పేనుకు పెత్తనమిస్తే తలమొత్తం కొరికిందని సామెత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులతో సంబంధాల నిర్వహణకు ఉద్దేశించిన శాఖ విషయంలో ఈ సామెత అచ్చంగా సరిపోతుందని అనిపిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వంలో ఐ అండ్ పిఆర్ అనే శాఖ మనుగడ సాగించేది మౌలికంగా జర్నలిస్టులకు సేవలందించడానికి, ప్రభుత్వం తరఫున జర్నలిస్టులకు అవసరమైన సమాచారం అందించడానికి, జర్నలిస్టులతో సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, స్థూలంగా ప్రభుత్వ అనుకూల ప్రచారం రాబట్టడానికి.. అనే సంగతి ఆ శాఖ వారికి తెలుసో లేదో అనే సందేహం పలువురికి కలుగుతోంది.
ఐ అండ్ పిఆర్ శాఖకు అత్యున్నత స్థానంలో సారధిగా విజయకుమార్ ఉన్నారు. ఆ శాఖలోని ఏ ఉద్యోగి అనుచిత ప్రవర్తనకైనా సరే.. శాఖాధిపతిగా అంతిమబాధ్యత ఆయనదే అవుతుంది.
ఆ శాఖ మాత్రం జర్నలిస్టులను శత్రువుల్లాగా చూడడం, జర్నలిస్టులకు ప్రభుత్వం పట్ల ద్వేషం పెరిగేలా చేయడం తమ విధి అన్నట్లుగా వ్యవహరిస్తుంటుంది.
ప్రభుత్వం పరంగా జర్నలిస్టులకు కొన్ని సదుపాయాలుంటాయి. వారికి ఉచితంగా ఇంటి స్థలాలు ఇవ్వడం లాంటిది అందులో అతిపెద్ద సదుపాయం సహాయం. అలాగే వారికి అక్రిడేషన్ ఇవ్వడం అనేది అతి చిన్న సాయం. అక్రిడేషన్ అంటే అదేమీ మహాద్భుతమైన వరం కాదు. ప్రభుత్వ పరంగా వారికి జర్నలిస్టు అనే గుర్తింపు.
ప్రభుత్వం గుర్తించినా గుర్తించకపోయినా.. జర్నలిస్టు ఉద్యోగాల్లోనే మనుగడ సాగించేవారు.. జర్నలిస్టులు కాకుండాపోరు. నిజానికి జర్నలిస్టులకు సదరు అక్రిడేషన్ ఇవ్వడం అనేది వారిని గుర్తించడం ద్వారా ప్రభుత్వం పొందగల గౌరవం కూడా! కానీ అలాంటి గౌరవం ప్రభుత్వానికి దక్కకుండా చూడడంలో ఐఅండ్ పిఆర్ శాఖ తన శక్తివంచనలేకుండా శతవిధాల కృషి చేస్తోంది.
అసలు ఆ శాఖ జర్నలిస్టులతో సంబంధాలు నెరపడంలో ప్రభుత్వ ప్రతినిధి. వారితో నిత్యం స్నేహశీలంగా ఉండాలి. కానీ.. అక్కడి ఉద్యోగుల తీరు ఎలా ఉంటుందంటే.. ఓ పండుగ సందర్భంగా జర్నలిస్టులకు స్వీట్ బాక్సులు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పిస్తే.. ఆయన విలేకర్లకు ఫోను చేసి. ‘జగన్ గారు స్వీట్ బాక్సులు ఇవ్వమన్నారు.. వచ్చి తీసుకెళ్లండి’ అని చెప్పి దులుపుకున్నారు. కనీసం ఓ ఆఫీస్ బాయ్ తో వాళ్లకు పంపితే ఎంతో గౌరవంగా ఉండేదానికి బదులు, వారినే వచ్చి స్వీట్స్ తీసుకెళ్లమనడం వారికే చిన్నతనం అనిపించే వ్యవహారంగా మారింది.
జర్నలిజంలో అగ్రశ్రేణి దినపత్రికల్లో మూడుదశాబ్దాలకు పైబడిన అనుభవం ఉన్న జర్నలిస్టులకు కూడా విజయకుమార్ అక్రిడేషన్లు నిరాకరిస్తున్నారని వారు గగ్గోలు పెడుతున్నారు. అక్రిడేషన్లు ఇవ్వడానికి నానా రూల్సు పెడుతున్నారని కూడా అంటున్నారు. అక్రిడేషన్ల మీద జర్నలిస్టులకు విధిగా దక్కే అవకాశం, లాభం బహుశా బస్సు పాస్ మాత్రమే.
అందులో కూడా ఒకస్థాయి అక్రిడేషన్లకు కేవలం జిల్లా వరకు మాత్రమే బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులు బాటు ఉంటుంది. రాష్ట్రస్థాయి బాధ్యతల్లో ఉంటూ, ఆ స్థాయి అక్రిడేషన్ పొందేవారికి మాత్రం రాష్ట్రమంతా రాయితీపై బస్సులో, రైలులో ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. అంతకు మించి ఈ అక్రిడేషన్లతో వారు బావుకునేది.. కోట్లు కూడబెట్టుకునేది ఏమీ ఉండదు.
కానీ.. కొన్ని సందర్భాల్లో ప్రత్యేకించి.. ప్రధాని, రాష్ట్రపతి వంటి వీవీఐపీలకు సంబంధించిన కార్యక్రమాల్లో అక్రిడేషన్లు ఉన్న వారికి తప్ప.. లోనికి అనుమతి కూడా ఉండదు. సీనియర్ జర్నలిస్టులకు కూడా అనుమతి నిరాకరిస్తే వారు బాధపడతారు. కానీ.. ఐఅండ్ పిఆర్ శాఖ మాత్రం.. ఎవరి బాధలతోను, ఎవరికి దక్కే అవమానాలతోనూ తనకున సంబంధం లేదు గనుక.. ఎడాపెడా అక్రిడేషన్లు తిరస్కరించేస్తుంటారు.
నిజానికి జర్నలిస్టులు అందరితోనూ ప్రభుత్వం సత్సంబంధాలు కలిగి ఉండడం అనేది మంచి పద్ధతి. నిజానికి జగన్ కూడా పాత్రికేయులతో చాలా స్నేహంగానే మెలగుతారనే పేరుంది. కొన్ని పత్రికల యాజమాన్యాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషం కక్కుతున్నా సరే.. ఆ పత్రికల జర్నలిస్టులతో కూడా జగన్ బాగానే మాట్లాడుతుంటారు.
ఒకరిద్దరు తప్ప! అలాంటిది.. అదే ప్రభుత్వంలో భాగమైన కీలక శాఖ మాత్రం.. జర్నలిస్టుల్లో ప్రభుత్వం మీద ద్వేషం పెంచడానికి ఇతోధికంగా కృషి చేస్తున్నదని, అందుకు అక్రిడేషన్ల తిరస్కరణనే మార్గంగా ఎంచుకున్నదని అందరూ భావిస్తున్నారు.