ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సెప్టెంబరు 25వ తేదీ నుంచి పాదయాత్రలు చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని రకాలుగా విఫలమైందో ప్రజలకు తెలియజెప్పడానికి, వారిలో చైతన్యం తీసుకురావడానికి రాష్ట్రవ్యాప్తంగా ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ నాయకుడు సత్య కుమార్ ప్రకటించారు.
భారతీయ జనతా పార్టీకి- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఎలాంటి స్నేహబంధమూ లేదని చాటి చెప్పుకోవడానికి బిజెపి ఇప్పుడు నానాపాట్లు పడుతోంది. తామిద్దరం స్నేహితులు కాము అని చెప్పడానికి కాస్త అతిగా దూషించడం కూడా జరుగుతోంది.
ఎక్కువ నిందలు వేస్తే.. సత్యాసత్యాలతో నిమిత్తం లేకుండా అదే పనిగా తిడితే.. వైఎస్ఆర్ కాంగ్రెస్తో తమకు స్నేహం లేదని ప్రజలు అనుకుంటారని వారి భావన. అలా తాము ఒక ప్రతిపక్షంగా గుర్తింపు తెచ్చుకుని వచ్చే ఎన్నికలలో సొంతంగా సీట్లు సాధించే స్థాయికి వెళ్లాలని వారి కోరిక కావచ్చు! రాజకీయ ప్రయోజనాలు తప్ప ఉచితానుచితాలు ఎరగని పోకడలు ఇవి!
కమల రాజకీయాలను గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనుగడ సాగిస్తుండడానికి సమస్త పోషణ భారము కేంద్ర ప్రభుత్వమే తమ జేబులోంచి ఖర్చు పెడుతున్నట్లుగా బిల్డప్ ఇవ్వాలనే తాపత్రయం మనకు కనిపిస్తుంది! రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ కార్యక్రమంలోను కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయనే ప్రచారాన్ని వారు కోరుకుంటున్నారు! అంతా కేంద్ర ప్రభుత్వమే అన్నట్లుగా వారు ఇక్కడ మాట్లాడుతుంటారు!!
గరిష్టంగా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరిగే సంక్షేమ పథకాలు అయితే భారతీయ జనతా పార్టీ ఏర్పడిలో మనుగడ సాగిస్తున్న ఇతర రాష్ట్రాల పరిధిలో ఇలాంటి అద్భుతమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎందుకు అమలు కావడం లేదు! జగన్మోహన్ రెడ్డి సంకల్పం నుంచి పుట్టిన ప్రజా సంక్షేమ పథకాలు ఇక్కడ అమలవుతుంటే వాటి కీర్తిలో తమకు వాటా కావాలని బిజెపి నాయకులకు కక్కుర్తి ఎందుకు అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం!?
ఇక మళ్ళీ అసలు విషయానికి వస్తే– భారతీయ జనతా పార్టీ సెప్టెంబరు 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి నిర్ణయించుకుంది అయితే ఆ పార్టీకి బుద్ధి రావాలంటే ప్రజలు పార్టీ రహితంగా స్పందించాల్సిన.. కార్యాచరణకు పూలుకోవాల్సిన.. సమయం ఇది. భారతీయ జనతా పార్టీ పాదయాత్ర పేరుతో.. ఏ ఊరిలో అడుగుపెడుతూ ఉంటే.. ఆ ఊరిలో స్థానిక ప్రజలు తలా కొంచెం చందాలు వేసుకుని అయినా పెద్ద పెద్ద ఫ్లెక్సీ పోస్టర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది! భారతీయ జనతా పార్టీ పాదయాత్ర సాగించే మార్గం నిండుగా ఇలాంటి అనేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది!
ఆ ఫ్లెక్సీలలో ఏం ఉండాలో తెలుసా
ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలను వంచించడం ద్వారా, రాష్ట్రానికి ఎంత పెద్ద ద్రోహం జరిగిందో ఆ ఫ్లెక్సీల్లో పేర్కొనాలి. ప్రత్యేక హోదా అనేది వచ్చి ఉంటే కనుక ఈ రాష్ట్రం ఎంత సర్వతోముఖంగా అభివృద్ధి చెంది ఉండేదో ఆ పోస్టర్లల్లో వివరించాలి. ప్రత్యేక హోదాను నిరాకరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత దురవస్థకు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎంత బాధ్యత వహించాల్సి ఉన్నదో వారికి తెలియజేయాలి.
పాదయాత్ర చేసే స్థానిక నాయకులు చేతనైతే గనుక మోడీ ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రత్యేక హోదా తీసుకురావాలనే డిమాండ్ అడుగడుగునా వారికి ఆ పాదయాత్రలో తెలిసి రావాలి. గుర్తుచేయాలి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ఘోరమైన ద్రోహాన్ని తలపెడుతున్నారో ఈ పాదయాత్రలో నాయకులకు వివరించాలి.
ఇలా కేంద్ర ప్రభుత్వపు అసమర్థ, వివక్షాపూరితమైన ద్రోహచింతనతో కూడిన పోకడల వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతగా నష్టపోతున్నదో తెలియజేయాలి. అదంతా జరిగిన తర్వాత తాము రాష్ట్రంలో పాదయాత్ర సాగించడం ద్వారా ఏం సాధించాలో స్థానిక కమల నాయకులు డిసైడ్ చేసుకుంటారు. తమ వంచనలను ప్రజలు మరిచిపోయి ఉంటారని ప్రజల ఎదుటకు వచ్చి పాదయాత్ర పేరుతో హడావుడి చేస్తున్న వారికి బుద్ధి రావాలి.
జగన్మోహన్ రెడ్డి ని తిడుతూ బతికితే చాలు నిజా నిజాలు చెక్ చేయాల్సిన అవసరం లేదు అనే వారి వైఖరి మారాలి.