చట్టం వేరు..న్యాయం వేరు..ధర్మం వేరు..అని పెద్దలు అంటుంటారు. వాటి మధ్య సూక్ష్మమైన తేడాలు వున్నాయనీ అంటారు. మన చట్టం. మన రాజ్యాంగానికి లోబడి వుంటుంది. న్యాయం ఏమిటి అన్నది కోర్టులో తేల్చేదానికి జనాలు అనుకునేదానికి తేడా వుండొచ్చు. వుండకపోవచ్చు. అలాగే అసలు ధర్మం ఏమిటన్నది వేరుగా వుండొచ్చు.
మీడియా సంస్థలపై రాజద్రోహం లాంటి సెక్షన్లు బనాయించడం చట్టరీత్యా చెల్లకపోవచ్చు. కానీ చట్టాన్ని, దాని లొసుగుల్ని అడ్డం పెట్టుకుని కొన్ని మీడియా సంస్థలు ఆడుతున్న నాటకాలు ఏమిటన్నది జనాలకు తెలుసు. కోర్టులు లేదా న్యాయమూర్తులకు కూడా తెలిసే వుండొచ్చేమో. కానీ అక్కడ తీర్పులు రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి వుంటాయి.
ఒకడి మీద పని గట్టుకుని వార్త రాయచ్చు. వార్త రాయడం మీడియా డ్యూటీ తప్పు లేదంటుంది చట్టం. దానికి అనుగుణంగా తీర్పు. కానీ అదే మీడియా ఎందుకు ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తోందో జనాలకు తెలుసు. ఇది న్యాయం కాదు అని వారు అనుకోవచ్చు. ఇలా చేయడం తప్పు, ధర్మం కాదు అని కూడా అనుకోవచ్చు. అలా అనిపించినపుడు, అనుకున్నన్నాళ్లు రఘురామరాజు భాషలో చెప్పాలంటే…'ఏమీ పీకలేకపోవచ్చు'
తమ సంస్థ మీద బనాయించిన రాజద్రోహం కేసుల విషయంలో ఎబిఎన్ ఆంధ్రజ్యోతికి సుప్రీం కోర్టులో ఊరట లభించించింది. సహజంగా ఎవరైనా 'హమ్మయ్య.. ఊరట లభించింది' అనుకుంటారు. కానీ ఎబిఎన్ ఆర్కే అలా అక్కడితో సంతృప్తి చెందాలనుకోవడం లేదు. కేసు ముందూ ఎలాగైనా జగన్ ను ఇరుకున పెట్టాల్సిందే అన్న ఎజెండాతో ముందుకు వెళ్తున్నట్లు కనిపించారు. కానీ సుప్రీం కోర్టులో ఊరట లభించాక, ఎలాగైనా జగన్ ను గద్దె దించాల్సిందే, దెబ్బకు దెబ్బ తీయాల్సిందే అన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
రఘురామరాజు వేసిన జగన్ బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ కేసులో న్యాయవాదులు ఏ విధంగా వాదించబోతున్నారో అన్నది కూడా ఆర్కే ముందుగానే చెప్పేస్తున్నారు.
సిబిఐ కేసులో తనతో సహనిందితులుగా వున్నవారికి ఎలా పెద్ద పీట వేసారో, అలాగే తన కేసుల్లో ఆదాయపన్ను శాఖ తరపున విచారణ జరిపిన జాస్తి కిషోర్ ను ఎలా ఇబ్బంది పెట్టారో వివరించి, ఇదంతా బెయిల్ నిబంధనల ఉల్లంఘనగా కోర్టు ముందు న్యాయవాదులు ఉంచుతారని ఆర్కే తన కాలమ్ లో చెప్పుకోచ్చారు. అంతే కాదు. జగన్ జైలుకు వెళ్లిపోతే భార్య భారతిని కాకుండా సోదరి షర్మిలను సీన్ లోకి తీసుకువచ్చి సిఎమ్ ను చేయడానికి భాజపా పెద్దలు అప్పుడే డిసైడ్ అయిపోయినట్లు కథలు అల్లేసారు.
అసలు ఆర్కేకు అర్ధం కావాల్సింది ఏమిటంటే, ఎవరైనా జగన్ ను అభిమానిస్తున్నారో, ఎవరైతే జగన్ వెంట వుండాలనుకుంటున్నారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీని ద్వేషిస్తున్నారో వాళ్లంతా ఆంధ్రజ్యోతి వార్తలను పెద్దగా సీరియస్ గా తీసుకోవడం ఏనాడో మానేసారు. అంతే కాదు, తెలుగునాట ఏ మీడియా ఎందుకు వార్తలు వండి వారుస్తుందో అన్నది జనాలకు ఫుల్ క్లారిటీ వుంది. అందువల్ల ఈ వార్తలు అన్నీ వారికేమీ టెన్షన్ పెట్టవు.
అదీ కాక రాజకీయాల్లోకి వచ్చిన తరువాత సోనియాను ఢీకొన్నపుడే జగన్ కు తెలుసు కదా..తను ఏయే ఆటు పోట్లు ఎదుర్కొంటునబోతున్నాడో. అధికారం చేతిలో లేనపుడే కొండను ఢీకొని, జైలులో నెలల తరబడి గడిపిన వాడు జగన్. అలాంటిది అధికారం చేతిలో వుంది.
జనాలు ఎంతో కొంత శాతం మంది తన వెనుక వున్నారు. పైగా గతంలో తెలుగుదేశం తెరవెనుక నుంచి సూత్రాలు లాగి, శంకరరావుతో కేసు వేయించి ఎలా జగన్ ను కార్నర్ చేసిందో అప్పటికి పెద్దగా జనాలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు రఘురామరాజు వెనుక ఎవరు వున్నారో, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారో జనాలకు ఇప్పుడు క్లారిటీగా తెలుసు.
జగన్ ను చట్టపరమైన మార్గాలు వాడి దొంగదెబ్బ తీయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ దాని వల్ల జనాల్లో జగన్ కు పెరిగే సింపతీ ఇంతా అంతా అని వుండదు. ఇందిరను జనతా ప్రభుత్వం, జయలలితను కరుణానిధి ప్రభుత్వం, మొన్నటికి మొన్న మమతను ఒక్కదాన్ని చేసి భాజపా కార్నర్ చేయడం, ఇలాంటి సందర్భాల్లో జనం ఎలా రియాక్ట్ అయ్యారు అన్నది ఓ సారి చూసుకోవాలి.
ఇదిలా వుంటే పనిలో పనిగా ఆర్కే బెదిరింపులు, హెచ్చరికలకు కూడా దిగారు. తాను తప్పుడు కేసుల విషయంలో చట్టం కల్పించిన వెసులు బాటులను వాడుకుని, బాద్యులను కోర్టుకు లాగుతానని హెచ్చరిస్తున్నారు. చూస్తుంటే మొత్తం మీద ఆర్కే తన ఫైట్ ను ఇప్పుడు ఓపెన్ చేసినట్లు కనిపిస్తోంది. అదే బెటర్ కూడా. జనాలకు ఆయన రాసే లేదా అందించే వార్తల మీద జనాలకు మరింత క్లారిటీ వచ్చేస్తుంది.
పాలకు పాలు నీళ్లకు నీళ్లు క్లారిటీగా కనిపిస్తే జనం ఏం తీసుకోవాలో ఏవి పక్కన పెట్టాలో అన్నది డిసైడ్ చేసుకుంటారు.