‘ఇంగ్లీషు’ పీఠం ఎక్కడానికి ‘ఇండియన్లు’ సిధ్ధం!?

అగ్రస్థానాల్లో ఆడవాళ్ళను చూడగలగాలి. ఇదో ముచ్చట. కానీ అదేమిటో, ఈ ముచ్చట ఇంట తీరకపోయినా, ఈ మధ్య బయిట తీరుతోంది. ఈ దేశపు స్త్రీలకు ఇంట దక్కని అవకాశాలు, బయిట దక్కుతున్నాయి.  Advertisement నిన్న…

అగ్రస్థానాల్లో ఆడవాళ్ళను చూడగలగాలి. ఇదో ముచ్చట. కానీ అదేమిటో, ఈ ముచ్చట ఇంట తీరకపోయినా, ఈ మధ్య బయిట తీరుతోంది. ఈ దేశపు స్త్రీలకు ఇంట దక్కని అవకాశాలు, బయిట దక్కుతున్నాయి. 

నిన్న అమెరికా, నేడు బ్రిటన్‌. అమెరికాలో ఉపాధ్యక్ష పదవిలో భారతీయ సంతతికి (తండ్రి ఆఫ్రికన్‌, తల్ల భారతీయురాలు), చెందిన కమల హారిస్‌ వున్నారు. అది కూడా భారత ఉపరాష్ట్రపతి పదవి లేదా, ఉప ప్రధాని పదవి లాంటిది కాదు. అధ్యక్షుడిగా వున్న జోబిడెన్‌ ఇలా దిగితే, అలా ఆ కుర్చీని భర్తీ చెయ్యగల హోదా. 

బ్రిటన్‌లో మరో భారతీయ సంతతికి చెందిన మహిళ కూడా బ్రిటన్‌ ప్రధాని పదవి పోటీటో వున్నారు. ఆమె ఎవరో కాదు. సుయెల్లా బ్రేవర్‌మాన్‌. (ఈమె కూడా అంతే. తల్లి కెన్యా నుంచి వస్తే, తండ్రి గోవాకు చెందినవారు). అంటే ఆమె వెంటనే ప్రధాని అవుతారని కాదు. 

ఆమెతో పాటు మరో భారతీయుడు పేరు కూడా చక్కర్లు కొడుతోంది. ఆయన ఎవరో కాదు, ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్‌. ఈయన కన్నా ముందు పాకిస్తానీ సంతతికి చెందిన సజీద్‌ జావిద్‌, ఆపైన జెరిమీ హంట్‌ వున్నారు. వీళ్ళల్లో ఎవరినయినా, అ పదవి వరించవచ్చు. అది వేరే విషయం. కానీ స్వతంత్రంగా రాజకీయంగా ఎదగాలన్న భారతీయ మహిళలకు, దేశంలో కన్నా, దేశం వెలుపల` అందునా బాగా అభివృద్ది చెందిన దేశాల్లో` అవకాశాలు పెరగటం ఆశ్చర్యకరమే. 

దేశంలో చూస్తే మొత్తం 29 రాష్ట్రాలలో ఒకే ఒక్క రాష్ట్రంలోనే (పశ్చిమ బెంగాల్‌) లోనే మహిళ( ముఖ్యమంత్రిగా) వున్నారు. ఇందిరా గాంధీ తర్వాత ఆ పోస్టుకు పోటీ పడే భారతీయ మహిళలే కరవయ్యారు. సోనియా పోటీ పడినా, ఆమె ఇటాలియన్‌ సంతతికి చెందిన మహిళగానే చూశారు. ఆమె కూడా, ప్రధానికి బదులు పాలక కూటమి (యూపీయే) చైర్‌పర్సన్‌ పదవిని సృష్టించుకొని, అక్కడ కూర్చోవలసి వచ్చింది. ఎన్డీయే వచ్చాక కూడా పరిస్థితి. నామ మాత్ర పదవి అయిన దేశ రాష్ట్రపతికి మహిళను (ద్రౌపది ముర్మురు)ను బరిలోకి దించుతున్నారు కానీ, ప్రధాని పదవిలోకి అలాంటి యోచన చెయ్యటం లేదు. 

