బలిజలు దేబరించడం చూస్తుంటే జాలేస్తోంది. వీళ్లకు ఏంటీ ఖర్మ? అని ఎవరికైనా అనిపించకుండా వుండదు. ఇతర కులాలపై ఏడ్వడం లేదా వారిని అడుక్కోడం మానేసి తామే ఎందుకు స్వతంత్రంగా ఎదగాలని అనుకోవడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు పదేపదే “మా కాపులు” అంటూ మాట్లాడుతున్న జనసేనాని పవన్‌కల్యాణ్‌పై ఆయన సామాజిక వర్గానికి నమ్మకం లేదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
తిరుపతిలో గ్రేటర్ రాయలసీమ బలిజ నాయకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీరిలో వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు సుగుణమ్మ, ఏఎస్ మనోహర్, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు, జనసేన నాయకుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తదితరులున్నారు. వీళ్లుంతా ఏమంటారంటే…
వచ్చే ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికనే అన్ని రాజకీయ పార్టీలు సీట్ల కేటాయింపులు జరపాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ రాయలసీమ జిల్లాల్లో 74 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం ఇద్దరు బలిజలు మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తున్నారన్నారు. జనాభారీత్యా అతి తక్కువ శాతం వున్న రెడ్లు, కమ్మ కులస్తులు అత్యధిక శాతం చట్టసభల్లో ఉంటున్నారన్నారు. శాసించే నిర్ణయం, సత్తా కలిగిన బలిజలకు భిక్ష పెట్టడం ఏంటని వారు ప్రశ్నించారు. పదవులు, అధికారం ఆ రెండు కులాలకేనా?అని వేదన వ్యక్తం చేశారు.
ఏడు దశాబ్దాలకు పైబడి స్వతంత్ర భారతంలో బలిజలు ఓటర్లుగానే మిగిలిపోవాలా? రెడ్లు, కమ్మవారికి ఎల్లకాలం పల్లకీలు మోయాల్సిందేనా? అని సమావేశంలో ప్రశ్నించారు. ఈ సమావేశంలో బలిజల ఆవేదన సబబే. అయితే ఆంధ్రప్రదేశ్‌లో అత్యథిక జనాభా కలిగిన బలిజలు, కాపులు, ఒంటరి, తెలగకు చెందిన వారు దాదాపు 25 శాతం మంది ఉన్నారు.
ప్రస్తుతం ఆ సామాజిక వర్గానికి జనసేన ప్రాతినిథ్యం వహిస్తోంది. జనసేనను తమ పార్టీగా వారు భావిస్తున్నారు. మరి ఎందుకని ఇతర పార్టీలను వీరు టికెట్లు కేటాయించాలని ప్రాథేయపడుతున్నారో అర్థం. తమకంటూ ఒక పార్టీ ఉండగా,దాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరూ ఎందుకు ఏకం కాలేక పోతున్నారు?
ఇదిలా ఉండగా జనసేనాని పవన్‌కల్యాణ్‌ను ఆయన సామాజిక వర్గీయులు నమ్మలేదా? లేక తన సామాజిక వర్గంపై పవన్‌కు నమ్మకం లేదా? తిరుపతిలో బలిజల ఆత్మీయ సమావేశం నేపథ్యంలో ఉదయిస్తున్న ప్రశ్న ఇది. శాసించే స్థాయిలో ఓటు బ్యాంకు కలిగిన బలిజలకు సరైన నాయకత్వం లేదనే ఆవేదన వెంటాడుతోంది.
తక్కువ జనాభా కలిగిన రెడ్లు, కమ్మ సామాజిక వర్గ నేతలకు అధికారం దక్కడం వెనుక రహస్యం ఏంటో పవన్ సామాజికవర్గం గుర్తించాలి. ఇప్పటికైనా పవన్ తన సామాజిక వర్గం ఆకాంక్షలకు తగ్గట్టు సరైన రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి వుంది.