టీడీపీ ముఖ్యనేతలపై జగన్ సర్కార్ అదును చూసి కేసులు పెడుతోంది. ఇప్పుడు టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వంతు వచ్చింది. నిన్న ప్రెస్మీట్లో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన ఆరోపణలే ఆయనపై కేసు నమోదుకు కారణాలయ్యాయి. కృష్ణపట్నం పోర్ట్ పోలీస్‌స్టేషన్‌లో శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదారెడ్డి ఫిర్యాదు మేరకు సోమిరెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం కేసులు నమోదయ్యాయి.
నెల్లూరు టీడీపీ కార్యాలయంలో సోమిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ నగరానికి చెందిన శేశ్రిత కంపెనీ ఆనందయ్య మందు విక్రయానికి చిల్‌డీల్.ఇన్ అనే వెబ్‌సైట్‌ను గోడాడీ కంపెనీ నుంచి మే 21న కొనుగోలు చేసిందన్నారు. ఆ కంపెనీ నిర్వాహకులు తన ప్రత్యర్థి, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి, వైసీపీకి అత్యంత సన్నిహితులని చెప్పారు.
జూన్ 2న 11గంటల తర్వాత ఫ్యాన్ గుర్తు, సీఎం జగన్ ఫొటోలు, వైసీపీ రంగులతో చిల్‌డీల్.ఇన్ వెబ్సైట్ హోంపేజీ ఆన్లైన్లో కనిపించిందంటూ సోమిరెడ్డి ఆ ఫొటోలు చూపించారు.
అందులో ఆనందయ్య మందు ఒక్కో ప్యాకెట్ రూ.15గా ఉందని, కానీ బుక్ చేసుకునే సమయానికి అన్ని చార్జీలతో కలిపి రూ.167 అని చూపించారని ఆరోపించారు. ఒక్కో ప్యాకెట్‌పై రూ.120 వరకు మిగుల్చుకునే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఆనందయ్య మందు పేరుతో రూ.వందల కోట్ల వ్యాపారానికి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుట్ర పన్నారని ఘాటు ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో తమ సంస్థపై సోమిరెడ్డి అసత్య ప్రచారం చేశారని శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదారెడ్డి కృష్ణపట్నం పోర్ట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద సోమిరెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం కేసులు నమోదు చేసినట్టు కృష్ణపట్నం పోర్ట్ పోలీసులు తెలిపారు.
శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ ప్రాజెక్ట్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన సోమిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. సోమిరెడ్డి తమ డేటా చోరీ చేశారన్నారు. కాకాణికి, తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని నర్మదారెడ్డి స్పష్టం చేశారు.