పుణ్యకాలం పూర్త‌వుతోంది..వైసీపీ ఎమ్మెల్యేల నిర్వేదం!

2020లో క‌రోనాతో కొన్ని నెల‌ల పాటు అనేక ర‌కాల కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డానికి అవ‌కాశం లేక‌పోయింది, ఇక 2021లో ప‌రిస్థితులు అంత‌క‌న్నా విష‌మించాయి.. దీంతో త‌మ అవ‌కాశం వ్య‌ర్థం అయిపోతోంద‌నే భావ‌న వ్య‌క్తం అవుతోంది వైఎస్ఆర్…

2020లో క‌రోనాతో కొన్ని నెల‌ల పాటు అనేక ర‌కాల కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డానికి అవ‌కాశం లేక‌పోయింది, ఇక 2021లో ప‌రిస్థితులు అంత‌క‌న్నా విష‌మించాయి.. దీంతో త‌మ అవ‌కాశం వ్య‌ర్థం అయిపోతోంద‌నే భావ‌న వ్య‌క్తం అవుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల నుంచి. క‌రోనాతో నెల‌ల స‌మ‌యం వేస్ట‌వుతోంద‌ని.. ఎమ్మెల్యేలుగా త‌మ ప‌ని తీరుకు ఇది పెద్ద అడ్డంకి అని వారు అంటున్నారు. 

అధికార పార్టీ నేత‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి ఈ నిర్వేదం వ్య‌క్తం అవుతోంది. అన్నీ ఉన్నా.. జ‌నం మ‌ధ్య‌కు బాగా వెళ్లే అవ‌కాశం కానీ, ఏదైనా ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేయ‌డానికి కానీ అవ‌స‌రం లేకుండా పోతోంద‌నేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల నుంచి వినిపిస్తున్న మాట‌.

గ‌త ఏడాదినే ప‌రిశీలిస్తే.. మార్చిలో లాక్ డౌన్ మొద‌లైంది. జూన్ వ‌ర‌కూ కొన‌సాగింది. జూన్ నుంచి కేసుల సంఖ్య ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరిగింది. దాదాపు సెప్టెంబ‌ర్, అక్టోబ‌ర్ నెల‌ల వ‌ర‌కూ చాలా ప‌రిమితుల మ‌ధ్య‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల్సి వ‌చ్చింది. నవంబ‌ర్, డిసెంబ‌ర్, ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి త‌మ రాజ‌కీయ కార్య‌క‌లాపాలు మ‌ళ్లీ ఊపందుకోగా.. అంత‌లోనే మ‌రో వేవ్ చుట్టుమ‌ట్టేసింది. 

ఇలా మ‌రో రెండు నెల‌లు గ‌డిచిపోయాయి. ఇంకా నెల రోజుల పాటు ప‌రిమితులు ఉండ‌వ‌చ్చు. ఆ త‌ర్వాత కూడా పూర్వ‌పు రోజులు వ‌చ్చేసిన‌ట్టుగా కాదు. ప‌రిమితులు ఉండ‌నే ఉంటాయి, మూడో వేవ్ అంటున్నారు. అది మ‌రింత భ‌య‌పెడుతోంది. ఇలాంటి ప‌రిస్థితిని దృష్టిలో ఉంచుకుని నేత‌లు ప‌ని చేయాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో.. క‌రోనా వ‌ల్ల ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న‌ట్టుగా మారింది అధికార పార్టీ నేత‌ల ప‌రిస్థితి.

ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ప‌ల్లెల‌కు వెళ్లినా, ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లినా పెద్ద‌గా ప‌ట్టించుకోరు! అధికారం ఉన్న‌ప్పుడే అస‌లు సిస‌లు గ్లామ‌ర్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఊపు ఉంది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌డుతున్న సంక్షేమ కార్య‌క్ర‌మాలు భారీగా సాగుతూ ఉండ‌టంతో.. ఎమ్మెల్యేలుగా, అధికార పార్టీ నేత‌లుగా ధాటిగా జ‌నం మ‌ధ్య‌న తిరిగే అవ‌కాశాన్ని క‌లిగి ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు. 

ఇలా అన్నీ సానుకూలంగానే ఉన్నా.. అధికారంలో ఉన్న కాలంలో ఇలా ఇళ్ల‌కు ప‌రిమితం కావ‌డం, ప‌రిమితుల మ‌ధ్య‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల్సి రావ‌డం ప‌ట్ల వారిలో నిర్వేదం వ్య‌క్తం అవుతూ ఉంది. అలాగే మంత్రుల హోదాలో ఉన్న వారి ప‌రిస్థితే ఇదే. ఎలాగూ రెండున్న‌రేళ్ల‌కు ప‌ద‌వీకాలాలు ముగుస్తాయ‌ని మంత్రుల‌కు జ‌గ‌న్ ముందే చెప్పారు. ఈ వ్య‌వ‌ధిలో చాలా నెల‌ల పాటు క‌రోనా ప‌రిస్థితులు ఉండ‌టంతో.. వారు మ‌రింత‌గా ఫీల‌వుతున్న‌ట్టుగా ఉన్నారు.