కరోనా తీవ్రరూపం దాల్చడంతో దాదాపు రెండు నెలలుగా స్తంభించిన రాజకీయ కార్యకలాపాలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో రాజకీయ నేతలు ఎక్కడివారక్కడ ఉండి పోయారు. చాలా మంది నేతలు ఇల్లు దాటేందుకు కూడా ఇష్టపడలేదు. కొందరు అనుచర వర్గాన్ని కూడా ఇంటి ఛాయలకు రానివ్వలేదు.
ఇలా పొలిటికల్ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి. ఏప్రిల్, మే నెలల్లో ఇలా నేతలకూ, అనుచవర్గానికి కూడా అనుసంధానం లేకపోయింది. అయితే ఇప్పుడిప్పుడు కరోనా కేసుల నంబర్లు కాస్త తగ్గుముఖం పట్టుతూ ఉండటంతో.. మళ్లీ నేతల హడావుడి కనిపిస్తూ ఉంది. రకరకాల కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు కనిపిస్తూ ఉన్నారు. ఇలా మళ్లీ రాజకీయ హడావుడి కనిపిస్తూ ఉంది.
ప్రత్యేకించి ఇప్పుడు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాల్లో అధికార పార్టీనేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కనిపిస్తూ ఉన్నారు. పేదలకు ఇళ్లను పంచే కార్యక్రమంలో భాగంగా.. ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున నిర్మాణాలను చేపడుతూ ఉంది. అందుకు సంబంధించి భూమి పూజలకూ, సర్వమత ప్రార్థనలకూ నేతలు హజరవుతూ ఉన్నారు.
భారీ ఎత్తున కాలనీలనే నిర్మిస్తూ ఉంది జగన్ ప్రభుత్వం. గత ఏడాది పట్టాల పంపకం జరిగింది, ఇక ఇప్పుడు అనేక చోట్ల కాలనీల నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది భారీ కార్యక్రమం కావడం, లబ్ధిదారుల సంఖ్య కూడా భారీ ఎత్తున ఉండటంతో.. రాజకీయ నేతలు ఈ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. నిర్మాణాల ప్రారంభం, భూమి పూజ కార్యక్రమాలతో మొదలుపెడితే.. లే ఔట్లకు విద్యుత్ సరఫరాకు సంబంధించిన ప్రారంభ కార్యక్రమాల్లో అధికార పార్టీ నేతలు కనిపిస్తూ ఉన్నారు.
మామూలుగా అయితే భారీ సభలుగా ఇలాంటి కార్యక్రమాలు జరిగేవి. లబ్ధిదారుల సమక్షంలో ఇవి ప్రారంభం అయ్యేవి. అయితే.. కరోనా ఆంక్షల నేపథ్యంలో పరిమిత సంఖ్యతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే తమకు బాగా ప్రచారం వచ్చే కార్యక్రమాలు కావడంతో.. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎలాగోలా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఇలా అధికార పార్టీ నేతలు కరోనా తర్వాత ఇలా వార్తల్లోకి ఎక్కుతుండగా, ప్రతిపక్ష పార్టీ నేతలు మాత్రం అడ్రస్ లో లేరు. అధికారం కోల్పోయిన దగ్గర నుంచినే చాలా మంది తెలుగుదేశం నేతలు మొహం చాటేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ అలాంటి వారు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాలు కూడా పెద్దగా చేయడం లేదు.
ఆ పై కరోనా పరిస్థితులు కూడా రావడంతో తెలుగుదేశం నేతలు పూర్తిగా ఇళ్లకే పరిమితం అయినట్టుగా ఉన్నారు. అధికార పార్టీ నేతలు సాహసం చేసైనా జనాల మధ్యకు వస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ మాత్రం ప్రజా సమస్యలను కానీ, మరో అంశాన్ని కూడా ప్రస్తావించే పరిస్థితుల్లో లేదు. స్వయంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జూమ్ కు పరిమితం కావడంతో.. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు కూడా ప్రజల ముందుకు రావడం తమ పని కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.