ఆ విషయం అలా వదిలేస్తే, ఎన్నికలకు వేళ కాని వేళ, బ్రిటిన్‌ ప్రదానిని మార్చటమేమిటి? పాలక పక్షం అదే (కన్సర్వేటివ్‌ పార్టీయే). ఆ పార్టీకు బ్రిటన్‌ పార్లమెంటులో వున్న బలమూ అదే. ఏదీ దగ్గలేదు. మరి ఈ అర్థాంతరపు పరిణామం ఏమిటి? ఇంటర్వెల్‌ ఇచ్చుకునే సమయంలో ఈ ‘శుభం కార్డు’ ఏమిటి? బోరిస్‌ జాన్సన్‌ నచ్చలేదు. అంతే. ఎవరికీ? సొంత పార్టీ వాళ్ళకే. ఇంకా చెప్పాలంటే సొంత మంత్రులకే. అందుకే కన్సర్వేటివ్‌ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజీనామా చేసేశాడు. ఈ పార్లమెంటరీ పార్టీ తన అంతర్గత ఎన్నిక విధానంతో మరో నేతను ఎంచుకునేంతవరకూ జాన్సనే కొనసాగుతారు. 

ఇంతకీ సొంత పార్టీ వారికే నచ్చని పనులు ఈయన ఏం చేశారు? బ్రిటన్‌ రాజకీయ విశ్లేషకుల నిర్థారణలను బట్టి ప్రధానిగా జాన్సన్‌ పతనానికి అయిదు కారణాలున్నాయి:

ఒకటి: తన (కన్సర్వేటివ్‌ పార్టీ డిప్యూటీ చీఫ్‌ విప్‌) అసభ్య ప్రవర్తనను సమర్ధించటం. ఒక పార్టీలో ఇద్దరు మగవాళ్ళ పట్లే బహిరంగంగా లైంగికోద్రేకాన్ని ప్రదర్శించే విధంగా ప్రవర్తించాడు. అది కూడా ఒక పార్టీలో తప్పతాగాక. దీని ప్రతిపక్షాలు సహా అందరూ గగ్గోలు పెట్టినా, ప్రధానిగా జాన్సన్‌ ఎలాంటి చర్యా తీసుకోలేదు. 

రెండు: జాన్సన్‌ ‘పార్టీగేట్‌’ వ్యవహారం. ఇది మరీ అమెరికాలో నిక్సన్‌ ‘వాటర్‌ గేట్‌’ స్కామ్‌ అంత తీవ్రమయినదా, అంటే, కాక పోవచ్చు. కానీ, అంతే చెడ్డ పేరు తెచ్చింది. ఒక పక్కనే తానే బ్రిటన్‌లో తొలిసారిగా కోవిద్‌ కారణం ‘లాక్‌ డౌన్‌’ ప్రకటించి, తానే ఉల్లంఘిస్తే ఎలా వుంటుంది? ( ఇదే బోరిస్‌ జాన్సన్‌ కోవిద్‌ బారిన పడి, ఐసీయూలో మృత్యువు చివరి అంచు వరకూ వెళ్ళి వచ్చిన వాడన్నది గమనార్హం.) డౌనింగ్‌ స్ట్రీట్‌లో ఒక పార్టీ జరిగింది. ఆ పార్టీకి తగ్గట్టుగా తనకో ‘కిక్కు’ వచ్చే పేరు పెట్టారు. ‘బ్రింగ్‌ యువర్‌ వోన్‌ బూజ్‌’ (నీ మందు నువ్వు తెచ్చుకో). దానికి జాన్సన్‌ దర్జాగా హాజరయి, అంతే దర్జాగా అందరికీ, కడకు మీడియాకీ దొరికి పోయారు. దీని గురించి కూడా ఆయన పెద్దగా పశ్చాత్తాప పడిరది లేదు. సాదా సీదా ‘సారీ’తో సరిపుచ్చుకున్నారు.

