'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా గురించి తెలుగుదేశం పార్టీ ఆందోళన చెందుతోంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకింత ఆసక్తి ప్రదర్శిస్తోంది. రామ్‌గోపాల్ వర్మ అభిమానుల సంగతి సరే సరి. అయితే, ఇది స్వర్గీయ నందమూరి తారకరామారావు అభిమానుల్లో మాత్రం కొత్త ఉత్సాహం నింపుతోంది. దాదాపు అన్ని రాజకీయ పార్టీల్లోనూ స్వర్గీయ ఎన్టీఆర్ అభిమానులున్నారు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు, స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి లాక్కున్న తర్వాత కొందరు చంద్రబాబుని వ్యతిరేకిస్తే, కొందరు చంద్రబాబుతో సర్దుకుపోయారు.
చరిత్రను వక్రీకరించేందుకు చంద్రబాబు ఎంత ప్రయత్నించినా, ఆనాటి ఆ 'పాపం' చంద్రబాబుని ఇంకా వెంటాడుతూనే వుంది. ఇప్పుడు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రూపంలో చంద్రబాబుని మరోమారు 'చరిత్ర' వెంటాడుతోందన్నది నిర్వివాదాంశం. తాజాగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నుంచి ఓ పాట బయటకు వచ్చింది. ఇందులో, స్వర్గీయ ఎన్టీఆర్ 'ఆవేదన'ని చూపించాడు రామ్‌గోపాల్ వర్మ. ప్రధానంగా కుటుంబ సభ్యులు పొడిచిన వెన్నుపోటు 'బాధ' గురించి తలచుకుని మానసికంగా ఎన్టీఆర్ విలవిల్లాడిన వైనం కన్పించింది.
కుటుంబ సభ్యుల వేధింపులు, పార్టీలో అప్పటిదాకా తనవెంట వున్నవారి నుంచి వచ్చిన వ్యతిరకేకత.. ఇవన్నీ తలచుకుని మౌనంగా స్వర్గీయ ఎన్టీఆర్ రోదించిన మాట వాస్తవం. మీడియా ముందుకొచ్చి తనకు జరిగిన అన్యాయంపై స్వర్గీయ ఎన్టీఆర్ ఎంతలా మొరపెట్టుకున్నా, ఆయనది అరణ్య రోదనే అయ్యింది అప్పట్లో. ఇప్పుడు పరిస్థితులు మారాయి. చంద్రబాబు అనుకూల మీడియా 'చరిత్ర'ని తొక్కేయాలని చూస్తున్నా, సోషల్ మీడియా మాత్రం ఊరుకోవడంలేదు.
'స్వర్గీయ ఎన్టీఆర్ అభిమానులకిది అవసరం..' అంటూ 'అవసరం' పాట గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. సినిమాలో ఏముంటుంది.? సినిమా విజయాన్ని అందుకుంటుందా.? లేదా.? అనేది వేరే విషయం. ఎన్నికల ముందర చంద్రబాబు నిజస్వరూపం మాత్రం ఓటర్ల ముందుకు రాబోతోంది. తనవెంట తిరిగి, అవసరం తీరాక ఏడిపించి, తాను మరణించాక 'దండ'వేసి, దండమెట్టిన చంద్రబాబు అవకాశవాదం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లోని 'అవసరం' పాట తెరపైకి తెచ్చింది.