ప‌య్యావుల‌కు స‌ర్కార్ షాక్‌

టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మ‌న్ ప‌య్యావుల కేశ‌వ్‌కు జ‌గ‌న్ స‌ర్కార్ షాక్ ఇచ్చింది. త‌న‌కు భ‌ద్ర‌త పెంచాల‌ని ఇటీవ‌ల ప్ర‌భుత్వానికి ఆయ‌న లేఖ రాశారు. ఇదే ఆయ‌న త‌ప్పైంది. ఉన్న భ‌ద్ర‌త‌ను కూడా తొల‌గిస్తూ…

టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మ‌న్ ప‌య్యావుల కేశ‌వ్‌కు జ‌గ‌న్ స‌ర్కార్ షాక్ ఇచ్చింది. త‌న‌కు భ‌ద్ర‌త పెంచాల‌ని ఇటీవ‌ల ప్ర‌భుత్వానికి ఆయ‌న లేఖ రాశారు. ఇదే ఆయ‌న త‌ప్పైంది. ఉన్న భ‌ద్ర‌త‌ను కూడా తొల‌గిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డం చర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌భుత్వం క‌క్ష సాధింపు చ‌ర్య‌కు పాల్ప‌డింద‌ని టీడీపీ విమ‌ర్శిస్తోంది.

ప‌య్యావుల‌కు 1 ప్ల‌స్ 1 భ‌ద్ర‌త వుంది. ఇటీవ‌ల పెగాస‌స్‌, ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారాల‌పై ప‌య్యావుల కేశవ్ ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు త‌మ ఫోన్ల‌ను ప్ర‌భుత్వం ట్యాప్ చేస్తోంద‌ని ఘాటు ఆరోప‌ణ‌లు చేశారు. ఇదే సంద‌ర్భంలో తన‌కు భ‌ద్ర‌త పెంచాల‌ని ఆయ‌న స‌ర్కార్‌కు లేఖ రాయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

భ‌ద్ర‌త పెంచుతార‌ని భావించిన ప‌య్యావుల‌… ఉన్న వాళ్ల‌ను కూడా వెన‌క్కి రావాలని స‌ర్కార్ ఆదేశించింద‌ని తెలుసుకుని షాక్‌కు గుర‌య్యారు. పెగాస‌స్‌, ఫోన్ ట్యాపింగ్‌పై ప‌య్యావుల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం వ‌ల్లే ప్ర‌భుత్వం క‌క్ష సాధింపున‌కు దిగింద‌ని టీడీపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. 

ప్ర‌తిప‌క్ష పార్టీ ప్ర‌జాప్ర‌తినిధికి భ‌ద్ర‌త ఉప‌సంహ‌రించుకోవ‌డం ఏంట‌ని టీడీపీ నిల‌దీస్తోంది. ప‌య్యావుల ర‌క్ష‌ణ భ‌ద్ర‌త ప్ర‌భుత్వానిదే అని టీడీపీ హెచ్చ‌రిస్తోంది. మ‌రో వైపు ప‌య్యావుల కేశ‌వ్ భ‌ద్ర‌త‌ను తొల‌గించ‌లేద‌ని పోలీస్ అధికారులు వెల్ల‌డించారు. దీనిపై మ‌రింత స్ప‌ష్ట‌త రావాల్సి వుంది.