టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన రాజకీయ స్వార్థానికి ఎవరినైనా బలి పెడతారని…ఆయన రాజకీయ పంథా చూసిన వాళ్లు చెబుతుంటారు. తాజాగా తన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలను కూడా రాజకీయానికి బలి పెట్టాలని అనుకుంటున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది.
అందుకే జగన్ తల్లి, చెల్లి గురించి చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే రాజకీయ తెరపైకి తెస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. తద్వారా తన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలను రాజకీయంగా బజారుకీడ్చాలని చంద్రబాబు ఆశిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకుని పోరాడుతున్న తనయ షర్మిలకు అండగా నిలిచేందుకు వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు వైఎస్ విజయమ్మ భావోద్వేగంతో ప్రకటించారు. ఒకే వ్యక్తి వేర్వేరు పార్టీలకు ప్రాతినిథ్యం వహించడం ద్వారా విమర్శలకు, నిలదీతకు కారణమవుతుందని, ఆ అవకాశం ఇవ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విజయమ్మ ప్రకటించారు.
అయితే తల్లి విజయమ్మనే పార్టీ నుంచి గెంటేసినవాడు ప్రజలకు ఏం చేస్తాడని చంద్రబాబు ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉంది. తన కుటుంబ సభ్యుల్ని ప్రతిపక్షాలు తిట్టాలని చంద్రబాబు కోరుకుంటున్నారని, అందుకే ప్రత్యర్థి పార్టీ అధినేత తల్లి, చెల్లి ప్రస్తావన తెచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే బాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిల మధ్య మనస్పర్థలు వచ్చాయని వైసీపీ నేతలు విమర్శలకు పదును పెట్టారు. బాబు, భువనేశ్వరి ఫార్మ్‌హౌస్‌లో వుంటున్నారని, తాను చెప్పింది నిజం కాకపోతే ఏ శిక్షకైనా సిద్ధమని మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అటు వైపు నుంచి నో సౌండ్. టీడీపీ మౌనం అర్ధంగీకారమని భావించాలేమో!
పదేపదే తన భార్య, కోడలిని ప్రత్యర్థులతో విమర్శించేలా చేయడం ద్వారా సానుభూతి పొందాలనే చిల్లర రాజకీయానికి చంద్రబాబు పాల్పడ్డారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రత్యర్థి పార్టీ అధినేత తల్లి, చెల్లి గురించి విమర్శలు చేస్తే, అటువాళ్లు అంతకంటే తీవ్రంగా తన కుటుంబ సభ్యులపై మాట్లాడ్తారని, దాన్ని రాజకీయంగా క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పిల్లనిచ్చి, రాజకీయ భవిష్యత్ ఇచ్చిన ఎన్టీఆర్‌ను సీఎం సీటుతో పాటు పార్టీ పదవి నుంచి గెంటేసి వెన్నుపోటుకు పర్యాయపదంగా నిలిచిన నాయకుడు చంద్రబాబు. వైశ్రాయ్ హోటల్ సాక్షిగా 1995లో ఎన్టీఆర్‌ను అత్యంత అవమానకర రీతిలో చంద్రబాబు సాగనంపారు. సొంతవాళ్లే వెన్నుపోటు పొడవడాన్ని ఎన్టీఆర్ జీర్ణించుకోలేకపోయారు.
ఆ మనో వేదనతోనే ఎన్టీఆర్ ప్రాణాలు కోల్పోయారు. మామను పదవీచ్యుతుడిని చేయడంలో బామ్మర్దులు, సడుగుడిని చంద్రబాబు ఏ విధంగా వాడుకున్నారో …బాబు బాధితులు చెప్పిన సంగతులు రికార్డు అయ్యాయి. అల్లుడు చంద్రబాబు దుర్మార్గం గురించి ఎన్టీఆర్ విడుదల చేసిన వీడియో ఉండనే ఉంది. ఇలాంటి వ్యక్తి విజయమ్మను కుమారుడు గెంటేశాడని విమర్శించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తల్లినే గెంటేసిన వాడు ప్రజలకేం చేస్తాడని ప్రశ్నిస్తున్న చంద్రబాబు…. మరి మామను, బామ్మర్ది హరికృష్ణ, మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్, సడుగుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును గెంటేసిన మాటేమిటి? మరి తన విశ్వసనీయత గురించి ప్రజలకేం చెబుతారనే ప్రశ్నకు బాబు సమాధానం ఏంటి?
తన భార్య గురించి వైసీపీ ఎమ్మెల్యేలు ఏదో అన్నారని వెక్కివెక్కి ఏడ్చిన చంద్రబాబు… ఇప్పుడు పదేపదే జగన్ తల్లి, చెల్లి గురించి అనవసరంగా రాజకీయ తెరపైకి తేవడం సబబేనా? వైసీపీ వాళ్లు తన కుటుంబంలోని ఆడవాళ్ల గురించి మాట్లాడాలని కోరుకునే క్రమంలోనే బాబు అవాకులు చెవాకులు పేలుతున్నారంటే కాదనగలరా? ఎవరో పెట్టిన పార్టీని జగన్ లాక్కోలేదు. కానీ చంద్రబాబు పరిస్థితి అది కాదు.
ఎన్టీఆర్ పెట్టిన పార్టీని ఆయన బతికి ఉండగానే నిర్దాక్షిణ్యంగా లాక్కోవడం నిజం కాదా? గెంటేయడం గురించి చంద్రబాబు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
ఎందుకంటే ఆ విషయంలో పేటెంట్ తనదే అని చంద్రబాబు గుర్తెరగాలి. తనతో పాటు జగన్ కూడా వెన్నుపోటుదారుడని లోకానికి చెప్పడానికి తరచూ విజయమ్మ, షర్మిలమ్మ ప్రస్తావన తెస్తున్నారు. ఏది ఏమైనా అన్ని అవలక్షణాలకు చంద్రబాబే ఆదర్శం. కాబట్టి తనకు పనికొచ్చే రాజకీయాలు చేయడం ఆయనకే మంచిది.