ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత క్యారెక్టర్ ఆర్టిస్ట్ భూమిక క్లారిటీ ఇచ్చింది. హిందీ బిగ్ బాస్ సీజన్-15లో తను ఉన్నానంటూ కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టింది. తనకు ఎలాంటి ఆఫర్ రాలేదని, వచ్చినా తిరస్కరిస్తానని స్పష్టంగా తెలిపింది.
“ఫేక్ న్యూస్ – నాకు బిగ్ బాస్ ఆఫర్ రాలేదు. ఒకవేళ వాళ్లు ఆఫర్ చేసినా నేను చేయబోను. నాకు గతంలోనే సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత కూడా కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ ప్రతిసారి నేను తిరస్కరిస్తూ వచ్చాను. ఈసారి మాత్రం నాకు ఆఫర్ రాలేదు. అయినా కూడా నేను చేయను. నేను పబ్లిక్ పర్సనాలిటీ కావొచ్చు కానీ నేను చాలా ప్రైవేట్ పర్సన్. 24 గంటలూ నాపై కెమెరాలు ఉండడం నాకు ఇష్టం ఉండదు.”
బిగ్ బాస్ వ్యవహారం అందరికీ తెలిసిందే. 24 గంటలూ కెమెరా కనుసన్నల్లో ఉండాల్సి వస్తుంది. దీనికితోడు హిందీ బిగ్ బాస్ వ్యవహారం మరింత శృతిమించింది. సౌత్ సీజన్లతో పోలిస్తే హిందీ బిగ్ బాస్ సీజన్లు మరింత ఘాటుగా, రోతగా తయారయ్యాయి. ఈ మొత్తం ప్రహసనానికి దూరంగా ఉండడమే బెటరని నిర్ణయించుకుంది భూమిక.
బిగ్ బాస్ సీజన్-1 నుంచి పలు దఫాలుగా తనను సంప్రదిస్తున్నప్పటికీ.. తన ప్రైవేట్ లైఫ్ కు భంగం కలుగుతుందనే ఉద్దేశంతో ప్రతిసారి తిరస్కరిస్తున్నట్టు భూమిక స్పష్టంచేసింది. ప్రస్తుతం ఈ నటి తెలుగులో బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతోంది.