవుడ్ కు కాంగ్రెస్ పార్టీకి, టాలీవుడ్ కి వైఎస్ఆర్ కు, టాలీవుడ్ కు వైఎస్ జగన్ కు మధ్య దూరం ఎప్పుడూ తరిగేది కాదు. కాస్త పెరిగేదే కానీ. అందుకే టాలీవుడ్ లో వైఎస్ఆర్ అంటీ ముట్టనట్లే వుంటూ వచ్చారు. జగన్ కూడా అలాగే వుంటూ వస్తున్నారు. దగ్గరకు వస్తే ఆహ్వానిస్తున్నారు. లేదంటే లేదు. టికెట్ ల సమస్య వచ్చినపుడు టాలీవుడ్ అంతా అల్లల్లాడిపోయింది.
పెద్ద పెద్ద వాళ్లంతా జగన్ ను కలిసారు. రాయబారాలు చేసారు. మొత్తానికి అనుకున్న రేట్లు సాధించారు. జగన్ కు కావాల్సిన రేట్లు ఇచ్చేసారు. ఇప్పుడు ఇండస్ట్రీనే అంత రేట్లు వద్దు అనుకుంటూ తనంతట తాను తగ్గించుకుంటోంది.
జగన్ దగ్గరకు మెగాస్టార్ వెళ్లి, బతిమాలినట్లు మాట్లాడేసరికి చాలా మంది పరోక్షంగా విమర్ళలు కురిపించారు. కానీ అదే టాలీవుడ్ లో చాలా మంది తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగి వున్నారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ అదే కొనసాగుతోంది.
ఆ మధ్య జరిగిన తెలుగుదేశం మహానాడుకు టాలీవుడ్ నుంచి కాస్త చెప్పుకోదగ్గ మేరకు విరాళాలు అందాయని వినిపిస్తోంది. చాలా మంది సినిమా ప్రముఖులు తమ వంతు బాధ్యతగా ఈ విరాళాలు మహానాడు కోసం అందించారని తెలుస్తోంది. అంతే కాదు, రాబోయే ఎన్నికల సమయంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఫండింగ్ చేయడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు జరుగుతున్నాయని బోగట్టా.
ఇదిలా వుంటే ఆంధ్రలో వైకాపాకు వ్యతిరేకంగా పోరాడుతున్న జనసేనకు కూడా టాలీవుడ్ నుంచి విరాళాలు అందిస్తున్నారు. జనసేన చేపట్టిన కౌలు రైతుల సహాయం అనే కార్యక్రమానికి కూడా టాలీవడ్ ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. కానీ వీటిని బహిరంగంగా తెలియపర్చలేదు.
కొంతమంది మెగా హీరోలు ఇచ్చిన విరాళాలు ప్రకటించారు కానీ ఇండస్ట్రీ జనాలు ఇచ్చినవి మాత్రం ప్రకటించలేదు. అనవసరంగా వారి పేర్లు బయటకు రావడం ఎందుకనే ఆలోచనతో అలా చేసినట్లు తెలుస్తోంది.
మొత్తం మీద టాలీవుడ్ లో మళ్లీ యాంటీ వైకాపా ట్రెండ్ గట్టిగానే పుంజుకుంటోంది అని తెలుస్తోంది. అంటే ఓ సెక్షన్ జగన్ తో మంచిగా వున్నట్లు, వుండాలని ప్రయత్నిస్తుంటే మరో సెక్షన్ జగన్ కు వ్యతిరేకంగా సహాయకార్యక్రమాలు చేపడుతున్నట్లు కనిపిస్తోంది. బహుశా టాలీవుడ్ పట్ల జగన్ విధానాలు నచ్చక ఈ ట్రెండ్ లోకి వెళ్తోందేమో టాలీవుడ్?