రాజకీయ వ్యూహాలు పన్నడంలో చంద్రబాబు ఆరితేరిపోయారు. ఆయన చాణక్యం ఇంతా అంతా కాదు. ప్రజల్లో తేడా వచ్చింది కాబట్టి జగన్ కాస్త తట్టుకోగలుగుతున్నారు. లేదూ అంటే బాబు వ్యూహాలను, ఆయన మీడియా దన్నును తట్టుకోవడం అంత సులువుకాదు. ఇది వాస్తవం. ఈసారి ఎన్నికలకు బాబు ఓ కొత్త వ్యూహం అందుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర కోస్తా ప్రాంతంలో టికెట్ ల కేటాయింపు విషయంలో ఆయన ఓ ప్రత్యేకమైన పద్దతిని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.
జనసేన పార్టీ పట్ల కాపులు ఇంతో అంతో ఆదరణతో వున్నారు. జనసేన పార్టీ ఎన్నికల అనంతర పరిస్థితులను బట్టి తెలుగుదేశం పార్టీతో కలిసి లేదా, మద్దతుతోనే ముందుకు వెళ్తుందని రాజకీయ వర్గాలు పక్కాగా నమ్ముతున్నాయి. అప్పటి పరిస్థితిని బట్టి ప్రభుత్వంలో చేరడం లేదా, బయట నుంచి మద్దతు ఇవ్వడం అన్నది జరుగుతుందని, ఇదే జనసేన ప్లానింగ్ అని టాక్ వినిపిస్తోంది.
అలాంటపుడు కాపు ఓట్లను చీల్చడం అన్నది చంద్రబాబుకు మంచి వ్యూహం అనిపించుకోదు. పైగా కాపులు ఎలాగూ ఇంతో అంతో బాబు అంటే వ్యతిరేకతతో వున్నారని వినిపిస్తోంది. అందుకే తప్పనిసరైన చోట్ల, సిట్టింగ్ అభ్యర్థులు వున్నచోట్ల తప్పించి, మిగిలిన చోట్ల మాగ్జిమమ్ బిసి మంత్రాన్ని ఈసారి వాడాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో కేసిఆర్ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు వెలమలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని మూడు ప్రత్యేక కులాల విషయంలో ఆయన శ్రద్ద తీసుకుంటున్నారు. బిసి వెలమల విషయంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీది పైచేయిగా వుంది.
ఉత్తరాంధ్ర బిసి వెలమల్లో వైకాపాకు సరైన నాయకుడు లేరు. సుజనరంగారావు వుండేవారు, టీడీపీలోకి వెళ్లిపోయారు. టీడీపీ నిండా వాళ్లే వున్నారు. రామ్మోహన నాయుడు అచ్చెంనాయుడు, బండారు సత్యనారాయణ మూర్తి, అయ్యన్నపాత్రుడు, పార్టీలోకి రాబోయే సబ్బంహరి వీళ్లంతా బిసి వెలమలే.
ఇక ఉత్తరాంధ్రలోని మరో బిసి కమ్యూనిటీ గవర. ఇటీవల గవర కార్పొరేషన్ ను ఏర్పాటు చేసారు. నిన్నటికి నిన్న గవర కమ్యూనిటీకి చెందిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారు. గవర కమ్యూనిటీలో మంచి వ్యక్తిగా పేరున్న కొణతాల రామకృష్ణను చేరదీస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వున్నారు వాళ్లకి టికెట్ లు ఇస్తున్నారు.
ఈ కమ్యూనిటీలో కూడా వైకాపాకు సరైన లీడర్ లేరనే చెప్పాలి. దాడి వీరభద్రరావును తీసుకురావాలని అనుకుంటున్నది అందుకే. నిజానికి తెలుగుదేశం పార్టీ వచ్చిన తరువాత గవరల ప్రాభవం తగ్గింది. వెలమల ప్రాభవం పెరిగింది. కానీ ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ఫస్ట్ టైమ్ రూట్ మార్చారు.
ఇక ఉత్తరాంధ్రలో మూడో బిసి కమ్యూనిటీ కాళింగ. ఈ కమ్యూనిటీ విషయంలో ఎందుకో దశాబ్దాలుగా చంద్రబాము విముఖతతోనే వుంటూవస్తున్నారు. అందుకే వాళ్లకు వైకాపానే ఆల్టర్ నేటివ్ ఫార్టీగా కనిపిస్తోంది. తమ్మినేని సీతారాం, కిల్లి కృపారాణి వైకాపాలో వున్నారు. దేశానికి ఈ కమ్యూనిటీ పట్ల అంత సీరియస్ నెస్ వున్నట్లు కనిపించదు. ఏదో చేసినట్ల చూపిస్తున్నారంతే.
ఇక మిగిలిన నాలుగో కమ్యూనిటీ బిసి కాపు. దీనికి మాత్రం రెండు పార్టీలు సమానంగా లీడర్ షిప్ కలిగి వున్నాయి. అటు కళా వెంకటరావు, ఇటు బొత్స సత్యనారాయణ. సీట్ల కేటాయింపు అలాగే వుంది. ఇక ఈస్ట్ వెస్ట్ లో కూడా కాపులతో సమానంగా బిసిలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
యాదవ, వెలమ, తదితర కమ్యూనిటీలకు ఫ్రాధాన్యత ఇస్తూ ముందుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మాత్రం జగన్ కాస్త ఎక్కువగా కాపులతోనే వున్నట్లు కనిపిస్తోంది. విశాఖ సిటీలాంటి చోట్ల కూడా బిసిలకు ప్రాధాన్యత ఇచ్చేఆలోచన బాబు చేస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ వచ్చిన తరువాతే విశాఖ మీద పట్టు తెచ్చుకుంది. అప్పటి నుంచి అలా నడుస్తూ వస్తోంది.
కానీ ఈసారి కావాలని వీలయినంత వరకు కమ్మ సామాజిక వర్గాన్ని వెనక్కు పెట్టి బిసి లకు ఇవ్వాలని బాబు చూస్తున్నారు. రాజమండ్రిలో సైతం మురళీమోహన్ చేత వ్యూహాత్మకంగా వెనకడుగు వేయించి, అక్కడ వెలమలకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. ఇది అక్కడి వరకు కొత్త స్ట్రాటజీ.
రాయలసీమలో రెడ్లకు రెడ్లకు పోటీపెట్టి, జనసేనకు కాపు ఓట్లు వెళ్లేలా చేయడం, ఆంధ్రలో బిసిలకు ప్రాధాన్యత ఇచ్చి, కాపు ఓట్లు జనసేనకు వెళ్లేలా చేయడం అన్నది బాబు వ్యూహంగా కనిపిస్తోంది. అయితే దేశం గెలవాలి. లేదూ అంటే జనసేన గెలిచినా ఫరవాలేదు. వైకాపా మాత్రం రాకూడదు అన్న స్ట్రాటజీ ఈ వ్యూహం వెనుక వున్నట్లు కనిపిస్తోంది.
అయితే ఏ వ్యూహం అయినా ప్రజల్లో బలమైన వ్యతిరేకత లేదా అనుకూలత రానంతవరకే. ఆ వేవ్ అనేది వస్తే, ఏ వ్యూహాలు పనిచేయవు. గడ్డి పోచను నిల్చోపెట్టినా గెలుస్తుంది. మొన్నటికి మొన్న తెలంగాణలో జరిగింది అదే.
-ఆర్వీ