మూడు: జనం బతుకులు భారం. కోవిడ్‌ తగ్గుతున్న సమయంలో ధరలు విపరీతంగా పెరిగాయి. ద్రవ్యోల్బణం ఇండియాలోలాగా  ‘జోడంకెలు’ తాక లేదు కానీ, దగ్గరదగ్గర కొచ్చేసింది. 9.1 శాతం నమోదయ్యింది. పన్నులు పెంచేశారు. జనం పడుతున్న ఈ అసౌకర్యంగా రాజకీయంగా తమ పార్టీకి అంతకు మంచిది కాదని, కన్సర్వేటివ్‌ పార్టీలో పలువురు భావించారు. 

నాలుగు: క్విడ్‌ ప్రోకో. మరీ జాన్సన్‌ కాదు. కానీ, ఆయన అనుయాయుడయిన ఓవెన్‌ పాటెర్సన్‌ తనకు ఆర్థిక లబ్ధి చేకూర్చిన కంపెనీలకు మేళ్ళు చేశాడన్న అభియోగాలు ఎదుర్కున్నారు. 

అయిదు: యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) నుంచి వైదొలిగే ‘బ్రెక్సిట్‌ ప్రక్రియ’ ను వేగవంతంగా కొనసాగిస్తానన్న హామీతో గద్దెనెక్కిన జాన్సన్‌, ఆ పని చెయ్యటం సరికదా, ఆచరణాత్మకంగా మొదలే పెట్టలేక పోయారు. ఇది అన్నిటికన్నా పెద్ద వైఫల్యం. ఈ వైఫల్యాన్ని జాన్సన్‌ మొయ్యగలరేమోకానీ, కన్సర్వేటివ్‌ పార్టీ మొయ్యలేదు. ఈ వైఫల్యంతో తర్వాత ఎన్నికలను ఎదుర్కోలేదు. 

అయితే, ఈ వైఫల్యాలకు తిరుగు బాటు ఎక్కడో రాలేదు. తన కార్యనిర్వాహక శాఖలోనే వచ్చింది. మంత్రివర్గం నుంచి ఒకరి తర్వాత ఒకరు రాజీనామాల పరంపర కొనసాగించారు. తాను ఈ వైఫల్యాలను సరిచెయ్యగలనని బోరిస్‌ జాన్సన్‌ వారికి నచ్చచెప్పలేక పోయారు. దాంతో నాయకత్వపు మార్పు తప్పలేదు. ఈ మార్పును పార్టీ అక్కడ అంతర్గత ఎన్నికల ద్వారా చేస్తుంది. 

కనీసం పది మంది ఎం.పీల మద్దతు వున్న ఎవరయినా, ‘నేను ప్రధ్రానికి పోటీ పడుతున్నాను’ అన్ని ముందుకు రావచ్చు. వారికి ఎంపీలు వోటు వేస్తారు. లెక్కింపు రెండు రౌండ్లలో జరుగుతుంది. మొదటి రౌండ్లో 18 వోట్ల కన్నా తక్కువ వున్న వారిని రెండో రౌండ్లలో 36 కన్నా తక్కువ ఉన్న వారినీ తొలగిస్తారు. ఇలా బరిలో వున్న వారిలో తక్కువ వున్న వారిని తొలగించు కుంటూ వెళ్ళి విజేత ను నిర్ణయిస్తారు. 

ఈ ప్రక్రియను చేపట్టి, ముగించటానికి కొంత సమయం ( నెలా, రెండు నెలలు) పడుతుంది. అంతవరకూ బోరిస్‌ జాన్సన్‌ ప్రధానిగా కొనసాగుతారు. మన దేశంలో ప్రధాని సరే, ఏ ముఖ్యమంత్రి ఎన్నికా ఇలా జరగదు. పార్టీ అధినేతో, అధిష్ఠాన వర్గమో ఈ మార్పు చేసేస్తూ వుంటుంది. బ్రిటన్‌ లో భారత సంతతి వారు పోటీ పడగలుగుతున్నారంటే, పార్టీలోని ఈ అంతర్గత ప్రజాస్వామ్యం కూడా ఒక కారణం కావచ్చు.