తెలుగు వారి ఆత్మగౌరవం నినాదం పేరుతో తెలుగుదేశం పార్టీ అవతరించింది. చంద్రబాబు పుణ్యమా అని ఆత్మగౌరవానికి సమాధి కట్టారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు ప్రకటించింది.
తెలుగుదేశం పార్టీ వ్యూహ కమిటీ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపిక, నామినేషన్ ప్రక్రియలోనూ టీడీపీని ఎవరూ పట్టించుకోలేదు. అధికార పార్టీ బీజేపీనే కాదు, ప్రతిపక్షాలు కూడా చంద్రబాబును పరిగణలోకి తీసుకోలేదు.
ప్రచార నిమిత్తం ద్రౌపది ముర్ము ఇవాళ విజయవాడకు వస్తున్నారు. ఏపీ అధికార పార్టీ వైసీపీ ఆమెకు ఘన స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ద్రౌపది విజయవాడకు వస్తున్న తరుణంలో టీడీపీ మద్దతు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కనీసం అడగకుండానే మద్దతు ప్రకటించిన నేపథ్యంలో, తమను కలవడానికి ద్రౌపది వస్తారనే చిన్న ఆశ చంద్రబాబులో కనిపిస్తోంది.
కానీ బీజేపీ అహంకారపూరితంగా వ్యవహరిస్తుంటే, చంద్రబాబు మాత్రం లొంగిపోవడాన్ని సొంత పార్టీ వాళ్లు జీర్ణించుకోలేక పోతున్నారు. మోదీ, అమిత్‌షాలకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని టీడీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు. అడగకుండానే మద్దతు ప్రకటించి ఆత్మగౌరవాన్ని ఎందుకు బలి పెట్టారో అర్థం కావడం లేదని టీడీపీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో పాల్గొన్న పలువురు నేతలు చర్చించుకోవడం గమనార్హం.
రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా వుండి వుంటే ఆత్మగౌరవం నిలబెట్టుకున్న పార్టీగా చరిత్ర గుర్తించేదని టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు తన భయంతో ఇంత కాలం కాపాడుకొస్తున్న ఆత్మగౌరవం సర్వనాశనమైందనే ఆవేదన పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది.
సిగ్గులేకుండా బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన తర్వాత కూడా… ఎన్డీఏ నుంచి కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకపోవడం ఆత్మహత్యా సదృశ్యమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ పతనానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.