వైసీపీలో మోదం, టీడీపీలో ఖేదం

వైఎస్సార్‌సీపీ ప్లీన‌రీ అధికార పార్టీలో మోదం, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంలో ఖేదాన్ని నింపింది. నిజానికి ప్లీన‌రీ ఈ స్థాయిలో దిగ్విజ‌యం అవుతుంద‌ని వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఊహించ‌లేదు. అనూహ్యంగా ప్లీన‌రీకి జ‌నం వెల్లువెత్త‌డంతో అధికార పార్టీలో…

వైఎస్సార్‌సీపీ ప్లీన‌రీ అధికార పార్టీలో మోదం, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంలో ఖేదాన్ని నింపింది. నిజానికి ప్లీన‌రీ ఈ స్థాయిలో దిగ్విజ‌యం అవుతుంద‌ని వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఊహించ‌లేదు. అనూహ్యంగా ప్లీన‌రీకి జ‌నం వెల్లువెత్త‌డంతో అధికార పార్టీలో ఆనందానికి అవ‌ధుల్లేవు. ప్లీన‌రీకి ముందు స‌న్నాహ‌క స‌మావేశాల్లో జ‌నం లేర‌ని, వెల‌వెల‌బోయాయ‌ని ఎల్లో మీడియాలో పెద్ద ఎత్తున వార్త‌లొచ్చాయి.

మ‌రోవైపు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం పేరుతో వెళుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేల‌ను జ‌నం నిల‌దీస్తున్నార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగింది. ఇలాంటి నెగెటివ్ ప్ర‌చారాలు వైఎస్సార్‌సీపీ ప్లీన‌రీకి వెల్లువెత్తిన సునామీలో కొట్టుకుపోయాయి. మ‌రో సారి త‌మ‌దే అధికార‌మ‌నే ధీమాను ఈ ప్లీన‌రీ విజ‌యం నింపింది.

2024లో అధికారంపై ప్లీన‌రీకి ముందు, త‌ర్వాత అని చ‌ర్చించుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త వుంద‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో మ‌ళ్లీ వైసీపీ అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మ‌నే అభిప్రాయాలున్నాయి. అయితే ప్లీన‌రీ త‌ర్వాత ఆ అభిప్రాయాలు పూర్తిగా మ‌రుగున ప‌డ్డాయి. వైఎస్ జ‌గ‌న్ చెప్పిన‌ట్టు 175కు 175 స్థానాలు సాధిస్తామ‌న‌డంలో అతిశ‌యోక్తి లేద‌ని, ప్లీన‌రీకి వెల్లువెత్తిన జ‌న‌సునామీ చెబుతోంద‌ని అధికార పార్టీ నేత‌లు ఆత్మ‌విశ్వాసంతో అంటున్నారు.

వైఎస్ జ‌గ‌న్ వివిధ స‌ర్వే నివేదిక‌ల ఆధారంగా తిరిగి క్లీన్ స్వీప్ చేస్తామ‌ని చెప్పార‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో వైసీపీపై వ్య‌తిరేక‌త ఉంద‌ని, మిగిలిన వ‌ర్గాల్లో ఎంతో సానుకూల‌త ఉంద‌ని ఆ పార్టీ నాయ‌కులు న‌మ్ముతున్నారు. ముఖ్యంగా సామాన్య ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్‌పై అభిమానం లేక‌పోతే… ప్లీన‌రీకి జ‌నం పోటెత్తేవాళ్లు కాద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

జ‌గ‌న్ చెబుతున్న‌ట్టుగా భారీ విజ‌యం కాక‌పోయినా, కనీసం 100 సీట్ల‌కు త‌క్కువ కాకుండా వైసీపీ 2024లో అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకుంటుంద‌నే అభిప్రాయాలు గ‌త మూడురోజులుగా వెల్లువెత్తుతున్నాయి. మ‌రోవైపు వైసీపీ ప్లీన‌రీ ఘ‌న విజ‌యం సాధించ‌డం టీడీపీలో తీవ్ర నిరాశ నింపింది. 

మ‌హానాడు విజ‌యంతో ఇక అధికారం త‌మ‌దే అనే ఆశ‌తో ఆకాశంలో విహ‌రిస్తున్న టీడీపీకి తాజా ప‌రిణామాలు గ‌ట్టి షాక్ ఇచ్చాయి. జ‌గ‌న్‌పై ఇంకా మోజు త‌గ్గ‌లేద‌ని టీడీపీ ఇప్పుడిప్పుడే గ్ర‌హిస్తోంది. అన్నిటికి మించి ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త త‌మ‌కు అనుకూలంగా మారలేద‌నే చేదు నిజాన్ని టీడీపీ జీర్ణించుకోలేక‌పోతోంది. 

వైసీపీ ప్లీన‌రీ మాత్రం టీడీపీలో అనంత‌మైన ఖేదాన్ని మిగిల్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. టీడీపీ ఆశ‌ల్ని వైసీపీ ప్లీన‌రీ చిదిమేసింది.