రాజధానికి మట్టీ నీళ్లూ.. పథకాలకు బ్యాటరీ మాత్రమేనా!

భారతీయ జనతా పార్టీకి చెందిన నవతరం మేధావి.. ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏ ఉద్దేశంతో అన్నారో గానీ చాలా సబబైన మాట అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన పరోక్షంగా…

భారతీయ జనతా పార్టీకి చెందిన నవతరం మేధావి.. ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏ ఉద్దేశంతో అన్నారో గానీ చాలా సబబైన మాట అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన పరోక్షంగా కీర్తించారు. 

జగన్మోహన్ రెడ్డి..  బటన్ నొక్కి ప్రజల ఖాతాలకు వేలకు వేల కోట్లు జమ చేస్తున్న వైనాన్ని కూడా ఆయన ఇండైరక్టుగా అభినందించారు. ఇవన్నీ ఆయన పనిగట్టుకుని చేసి ఉండకపోవచ్చు గానీ.. ఆయన మాటలు మాత్రం.. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు ఘనమైన అభినందన వాక్యాలే.

అయితే ఈ సందర్భంగా.. ఆయన తమ మోడీ భజన చేయడానికి అన్నదెల్లా ఒక్కటే మాట. ‘‘ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నొక్కే బటన్ కు బ్యాటరీ ఇస్తున్నది మోడీనే, కేంద్రప్రభుత్వమే’’ అని! ఎంత కామెడీ ఇది! కేవలం బ్యాటరీ ఇచ్చినందుకు పథకం మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని జీవీఎల్ భావిస్తున్నట్టుగా ఉంది. 

అయినా మోడీ పేరు తలచుకుంటే.. ఆయనగా ఉదారంగా నిధులు ఇస్తారు అనే మాట చెప్పడానికి, జీవీఎల్ కు కూడా మనసు రాలేదన్నట్టుగా ఉంది. అందుకే బ్యాటరీ ఇస్తున్నాం అని అక్కడితో సరిపెట్టుకున్నారని జనం నవ్వుకుంటున్నారు. 

ప్రధాని నరేంద్రమోడీ.. ఏపీ రాష్ట్రం కోసం ఏం చేశారనేది ప్రజలందరికీ తెలుసు. పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తానని తెలుగు ప్రజల దీవెనలు కోరిన మోడీ, అధికారంలోకి వచ్చాక ఏం చేశారో కూడా అందరికీ తెలుసు. అమరావతిలో రాజధాని నిర్మాణం పేరిట చంద్రబాబునాయుడే.. అతి పెద్ద డ్రామాను నడిపిస్తే.. ఆ డ్రామాలో.. గెస్ట్ అప్పియరెన్స్ రోల్ ను మోడీ చాలా హాస్యస్ఫోరకంగా పోషించారు. 

అమరావతి శంకుస్థాపన నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానిస్తే.. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన మద్దతు అందిస్తుందో కనీసం ఒక్కమాటకూడా చెప్పకపోగా.. గుప్పెడు మట్టి, చెంబెడు నీళ్లు రాష్ట్ర ప్రజల మొహాన కొట్టిన మోడీ.. వారందరి అపరిమిత ఆగ్రహానికి గురయ్యారు. 

ఒక రాజధాని కట్టడానికి మట్టి, నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకునే తమ పార్టీ ప్రధాని మోడీ గురించి.. ప్రజల ఎక్కువ అవగాహన జీవీఎల్ కే ఉన్నదని.. అందుకే ఆయన సంక్షేమ పథకాలకు మోడీ బ్యాటరీ అందజేస్తున్నట్లుగా కామెడీ చేస్తున్నారని జనం నవ్వుకుంటున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం మొత్తం తమ కేంద్రప్రభుత్వపు దయాదాక్షిణ్యాల మీద మాత్రమే మనుగడ సాగిస్తున్నదని చాటుకోవడం.. కమలదళం వారి అత్యాశ. అయితే హక్కుగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వడం మినహా, నయాపైసా అదనంగా ఇవ్వకుండానే.. అలాంటి కీర్తిని వారు కోరుకోవడం దురాశ. 

జీవీఎల్ కు అంతగా దమ్ముంటే.. జగన్ బటన్ నొక్కిన ప్రతి పథకాన్నీ పేపర్ మీద ఒక జాబితా రాసుకుని.. ఏ పథకం కింద ఏయే తేదీల్లో జగన్ ఎంత సొమ్ము ప్రజలకు జమ చేశాడో, ఆయా పథకాలకు సంబంధించి.. కేంద్రం ఇచ్చిన సొమ్ముల వాటా ఎంతనో విపులంగా చెప్పాలి. 

జగన్ ప్రభుత్వపు సంక్షేమాన్ని తామే నడుపుతున్నామని చెప్పాలి. అంతే తప్ప.. బటన్ నొక్కడానికి బ్యాటరీ ఇచ్చాం. బ్యాటరీ నడవడానికి వైర్లను వెల్డింగ్ చేశాం లాంటి కామెడీ మాటలు కట్టిపెట్టాలి.